
మందుబాబుల వీరంగం అంతా ఇంతా కాదు. తాగారంటే రచ్చ రచ్చే. ఎవరికి వినరు. ఎవరు చెప్పినా పట్టించుకోరు. వారు చెప్పిందే వేదం. వారు వాగిందే చట్టం. అంతా మా ఇష్టం అంటూ రెచ్చిపోతారు. తాగితే తమ వారు ఎవరు లేరు అంటూ వాగుతారు. తాజాగా శ్రీకాకుళం జిల్లా జి.సిగడాం మండలం ఆనందపురంలో ఇలాంటి సంఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే గ్రామానికి చెందిన వెంకటరమణ కొద్ది రోజులుగా మద్యానికి బానిసయ్యాడు. ఈ క్రమంలో ఆదివారం సైతం తాగి రోడ్డు మీదకు వచ్చి నానా హంగామా సృష్టించాడు. చివరికి గ్రామ సచివాలయం ఫర్నిచర్ సైతంధ్వంసం చేశాడు. అడ్డు వచ్చిన వారిని చితకబాదాడు. పోలీసుల చేతికి చిక్కినా అతనిలో మార్పు కనిపించలేదు.
మా ప్రభుత్వం మా ఇష్టం అంటూ గొడవకు దిగాడు. అడ్డొస్తే పోలీసులనైనా నరికి పారేస్తా అంటూ దుర్భాషలాడాడు. తాగుబోతును కట్టడి చేయడానికి పోలీసులు చాలా కష్ట పడాల్సి వచ్చింది. అతడు చేసిన వ్యాఖ్యలపై స్థానికంగా చర్చ జరుగుతోంది. రాష్ర్టంలో మద్యపాన నిషేధం పెడతామని సర్కారు ఒకవైపు భావిస్తుంటే తాగుబోతు వీరంగం సంచలనం రేకెత్తిస్తోంది. మందుబాబులకు ఎంత స్వేచ్ఛ ఉందో అర్థమైపోతోంది. పీకలదాకా తాగడం అడ్డొస్తే ఇలా రచ్చ చేయడం మామూలైపోయింది.
రాష్ర్టంలో అంచెలంచెలుగా మద్యపాన నిషేధం విధిస్తామని ప్రభుత్వం చెబుతున్నా ఇలాంటి సంఘటనలు చోటుచేసుకోవడం బాధాకరం. గతంలో మున్సిపల్ ఎన్నికల సందర్భంలో కూడా తాగుబోతుల నుంచి విన్నపంతో కూడిన ఒక డిమాండ్ జగన్ కు వచ్చింది. కర్నూలు జిల్లా నంద్యాల మున్సిపాలిటీలో 29వ వార్డుల బ్యాలెట్ లలో మందుబాబులు తమ డిమాండ్స్ తో స్లిప్పులు వేశారు.
రాష్ర్టంలో మద్యం విచ్చలవిడిగా దొరుకుతుండడంతోనే మందుబాబులు రెచ్చిపోతున్నట్లు తెలుస్తోంది. వీరిని కట్టడి చేయాలంటే మద్యనిషేధం ఒక్కటే పరిష్కారం. అందుకే ప్రభుత్వం సంపూర్ణ మద్య నిషేధం దిశగా ప్రణాళికలు వేస్తున్నా అక్కడక్కడ ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం దారుణమే. ఈ నేపథ్యంలో మద్య నిషేధంపై ప్రభుత్వం ఏ మేరకు నిర్ణయం తీసుకుంటుందో వేచిచూడాల్సిందే.