Donald Trump Vs Joe Biden: అమెరికా ప్రజాస్వామ్య చరిత్ర పరిమాణం 200 ఏళ్లు.. ఎన్నో దేశాలకు మార్గదర్శకంగా నిలబడిన స్వేచ్ఛాయుత ఘనత ఆ దేశానిది. అలాంటి అమెరికాను భ్రష్టు పట్టించిన ఘనత డోనాల్డ్ ట్రంప్ ది. నియంతృత్య పోకడలున్న ఈ వ్యక్తి అమెరికాను అన్ని రంగాల్లోనూ బద్నాం చేశాడు. ఓటమిని అంగీకరించని అతడి నైజం అమెరికాను నవ్వులపాలు చేసింది. తాను ఓడిపోయానన్న అక్కసుతో అమెరికన్ ప్రెసిడెన్షియల్ బిల్డింగ్ మీద దాడి చేయించిన తీరు ఆశ్చర్యానికి గురి చేసింది. ఇంత జరిగినప్పటికీ అతడు త్వరలో జరిగే ఎన్నికల్లో పోటీ చేసి, అమెరికన్ అధ్యక్షుడిగా గెలుస్తానని చెబుతున్నాడు.
రకరకాల కుయుక్తులకు, తెర వెనుక తతంగాలకు పాల్పడిన ట్రంప్ తాజాగా ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కొడుకు మీద నేరారోపణలు చేస్తున్నాడు. బైడెన్ కుటుంబం నేరస్థుల నేపథ్యం కలదని ధ్వజమెత్తుతున్నాడు. తాను చేస్తున్న ఆరోపణలను నిజం చేసేందుకు ఏకంగా లాయర్లను పెట్టుకున్నాడు. కోర్టుల్లో కేసులు నడుపుతున్నాడు. తన మీద నమోదయిన కేసుల మీద పోరాడేందుకు, బైడెన్ పై పెట్టిన కేసులను ముందుకు తీసుకెళ్లేందుకు ట్రంప్ తన లాయర్లపై కొండంత ఖర్చు చేస్తున్నాడు.
వాస్తవానికి ట్రంప్ వ్యవహారాన్ని కేవలం అమెరికాకు సంబంధించిన వ్యవహారంగా చూడలేం. ఎందుకంటే అమెరికా మీద ఆధారపడి ప్రపంచం ఉంది. దాని మారకం డాలర్ మీద ప్రపంచ వాణిజ్యం సాగుతుంది. ట్రంప్ లాంటి నాయకులు ప్రజాస్వామ్య దేశాల్లో ఉంటే వాటి మనుగడకే అది గొడ్డలిపెట్టు. ఎందుకంటే ట్రంప్ తరహా నాయకులు గొడవలకు తెరలేపగలరు. అంతర్యుద్ధాలను ప్రోత్సహించగలరు. తాను అధికారం కోల్పోయిన తర్వాత ప్రెసిడెన్షియల్ భవనం మీద రిపబ్లికన్ పార్టీ వాళ్లు ఎలా చేశారో ఇప్పటికీ గుర్తే ఉంది.
ప్రస్తుతం కోర్టుల్లో తన కేసుల విచారణ ఎదుర్కొంటున్న ట్రంప్.. వాటి విచారణకు సంబంధించి ఏర్పాటు చేసుకున్న న్యాయవాదుల కోసం ధారళంగా డబ్బు ఖర్చు చేస్తున్నాడు. ఒకవేళ ట్రంప్ ను న్యాయబద్ధంగా విచారించాక అతడు నిందితుడు అని కోర్టు సమక్షంలో తేలితే జైలుకు పంపే ధైర్యం ఆ దేశం చేయగలుగుతుందా? రిపబ్లికన్ అతివాదులు రెచ్చిపోతే ఆ దేశం ఏం చేస్తుంది? మరో ఆప్ఘనిస్థాన్ అయితే ఎవరు బాధ్యులు? ఇదంతా ఎందుకు అని కోర్టు అతడిని శిక్ష నుంచి తప్పిస్తే అది ప్రజాస్వామ్యానికి చేసిన అన్యాయం అనిపించుకోదా? ట్రంప్‌ను ఆదర్శంగా తీసుకుని ప్రజాస్వామ్య దేశాల్లోని నాయకులు నియంతృత్వ ధోరణి పెంచుకోరా? ట్రంప్ కేసులకు సంబంధించి తీర్పు కోసం యావత్ ప్రపంచం మొత్తం ఆసక్తిగా చూస్తోంది. ఈ కేసుల్లో తీవ్రత ఆధారంగా ఆయనకు 30 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం కన్పిస్తోంది. మరి ఇది జరుగుతుందా? జరిగితే ట్రంప్ ఏం చేస్తారో వేచి చూడాల్సి ఉంది.