Nara Bhuvaneshwari: చంద్రబాబు జైల్లో కూడా చేతిలో తినరట.. టేబుల్ కావాలట?

భువనేశ్వరి ఒక భార్యగా ఆందోళన వ్యక్తం చేయడంలో తప్పులేదు. చంద్రబాబు వయసు దృష్ట్యా అక్కడ వసతులు ఏర్పాటు చేయడమనేది ముఖ్యం.

Written By: Dharma, Updated On : September 26, 2023 2:54 pm

Nara Bhuvaneshwari

Follow us on

Nara Bhuvaneshwari: చంద్రబాబు రిమాండ్ విషయంలో కోర్టు చాలావరకు మినహాయింపులు ఇచ్చింది. జైలులో ప్రత్యేక వసతులు కల్పించాలని ఆదేశాలు ఇచ్చింది. ఇంటి భోజనంతో పాటు మెడిసిన్ కు అనుమతి ఇచ్చింది. జైలులో ప్రత్యేక గది తో పాటుమరుగుదొడ్డిని సైతం ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించింది. అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు సైతం అధికారులు పూర్తి చేశారు. అటు చంద్రబాబు బెయిల్ పై విచారణలో భాగంగా న్యాయమూర్తి జైలులో వసతులు పై ఆరా తీశారు. కానీ చంద్రబాబు ఎక్కడా వాటిపై న్యాయమూర్తికి ఫిర్యాదు చేయలేదు. కానీ చంద్రబాబు సతీమణి భువనేశ్వరి మాత్రం జైలులో సౌకర్యాలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యంగా చంద్రబాబు భోజనం సమయంలో టేబుల్ ఏర్పాటు చేయకపోవడాన్ని తప్పుపట్టారు. చుట్టూ దోమలతో సహవాసం చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

అయితే భువనేశ్వరి ఒక భార్యగా ఆందోళన వ్యక్తం చేయడంలో తప్పులేదు. చంద్రబాబు వయసు దృష్ట్యా అక్కడ వసతులు ఏర్పాటు చేయడమనేది ముఖ్యం. దానిని ఎవరూ కాదనలేరు. ఓ ఆర్థిక కేసులో, ఓ హై ప్రొఫైల్ కేసులో ఇన్ని రకాల వసతులు ఇవ్వడం విశేషమే. ఎందుకంటేఅవినీతి కేసుల్లో సీఎం జగన్ గతంలో 16 నెలల పాటు రిమాండ్ ఖైదీగా ఉన్నారు.అయితే అప్పట్లో ఆయన ఓ ఆరు నెలలపాటు సాధారణ ఖైదీ మాదిరిగానే జైలులో గడిపారు. ప్రత్యేక వసతులు అంటూ ఏవీ లేవు. అయితే దీనికి కూడా తెలుగుదేశం పార్టీ కారణం. జగన్ నేటి దూకుడుకి కూడా తెలుగుదేశం పార్టీ నేతల వైఖరి ప్రధాన కారణమని తెలుస్తోంది.

అవినీతి ఆరోపణ కేసుల్లో 2012లో సిబిఐ జగన్ను అరెస్టు చేసింది. 16 నెలల పాటు జగన్ రిమాండ్ లో ఉండిపోయారు. కేసు విచారణలో ఉన్నందున సిబిఐ బెయిల్ పై అభ్యంతరాలు వ్యక్తం చేసింది. దీంతో చాలా రోజులు పాటు జగన్ జైల్లో మగ్గాల్సి వచ్చింది. అయితే అప్పటికే రాష్ట్ర విభజనకు కాంగ్రెస్ పార్టీ సిద్ధం కావడం.. ఆందోళనలు జరుగుతుండడంతో జగన్ విషయంలో నాటి కాంగ్రెస్ ప్రభుత్వం కాస్త వెనక్కి తగ్గింది. దీంతో అప్పట్లో జగన్ కు బెయిల్ లభించింది.అయితే జైలులో ప్రత్యేక వసతులు దక్కకుండా చేసిన ఘనత మాత్రం తెలుగుదేశం పార్టీదే.

ఇప్పటి మాదిరిగానే జగన్ సైతం తనకు ప్రత్యేక వసతులు కావాలని సిబిఐ కోర్టుకు దరఖాస్తు చేసుకున్నారు. కానీ నాడు తెలుగుదేశం పార్టీ నాయకులు.. ఓ ఆర్థిక ఉగ్రవాదికి జైల్లో ప్రత్యేక వసతులు ఎలా కల్పిస్తారని ప్రశ్నించారు. దివంగత టిడిపి నేత ఎర్రం నాయుడు అయితే ఏకంగా కోర్టులో పిటిషన్ వేశారు. దీంతో జగన్ కు ఓ ఆరు నెలలపాటు జైలులో ఎటువంటి ప్రత్యేక వసతులు దక్కలేదు. ఓ సాధారణ ఖైదీ మాదిరిగానే రిమాండ్ లో ఉండాల్సి వచ్చింది. అయితే నాడు జగన్ విషయంలో తెలుగుదేశం పార్టీ చర్యలను గుర్తు చేసుకుంటే.. చంద్రబాబు విషయంలో వసతులు లభించడం ఉపశమనం కలిగించే విషయమే. బహుశా భువనేశ్వరికి ఈ విషయం తెలియక ఉండకపోవచ్చు. అందుకే చంద్రబాబు తినేందుకు టేబుల్ సైతం ఏర్పాటు చేయలేదని ఆక్షేపిస్తున్నారు. ఓ భార్యగా ఆమె బాధను అర్థం చేసుకోవచ్చు. కానీ తమ పార్టీ నేతలు గతంలో జగన్ విషయంలో అంతకుమించి వ్యవహరించి ఉన్నారు అని గుర్తుపెట్టుకుంటే మంచిది.