Homeజాతీయ వార్తలుకెసిఆర్ గారూ, ప్రజల జీవితాలతో చెలగాటమాడకండి

కెసిఆర్ గారూ, ప్రజల జీవితాలతో చెలగాటమాడకండి

cmkcr

కెసిఆర్ , ఈ పేరంటేనే మీడియా కి భయం. ప్రభుత్వ వైఫల్యాలు ఎన్నున్నా ఎత్తిచూపాలంటే ఒకటికి పదిసార్లు ఆలోచిస్తారు. ఏమిరాస్తే ఏమి వస్తుందో అని భయపడుతూ మీడియా ఓనర్లు బతుకు వెళ్లదీస్తున్నారు. కరోనా వార్తల్లో ఈ భయం మరీ ఎక్కువ. దేశంలోనే అతితక్కువ టెస్టులు చేస్తున్నా తాటికాయంత అక్షరాల్లో హెడ్డింగ్ పెట్టి ఫ్రంట్ పేజి లో రాసే దమ్ము, ధైర్యం లేదు. అంతకన్నా దారుణం కరోనా బాధితులు చనిపోతే రికార్డుల్లో ఎక్కని కేసులు లెక్కలేనన్ని. గణాంకాల ద్వారా ఎలా మభ్యపెట్టొచ్చో కెసిఆర్ ని అడిగితే సరి. ఇందులో పిహెచ్ డి చేసింది కెసిఆర్ ప్రభుత్వం. ప్రైవేటు ఆసుపత్రులు ఇష్టారాజ్యంగా దోచుకుంటున్నా కిమ్మనకుండా చోద్యం చూస్తుంది  ప్రభుత్వం.     దీనికి కారణం లేకపోలేదు. ప్రైవేటు ఆసుపత్రులు ప్రభుత్వం ఎలా చెబితే అలా నడుచుకుంటున్నాయి. కరోనా పాజిటివ్ తో ఆసుపత్రిలో చేర్చుకున్నా, కావలసినంత డబ్బులు గుంజినా , చివరకు ప్రభుత్వ రికార్డుల్లో కరోనా తో చనిపోయినట్లు రిపోర్టు చేయకుండా ఉండటానికి పూర్తి సహకారం చేస్తున్నాయి ప్రైవేటు ఆసుపత్రులు. మరి ఇది ఉభయతారకంగా వుంది కదా.

Also Read: దుబ్బాక బరిలో సీఎం కూతురు?

కెసిఆర్ ప్రభుత్వం పై ఓ మహిళ పెట్టిన వీడియో వైరల్ అయ్యింది. ధైర్యంగా ముందుకొచ్చి తెలంగాణా ప్రభుత్వం కెసిఆర్ ఆధ్వర్యం లో ఎలా ప్రజల జీవితాలతో చెలగాట మాడుతుందో వివరంగా చెప్పింది.

కెసిఆర్ ని ఉతికారేసిన మహిళా Telangana Woman on KCR Govt. on Present situation # 2day 2morrow

ఆ మాత్రం ధైర్యం మన జర్నలిస్టులకు లేపాయే. హైదరాబాద్ అంతా బాగుందని బయట ప్రపంచాన్ని నమ్మబలుకుతున్నాడు కెసిఆర్. మరి నిజం అదికాదని ఎలా చెప్పగలం? మావంతు కృషిగా ఈ వీడియో ను మా సైట్ లో అటాచ్ చేస్తున్నాము. మిగతావారు కూడా అలా చెయ్యాలి. మీరు రాయలేకపోతే కనీసం ఇటువంటి వీడియోలు అటాచ్ చేస్తే చాలు, ప్రజలకు నిజాలు తెలుస్తాయి. నాకు తెలిసిన మిత్రుల తాలూకు కేసులే ఇలా రికార్డ్ కాకుండా వున్నాయని చెబుతున్నా. ఈ నా ఆరోపణలకు కట్టుబడి వున్నాను. ప్రభుత్వాన్ని ఛాలెంజ్ చేస్తున్నా కాదని నిరూపించమని. ఇంత బూటకం, నాటకం ఎందుకు? ఏం ఎక్కువ కేసులు వస్తే, ఎక్కువ మరణాలు వుంటే ఆత్మరక్షణ లో పడతారనా? మీ ప్రయత్నం లో లోపం లేనంతవరకూ ప్రజలు మిమ్మల్ని అర్ధం చేసుకుంటారు కెసిఆర్ గారు. ఉదాహరణకు ఇండియా టుడే ‘మూడ్ అఫ్ ది నేషన్’ పోల్ లో కరోనా ని హేండిల్ చేయటం లో మోడీ ని నూటికి 80 శాతం పైనే ప్రశంసించారు. కెసిఆర్ కూడా పారదర్శకంగా వుంటే కేసులు ఎక్కువైనా , మరణాలు ఎక్కువైనా తనపనిలో లోపం లేనంతవరకు ప్రశంసిస్తారు కదా. అసలు సమస్యని తక్కువచేసి చూపటం లో వచ్చిన ప్రయోజనమేమిటో అర్ధంకావటం లేదు.

కెసిఆర్ కొన్ని విషయాల్లో ధృఢమైన నిర్ణయాలే తీసుకున్నాడు. అంతమాత్రాన తప్పుడు నిర్ణయాలు తీసుకున్నప్పుడు వుపేక్షించాల్సిన పనిలేదు. దొర లక్షణాలు కెసిఆర్ లో బాగా వున్నాయి. తను చెప్పిందే వేదం, తన మాటను ఎవరూ జవ దాటకూడదు. ఎవరైనా అలా చేస్తే ఎంతదాకా అయినా వెళ్లి తాట తీస్తాను అంటాడు. ఇటువంటి లక్షణం వున్నవాళ్ళు కొన్ని మంచి పనులూ చేస్తారు. కొన్ని చెడ్డ పనులూ చేస్తారు. అది వాళ్లకు నచ్చాలి. ఒకరిమాట వినరు. ఇది బలమైన నాయకత్వం అనేదానికన్నా నియంతృత్వ లక్షణం అని చెప్పొచ్చు. బలమైన నాయకుడంటే పదిమందికోసం, పదిమంది మెచ్చినవి ధైర్యం తో చేయగలిగేవాడు. నియంత అలాకాదు తనమాటే చెల్లాలి అనే మనస్తత్వం వుంటుంది. కెసిఆర్ రెండో రకం. ఇంతమంది ప్రాణాలు గాలిలో కలిసి పోతుంటే కప్పిపుచ్చాలని ప్రయత్నించటం క్షమించరాని నేరం. వున్నది ఉన్నట్లుగా చూపి నా ప్రయత్నం లో లోపం లేదు నేను చేయగలిగిందంతా చేసాను అని ప్రజలముందు పెడితే ప్రజలు అర్ధం చేసుకునేవాళ్ళు. కానీ ఇలా టెస్టులు చేయకుండా , మరణాలు కప్పిపుచ్చి దొంగ  లెక్కలు చూపిస్తే ప్రజలు తిరగబడతారని మరిచిపోవద్దు.

Also Read: తెలిసిందిగా.. కేటీఆరే వర్కింగ్ సీఎం అన్నట్టు?

దేశం మొత్తం మీద ఇలా విపరీత మనస్తత్వం తో ప్రవర్తించే వాళ్ళలో ఇద్దరు ప్రముఖంగా కనిపిస్తున్నారు. ఒకరు మమతా బెనర్జీ, రెండు కెసిఆర్. వీళ్ళిద్దరూ దాదాపు కరోనా మహమ్మారి ని కట్టడి చేయటం లో ఒకలాగానే ప్రవర్తించారు. ముందుగా మీడియా ని కట్టడి చేసారు. అధికార యంత్రాంగాన్ని గుప్పెట్లో పెట్టుకొని తాము ఆడిందే ఆట పాడిందే పాట లాగా ప్రవర్తిస్తున్నారు. టెస్టులు చేయరు, ఆసుపత్రి సౌకర్యాలు అరకొర, మరణాలు కరెక్టుగా రికార్డు చేయరు. ఎవరైనా ప్రశ్నిస్తే నోరేసుకొని పడిపోతారు. జనం భయంతో గమ్మున కూర్చునేటట్లు చేస్తున్నారు. ఇలానే వుంటే ఆ నిశబ్దం నుంచే నిశబ్ద విప్లవం పుడుతుంది. అది జరిగే రోజు ఎంతో దూరం లో లేదు. కెసిఆర్ గారూ ఇప్పటికైనా బుద్ధితెచ్చుకొని ఎక్కువ టెస్టులు చేయించండి. అసలు మనమెక్కడ ఉన్నామో అర్ధంచేసుకోనివ్వండి. ఆసుపత్రి సౌకర్యాలు మెరుగుపరచండి. మరణాలు వున్నది వున్నట్లు చూపించండి. అప్పుడే సరైన ప్రత్యామ్నాయాలు కనిపెడతారు. అంతేగానీ కప్పిపుచ్చితే నిజం ప్రజలకు తెలియదనుకోవద్దు. ప్రజలను గొర్రెలమందలనుకొనే రోజులు పోయాయి. తప్పు మీద తప్పు చేసి ప్రజలు తిరగబడేటట్లు చేసుకోకండి. మాకు మీరు డిక్టేటర్ అయినా పర్వాలేదు కానీ బెనవలెంట్ డిక్టేటర్ గా వుండండి. ప్రజలు మీకు బ్రహ్మరధం పడతారు లేకపోతే బ్రహాస్త్రం ప్రయోగిస్తారు , తస్మాత్ జాగ్రత్త.

Ram
Ramhttps://oktelugu.com/
An Independent Editor, Trend Stetting Analyst.
Exit mobile version