ఇటీవల కురిసిన భారీ వర్షాలు తెచ్చిన చేటు అంతాఇంతా కాదు. ఆస్తినష్టం.. పంట నష్టం ఏమోగానీ ప్రాణ నష్టం కూడా కలిగింది. నిన్నటి నుంచి వరదలు తగ్గుముఖం పట్టడంతో ఒక్కొక్క శవం బయటపడుతోంది. నాలాలు, చెరువుల్లో పడి కొట్టుకుపోయిన వారంతా ప్రాణాలు కోల్పోయి ఒక్కొక్కరుగా ఎవరా అనేది వెలుగులోకి వస్తున్నారు. ఏ నిమిషాన ఏ వార్త వినాల్సి వస్తుందన్న భయాందోళనలకు నగర గురవుతున్నారు.
Also Read: కేసీఆర్.. సచివాలయం.. ఓ డ్రైనేజీ వ్యవస్థ
ఈ మధ్య కాలంలో అయితే విపత్తు సమయాల్లో ఇలాంటి భారీ ప్రాణ నష్టం చూడలేదు. విపత్తును అంచనా వేయటంలో లోపం.. తీవ్రతను ప్రభుత్వం గుర్తించి.. అధికారుల్ని అలెర్టు చేసినా.. వారు ప్రజలకు జాగ్రత్తలు చెప్పే విషయంలో దొర్లిన తప్పులే భారీ ప్రాణ నష్టానికి కారణంగా చెబుతున్నారు.
ఎంతో పెద్ద మహానగరంగా చెప్పుకునే హైదరాబాద్‌లో మొన్నటి వర్షానికి ప్రజలంతా వణికిపోయారు. ఒక్క గురువారం రోజే 12 శవాలు కొట్టుకువచ్చాయి. వీటిలోచాలావరకు బైకుల మీద బయటకు వెళ్లి.. వరద తీవ్రతను అంచనా వేయటంలో విఫలం కావటమే కారణంగా భావిస్తున్నారు. హైదరాబాద్‌లోని చెరువులు.. నాలాల్లో కొట్టుకొస్తున్న శవాలు వివిధ ప్రాంతాలకు చెందిన వారున్నారు. తొర్రూరుకు చెందిన ప్రణయ్.. జైదీప్ లు బైక్ మీద బయటకు వెళ్లారు. తుర్కయాంజాల్‌లో పొంగిపొర్లుతున్న మాసబ్ చెరువు అలుగును దాటే ప్రయత్నంలో ప్రవాహ తీవ్రతకు కొట్టుకుపోయారు. వీరి మృతదేహాలు బయటకు వచ్చాయి. అదే రీతిలో తారామతి పేట్ ఔటర్ రింగురోడ్డు వద్ద చెట్టు వద్దకు మరో మృతదేహం కొట్టుకొచ్చింది. మరణించిన వ్యక్తి హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన విపిన్ కుమార్‌గా గుర్తించారు. ఇతను గౌరెల్లిలో ఉంటున్నాడు.
Also Read: హైదరా‘బాధ’: ఎవ్వరినీ పలకరించినా కన్నీటి వరదే.!
గల్లంతై.. ఇప్పుడు శవాలుగా కొట్టుకొస్తున్న వారంతా ఏదో ఒక వాహనంపై ప్రయాణించిన వారే. వదరను అంచనా వేయడంలో జరిగిన లోపంతో వారు ప్రాణాలను పోగొట్టుకున్నారు. ఇదిలా ఉంటే.. నగరానికి చెందిన పలువురి ఆచూకీ ఇంకా దొరకడం లేదని తెలుస్తోంది. రోజులు గడుస్తున్నా.. వారి నుంచి ఎలాంటి కబురు రాకపోవటంతో బాధితుల కుటుంబాలు భయాందోళనలో ఉన్నాయి. ఏ నిమిషాన ఎలాంటి కబురు వినాల్సి వస్తుందోనన్న ఆవేదనలో ఉన్నారు. ఇక ముందైనా ఇలాంటి పొరపాట్లు జరగకుండా ప్రభుత్వం తరఫున గట్టి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.