Homeజాతీయ వార్తలుఅగ్గి రాజేయకండి, బాధ్యతాయుతంగా ప్రవర్తించండి

అగ్గి రాజేయకండి, బాధ్యతాయుతంగా ప్రవర్తించండి

ఢిల్లీ అల్లర్లను నియంత్రించే పనుల్లో ప్రభుత్వముంటే అగ్గిరాజేసే పనుల్లో కొన్ని మీడియా సంస్థలు, అంతర్జాతీయ సంస్థలు వున్నాయి. ఇది దురదృష్టకరం, అభ్యంతరకరం. మృతుల్లో ముస్లింలు ఎంతమంది, హిందువులు ఎంతమంది అనే స్కోర్ కౌంట్ లో కొన్ని మీడియా సంస్థలు ఉండటం దురదృష్టకరం. ముస్లింలయినా , హిందువులయినా పోయింది మనుషుల ప్రాణాలు అన్న మానవత్వముంటే ఈ పని చేయరు. కావాల్సింది ఏ మతస్తులెంతమందనికాదు ఈ దారుణ మారణహోమాన్ని ఎలా ఆపటం? ఈ ఘోరకలి మరిచిపోయి తిరిగి అందర్నీ కలపటమెలా? ఇది మనసున్న మనుషులు చేయాల్సిన పని. గతాన్ని గుర్తుచేస్తూ అయిన గాయాల్ని మానకుండా చేయటం బాధ్యతగల మీడియా చెయ్యకూడదు. అందుకనే ఇటువంటి క్లిష్టపరిస్థితుల్లో ప్రతి మాట , ప్రతి అడుగు ఆచి తూచి వేయాలి. అంతిమంగా అందరి లక్ష్యం సామరస్యాన్ని పునరుద్ధరించటం, శాంతి ని నెలకొల్పటం. మీడియా ఈ విషయంలో మరింత బాధ్యతగా వ్యవహరిస్తుందని ఆశిద్దాం.

ఇక అంతర్జాతీయ సంస్థలు, అంతర్జాతీయ మీడియా సమస్యను కూలంకషంగా అర్ధంచేసుకోకుండా బాధ్యతారాహిత్యంగా వ్యాఖ్యానించటం చేయదగ్గపనికాదు. ఇందులో ముఖ్యంగా ప్రస్తావించాల్సింది ఐక్యరాజ్యసమితి మానవహక్కుల సంఘం, అమెరికా అంతర్జాతీయ మత స్వేచ్ఛ సంస్థ, ఇస్లామిక్ సహకార సంస్థల వ్యాఖ్యానాలు. ఇవి మూడూ దాదాపు ఒకే భాషను వాడాయి. ఇందులో వాస్తవమెంత? మొదటిగా చెప్పుకోవాల్సింది మైనారిటీలపై దాడులగురించి. ఈ అల్లర్లు రెండు మతస్థుల మధ్య కొట్లాట అయినప్పుడు మైనారిటీలపై దాడులుగా వర్ణించటం సమస్యను ప్రపంచానికి తప్పుగా చూపించి భారత ప్రతిష్టను దెబ్బతీయటానికి పన్నిన కుట్రగా అనుకోవాల్సివస్తుంది. లేదంటే కమ్యూనికేషన్ లోపమన్నా అయివుండాలి. ఇది ఓ విధంగా సమస్యను చక్కదిద్దటానికి ఉపయోగపడకపోగా రెచ్చగొట్టటానికి ఉపయోగపడుతుంది. రెండోది, పౌరసత్వ సవరణ చట్టంపై అవగాహనా లోపంతో మాట్లాడటం. పౌరసత్వ సవరణ చట్టం భారతీయ పౌరులకు సంబంధించినది కాదు. బయటనుంచి దేశంలోపలి కి వచ్చినవాళ్లలో కొంతమందికి త్వరగా పౌరసత్వం కల్పించటానికి సంబందించినది. ఇది ప్రతిదేశమూ పాటించేదే. ఇలా మత పరంగా అన్యాయానికి గురైన క్రైస్తవులకు అమెరికాకూడా పౌరసత్వం కల్పించిందని మర్చిపోవద్దు. మధ్య ఆసియా లో, ఈజిప్ట్ లో నుంచి వచ్చిన వాళ్లకు పౌరసత్వం ఇచ్చినప్పుడు గగ్గోలుపెట్టని సంస్థలు ఇప్పుడెందుకు మాట్లాడుతున్నాయి. ఇక ఇస్లామిక్ సహకార సంస్థ మానవహక్కులగురించి మాట్లాడటం విడ్డూరం. అసలు అందులోని దేశాలు ఎక్కువభాగం ప్రజాస్వామ్య దేశాలు కావు. ఇస్లాం మతం ఆధారంగా చట్టాలు రూపొందించుకున్నవి. వాటికి భారత దేశాన్ని గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు. పాకిస్తాన్ లో, బంగ్లాదేశ్ లో హిందువులపై దాడులు జరిగినప్పుడు మాట్లాడి ఆ దేశాల్ని దారిలో పెట్టివుంటే అక్కడినుండి మైనారిటీల వలసలు ఉండేవి కావు , మనకు వాళ్లకు ఆశ్రయం కల్పించాల్సిన అవసరం ఉండేది కాదు. కాబట్టి ఈ సంస్థలు చెప్పే నీతులు పరిస్థితుల్ని చక్కపెట్టటానికి ఉపయోగపడకపోగా ఇంకా దిగజార్చటానికే ఉపయోగపడతాయి.

ఇక అంతర్జాతీయ మీడియా గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. అవి ఏ రోజూ భారత్ కి అనుకూలంగా లేవు. న్యూయార్క్ టైమ్స్ మొదట్నుంచీ భారత వ్యతిరేకతనే ప్రదర్శిస్తూ వస్తుంది. మోడీ ప్రధాని అయ్యిన తర్వాత ఆ దాడి ఇంకా ఎక్కువ అయ్యింది. ఆ పత్రిక దక్షిణ ఆసియా విభాగం చూసే వ్యక్తులు పూర్తిగా పాకిస్తాన్ అనుకూల వైఖరినే ప్రదర్శిస్తూ వచ్చారు. దాదాపు ఇదే మిగతా పత్రికల పరిస్థితి కూడా. ఇకపోతే అమెరికాలో డెమొక్రాట్ల నాయకత్వానికి పోటీపడే వాళ్లలో ఎక్కువమంది భారత వ్యతిరేక వైఖరి ప్రదర్శిస్తూ వస్తున్నారు. ముఖ్యంగా ముందువరసలో వున్న బెర్నీ సాండర్స్ భారత్ కు వ్యతిరేకంగానే మాట్లాడుతున్నాడు. ఇప్పటివరకు భారతీయుల్లో ఎక్కువమంది డెమొక్రాట్లవైపే వున్నారు. డెమొక్రాట్ అభ్యర్థులు వరసగా ఇటువంటి ప్రకటనలే ఇస్తే అది భారతీయ అమెరికన్లపై ప్రభావం చూపే అవకాశముంది. ఇప్పటికే పౌరసత్వ సవరణ చట్టంపై ఎక్కువమంది ప్రవాసభారతీయులు అనుకూలంగా ప్రదర్శనలు చేయటం చూస్తున్నాము. డెమొక్రాట్లు తమ వైఖరి మార్చుకోకపోతే గంపగుత్తగా భారతీయ అమెరికన్లు ట్రంప్ వైపు మొగ్గే అవకాశముంది. మనముందు ఇటీవల జరిగిన ఇంగ్లాండ్ ఎన్నికల అనుభవముంది. కాబట్టి ఈ అంతర్జాతీయ మీడియా, సంస్థలు, పార్టీలు ఎవరినో సంతృప్తి పరచటానికో , అవగాహనాలోపంతోనో భారత వైఖరి తీసుకుంటే వాళ్ళ ప్రతిష్ట కే నష్టం.

చివరిగా చెప్పేదేమిటంటే భారత్ ఎప్పుడూ విలువల ఆధారంగా పనిచేసే దేశం. పురాతనకాలం నుంచీ అందర్నీ కలుపుకెళ్లిన ఘన చరిత్ర మనది. వీళ్ళ సన్నాయి నొక్కులు అవసరం లేదు. అసలు ఈదేశంలో 1857 తర్వాత పనిగట్టుకొని మతాల వారీగా జనాన్ని విడదీసిన సంస్కృతి బ్రిటిష్ వాళ్ళది. వాళ్ళు రాజేసిన కుంపటి ఇంకా మండుతూనేవుంది. మతం పేరుతో రెండు దేశాలు ఏర్పాటుచేసింది ఈ రాజకీయాలే. వీళ్లు మాకు నీతులు చెప్పాల్సిన పనిలేదు. భారత్ తన ఇంటి సమస్యలను సమర్ధంగా పరిష్కారం చేసుకోగలదు. అంత చేయాలనుకుంటే ఇస్లాం మత వ్యతిరేక చట్టం (Blasphemy ) పేరుతో మైనారిటీలను వేధించే పాకిస్తాన్ చట్టాలని మార్పుచేయించండి. అదిచేతకాకపోతే గమ్మునవుండండి కానీ అన్ని మతాల్ని సమానంగా చూసే భారత్ కి నీతులు చెప్పటానికి సాహసించకండి.

Ram
Ramhttps://oktelugu.com/
An Independent Editor, Trend Stetting Analyst.
RELATED ARTICLES

Most Popular