Seethakka: తెలంగాణ ఎన్నికల్లో ప్రతిష్టాత్మక నియోజకవర్గాల్లో ములుగు ఒకటి. ఇక్కడి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా సీతక్క పోటీ చేస్తున్నారు. ఆమెను ఎలాగైనా ఓడించాలని బీఆర్ఎస్ పట్టుదలతో ఉంది. ముల్లును ముల్లుతోనే తీయాలని మావోయిస్టు నేపథ్యం ఉన్న బడే నాగజ్యోతి అనే మహిళ నేతకు టిక్కెట్ ఇచ్చారు. ఆమె పేరుకే అభ్యర్థి. ములుగు నియోజకవర్గ వ్యవహారమంతా బిఆర్ఎస్ కార్యాలయమే చూస్తోంది. ఎలాగైనా సీతక్కని ఓడించాలని తాయిలాలు సైతం పెద్ద ఎత్తున పంచుతున్నారని ప్రచారం జరుగుతోంది. మండలాలు, గ్రామాలను ఇన్చార్జులు నియమించారు. వారికి ఏ లోటు లేకుండా.. అన్ని రకాల వనరులను సమకూర్చుతున్నారు.
సీతక్కకు నియోజకవర్గంలో ప్రత్యేక గుర్తింపు ఉంది. నిత్యం ప్రజలతో మమేకమై పనిచేస్తూ వచ్చారు. విపక్షంగా ఉన్నా.. విలక్షణ వైఖరితో గిరిజనుల మనసును దోచుకున్నారు. కరోనా సమయంలో ఆమె మారుమూల గ్రామాలకు వెళ్లి సాయం చేశారు. కొండ శిఖర గ్రామాలు, రహదారులు లేని తండాలకు వెళ్లి సహాయ చర్యలు చేపట్టారు. ఒక్క ములుగు నియోజకవర్గమే కాదు.. దాదాపు గిరిజన ప్రాంతాల్లో సేవా కార్యక్రమాలు చేపట్టారు. దీంతో నియోజకవర్గంలో ఆమెకు పట్టు పెరిగింది. అందుకే సీతక్కను ఎలాగైనా ఓడించాలని అధికార బీఆర్ఎస్ గట్టి ప్రయత్నం లో ఉంది.
ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నాటి నుంచి ములుగు నియోజకవర్గంపై అధికార బి ఆర్ ఎస్ కన్నేసింది. ప్రత్యేక వ్యూహం రూపొందించుకుంది. అభ్యర్థి నాగజ్యోతి ని పక్కన పెట్టి… బిఆర్ఎస్ను గెలిపించే బాధ్యతను తన సన్నిహితుడు పోచంపల్లి శ్రీనివాసరెడ్డికి కెసిఆర్ అప్పగించారు. అక్కడ బిఆర్ఎస్ కోసం ఒక ప్రత్యేక టీం నడుస్తోంది. కాంగ్రెస్ పార్టీ ద్వితీయ శ్రేణి నాయకత్వాన్ని ప్రలోభాలు పెట్టి మరి బిఆర్ఎస్ లో చేర్చుకుంటున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
అయితే సీతక్క పై ఈ స్థాయిలో ప్రత్యేక ఫోకస్ పెట్టడానికి కారణం… ఆమె ముఖ్యమంత్రి అభ్యర్థి అవుతారన్న ప్రచారమే. ఆమె కానీ గిరిజన ప్రాంతాల్లో పర్యటిస్తే కాంగ్రెస్ వైపు గిరిజనులు మొగ్గు చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందుకే ములుగు నియోజకవర్గంలో ఆమె విషయంలో.. దిగ్బంధం చేస్తే.. రాష్ట్రంలో ఇతర ప్రాంతాల వైపు ఆమె చూడరని బిఆర్ఎస్ వ్యూహం. ప్రస్తుతం సీతక్క ములుగు నియోజకవర్గ వ్యాప్తంగా పర్యటనలు చేస్తున్నారు. ఆమెను గిరిజనులు ఆహ్వానిస్తున్నారు. కాంగ్రెస్ అనుకూల పవనాలు ఒకవైపు.. సీతక్క చరిష్మ మరోవైపు.. ములుగు నియోజకవర్గంలో భారీ మెజారిటీ తెచ్చిపెడుతుందని కాంగ్రెస్ నాయకత్వం ఆశలు పెట్టుకుంది. ఇటువంటి తరుణంలో సీతక్క విషయంలో బిఆర్ఎస్ అనుసరిస్తున్న ద్విముఖ వ్యూహం ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.