Pawan Kalyan BJP: కనిపించని శత్రువుతో యుద్ధం చేస్తున్నాం.. పవన్ సినిమాలో పవర్ ఫుల్ డైలాగ్ ఇది. ఇప్పుడు ఏపీలో తెలుగుదేశం పార్టీ సైతం ఇదే డైలాగ్ ని గుర్తు చేసుకుంటుంది. అయితే బయటికి కనిపిస్తున్న శత్రువు వైసీపీయే కానీ.. కనిపించని శత్రువు మాత్రం ముమ్మాటికి భారతీయ జనతా పార్టీ. అది ప్రతి ఒక్కరికీ తెలిసిన విషయమే. సగటు టిడిపి అభిమాని సైతం బిజెపిని విపరీతంగా ద్వేషిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లోదేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ఓటమి చవి చూడాలని బలంగా కోరుతున్నారు. అయితే ఇటువంటి తరుణంలో బిజెపిని కలుపు కెళ్తామన్న పవన్ ప్రకటన ఆలోచింపచేస్తోంది.
ఏపీ విషయంలో భారతీయ జనతా పార్టీకి ఓ నిర్దిష్ట వ్యూహం ఉన్నట్లు తెలుస్తోంది. 2029 ఎన్నికల్లో అధికారంలోకి రావడమో, ప్రధాన ప్రతిపక్షంలో కూర్చోవడమో.. ఏదో ఒకటి దక్కాలన్న ప్రయత్నంలో బిజెపి ఉంది. అందుకే పవన్ ను వదులుకోవడానికి ఇష్టపడడం లేదు. అయితే పవన్ ఆలోచనలు వేరే విధంగా ఉన్నాయి. వైసిపి నుంచి ఏపీని విముక్తి కల్పించాలన్న ధ్యేయంతో పవన్ పని చేస్తున్నారు. దీంతో బిజెపి, జనసేనలో భిన్న వైఖరులతో ముందుకు సాగుతున్నాయి. ఈ తరుణంలో మూడు పార్టీల మధ్య పొత్తు కుదురుతుందా? లేదా? అన్నది అనుమానమే.
ఎలాగైనా బిజెపిని తీసుకొస్తానని పవన్ ప్రకటించారు. బిజెపి కలిసి రాకుంటే తాను మాత్రం టిడిపి తో జత కడతానని తేల్చి చెప్పారు. అంటే తప్పకుండా బిజెపి కలిసి వస్తుందని పవన్ అంచనా వేస్తున్నారు. కానీ ప్రాంతీయ పార్టీల ఒత్తిడికి తలొగ్గే రీతిలో బిజెపి ఉందా అంటే మౌనమే సమాధానమవుతోంది. ఎన్డీఏ నుంచి శివసేన దూరమైంది. అటు తర్వాత జేడీయు దూరంగా జరిగింది. తాజాగా అన్నా డీఎంకే సైతం గుడ్ బై చెప్పింది. కానీ ఎక్కడ కేంద్రం భయపడిన దాఖలాలు లేవు. వెళ్ళిపోతున్న వారిని ఆపిన పరిస్థితులు లేవు. మోదీ నేతృత్వంలోనే బిజెపి ఒక స్ట్రాంగ్ నిర్ణయానికి వచ్చింది. 2029 నాటికి మిత్రులందరికీ నేరుగా అధికారంలోకి రావాలన్నది బిజెపి లాంగ్ స్టాండింగ్ వ్యూహం. అందుకే మిత్రులు పెద్దగా పట్టించుకోవడం లేదు.
ఇటువంటి తరుణంలో పవన్ హెచ్చరికలను బిజెపి పరిగణలోకి తీసుకుంటుందంటే లేదనే సమాధానం వినిపిస్తుంది. అయితే బిజెపి స్ట్రాటజీ ఎప్పుడు ఒకేలా ఉంటుందని అనుకోకూడదు. ప్రస్తుతం భారతీయ జనతా పార్టీకి ఇండియా కూటమి నుంచి గట్టి ప్రతిఘటన ఎదురవుతోంది. ఈ తరుణంలో మిత్రపక్షాలను దూరం చేసుకోవడం ఆ పార్టీకి సాహస చర్యే. అందుకే పవన్ విషయంలో వెనక్కి తగ్గుతుందన్న ప్రచారం ఉంది. తాజాగా అన్నా డీఎంకే దూరమైంది. మరి కొద్ది నెలల్లో తెలంగాణలో ఎన్నికలు జరగనున్నాయి. ఆ రాష్ట్రం తో పాటు మరో నాలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు బిజెపి వైఖరిని తేల్చనున్నాయి. వాటిలో ప్రతికూల ఫలితాలు వస్తే మాత్రం జనసేన, టిడిపి వంటి పార్టీలకు బిజెపి దగ్గర అయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.