Reviews Of Constituencies: రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో గెలిచేద్దాం.. కాస్తా కృషిచేస్తే అది ఏమంత సాధ్యమయ్యే పనికాదు. గత కొద్దిరోజులుగా ఏపీ సీఎం జగన్ పార్టీ శ్రేణులకు చెప్పే మాట ఇది. అవసరమైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని నియోజకవర్గాలకు సమీక్షిస్తామంటూ చెప్పిన జగన్ ఆ ముచ్చటను ప్రారంభించారు. నియోజకవర్గంలో ఎంపిక చేసిన 50 మంది క్రియాశీలక వైసీపీ నాయకులతో సమీక్షలు మొదలు పెట్టారు. తన బద్ధ విరోధిగా ఉన్న విపక్ష నేత చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నుంచి సమీక్షలు మొదలు పెట్టారు. తరువాత విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గ సమీక్ష పెట్టారు. కానీ నాయకుల నుంచి ఎటువంటి చేదు అనుభవం ఎదురైందో కానీ.. ఆ తరువాత సమీక్షలకే ఏకంగా ఫుల్ స్టాప్ పెట్టేశారు. సమీక్షలపై అటు మీడియాలో కూడా రకరకాల కథనాలు రావడంతో కాస్తా పక్కన పడేశారు. ఇక నుంచి ఇటువంటి సమీక్షలు వద్దంటూ జగన్ స్పష్టం చేసినట్టు వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.

ప్రస్తుతానికైతే కుప్పం, రాజాం నియోజకవర్గాల సమీక్షలు మాత్రమే పూర్తిచేశారు. మిగతా 173 నియోజకవర్గాలు ఇంకా పెండింగ్ లో ఉన్నాయి. అయితే ఎప్పుడు పిలుస్తారా అంటూ ఆయా నియోజకవర్గ నేతలు ఎదురుచూస్తున్నారు. కానీ ఇప్పట్లో పిలిచే అవకాశం లేదని మాత్రం తెలుస్తోంది. సమీక్షలు నిర్వహించిన ఆ రెండు నియోజకవర్గాల నుంచి చెరో 50 మంది క్రియాశీల నాయకులను సీఎం జగన్ ముందు కూర్చోబెట్టారు. అయితే వారంతా కరుడుగట్టిన వైసీపీ నేతలు, అదీ కూడా వైసీపీ ద్వారానే పదవులు పొందిన వారే. ఆర్థికంగా సైతం వీరు లబ్ధిపొందారు. అటువంటి వారినే ఏరికోరి సమావేశానికి తీసుకొచ్చారు. ఏం మాట్లాడాలో..ఎట్టా మాట్లాడాలో ముందే ట్రైనింగ్ ఇచ్చారు. పార్టీకి నష్టం కలిగించే ఎటువంటి వ్యాఖ్యలు చేయవద్దని కూడా వీరికి ఆదేశాలొచ్చాయి. అయితే తీరా సీఎంతో సమావేశం నాటికి ఇందులో కొందరు నాయకులు బ్లాస్ట్ అయ్యారు. అభివృద్ది లేదు. చేసిన పనులకు బిల్లులు లేవు. ప్రజల నుంచి నిలదీతలు, ప్రశ్నలు వస్తున్నాయి. గ్రామాల్లో తిరగలేకపోతున్నామంటూ నేతలుచెప్పేసరికి సీఎం జగన్ లో అసహనం పెరిగింది. ఇదే అంశాలు మీడియాలో హైలెట్ అయ్యాయి. ఒక వద్దు బాబో వద్దు అంటూ మిగతా నియోజకవర్గాల సమీక్షలను సీఎం జగన్ క్యాన్సిల్ చేసేశారని గుసగుసలు వినిపిస్తున్నాయి.

వాస్తవానికి వైసీపీ విజయం వెనుక ఆ పార్టీ నాయకులు, కార్యకర్తల కృషి మరువరానిది. పార్టీ ఆవిర్భావం నుంచి ఎంతోమంది వ్యయప్రయాసలకు గురయ్యారు.ఇబ్బందులను ఎదుర్కొన్నారు. అయినా పార్టీ జెండా వీడలేదు. సొంత డబ్బులు పెట్టి పార్టీని ముందుకు నడిపిన సందర్బాలున్నాయి. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత వీరికి సరైన న్యాయం జరగలేదన్న టాక్ అయితే ఉంది. ఓన్లీ ఎమ్మెల్యే స్థాయి వ్యక్తులు బాగుపడ్డారే తప్ప.. కింది స్థాయి నాయకులు మాత్రం ఆర్థికంగా ఎటువంటి చేయూత లేకుండా పోయింది. అటు ప్రభుత్వ భవనాల నిర్మాణానికి నిధులు, బిల్లులు విడుదల కావడం లేదు., పోనీ పంచాయతీల్లో పనులు జరిపించి కాస్తా రాళ్లు వెనుకేసుకుంటామంటే నిధుల మళ్లింపుతో చుక్కెదురవుతోంది. మొన్న ఆ రెండు నియోజకవర్గాల సమీక్షలో కూడా నేతల అసంతృప్తి సెగ జగన్ కు వీటి ద్వారానే తగిలింది. అయితే ప్రస్తుతం వినే ఓపిక సీఎం జగన్ కులేదు. అలాగని వీటికి నిధులు సమకూరిస్తే సంక్షేమ పథకాలు నిలిపివేయాలి. బటన్ నొక్కడం ఆపేయాలి. అందుకే ఎందుకొచ్చింది ఈ గొడవ అంటూ ఆ సమీక్షలనే ఏకంగా వాయిదావేశారు.
[…] Also Read: Reviews Of Constituencies: గ్రౌండ్ రిపోర్టు వినే ఓపిక … […]