Donald Trump
Donald Trump : రెండో సారి అమెరికా అధ్యక్షుడు అయిన డొనాల్డ్ ట్రంప్ పాలనలో తనదైన శైలిలో దూకుడు పెంచారు. ఈ క్రమంలో ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. పనామా నది మీద పంతం నెగ్గించుకున్నారు. చైనా, కెనడా, పనామా దేశాల మీద సుంకాల కొరడా ఝుళిపించారు. ఆయన తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్ కు కొన్ని అనుమతులు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. జో బైడెన్ దేశ రహస్య సమాచారం తెలుసుకోవాలసిన అవసరం లేదని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ఆయా అనుమతులను రద్దు చేస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు.
ట్రూత్ సోషల్ వేదికగా ఆయన ఈ విషయాన్ని ప్రకటించారు. ‘ప్రస్తుతం జో బైడెన్ రహస్య సమాచారం పొందాల్సిన అవసరం లేదు. అందువల్ల మేము వెంటనే ఆయన భద్రతా అనుమతులను రద్దు చేస్తున్నాం. ఆయన రోజువారీ ఇంటెలిజెన్స్ బ్రీఫింగ్‌లను నిలిపివేస్తున్నాం. 2021లో నాకు ఇంటెలిజెన్స్ కమ్యూనిటీ నుంచి జాతీయ భద్రతా సమాచారం తెలుసుకోవడాన్ని నిలిపివేశారు. దానికి ప్రతిగానే నేను ఈ చర్యలు తీసుకుంటున్నాను. అంతేకాక ఆయన పేళవమైన జ్నాపక శక్తితో బాధపడుతున్నట్లు తెలుస్తుంది. అందువల దేశానికి సంబంధించిన సున్నితమైన సమాచారం విషయంలో జాగ్రత్త వహించాలని నిర్ణయించాం. నేను ఎల్లప్పుడు జాతీయ భద్రతను రక్షిస్తాను.’’ అని ట్రంప్ రాసుకొచ్చారు.
ట్రంప్ నిర్ణయం పై బైడెన్ ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. అమెరికా సంప్రదాయం ప్రకారం అక్కడ మాజీ అధ్యక్షులకు జాతీయ భద్రతకు సంబంధించిన రహస్య సమాచారం తెలుసుకునే వీలు ఉంటుంది. 2020అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ పై జో బైడెన్ గెలిచినప్పుడు ఆయన గెలుపునకు వ్యతిరేకంగా ట్రంప్ మద్దతు దారులు 2021 జనవరి 6న క్యాపిటల్ భవనం పై దాడి చేశారు. ఈ నేపథ్యంలో ట్రంప్ నకు అప్పటి వరకు ఉన్న ఇంటెలిజెన్స్ బ్రీఫింగ్ అనుమతులను రద్దు చేశారు. దీనికి ప్రతీకారంగానే ట్రంప్ తాజాగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
వైట్ హౌస్.. మాజీ ప్రెసిడెంట్ జో బైడెన్ పట్ల కీలక నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది. వైట్ హౌస్ తన అధికారిక X (మునుపటి ట్విట్టర్) ఖాతా ద్వారా ఒక ప్రకటనా విడుదల చేసింది. ఇందులో జో బైడెన్ భద్రత అనుమతి (సిక్యూరిటీ క్లియరెన్స్) రద్దు చేయబడినట్లు తెలిపింది. దీంతో పాటు ఆయనకు అందించే రోజువారీ ఇంటలీజెన్స్ బ్రీఫింగ్ కూడా నిలిపివేయబడింది. ఈ నిర్ణయం తీసుకోవడానికి ప్రధాన కారణం బైడెన్ వారి జాతీయ భద్రతా సమాచారాన్ని నిర్వహించే సామర్థ్యంపై ఉన్న ఆందోళనలు అని పేర్కొంది. ఇందుకు సంబంధించిన రాజకీయ ప్రభావాలు గురించి ఉత్కంఠ నెలకొని ఉంది.