Kumbhmela Magh Purnima : ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ప్రయాగరాజ్ లో ప్రపంచంలోని అతిపెద్ద ఆధ్యాత్మిక పండుగ మహా కుంభమేళా జరుగుతోంది. సంక్రాంతి నాడు ప్రారంభమైన ఈ పండుగలో ఇప్పటివరకూ 40 కోట్ల మందికి పైగా పుణ్యస్నానాలు ఆచరించారని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. ఐతే.. కొంతమంది ఈ స్నానాలపై అభ్యంతరాలను వ్యక్తం చేస్తున్నారు. ఇన్ని కోట్ల మంది చేస్తుంటే అసలు ఇవి పవిత్ర స్నానాలు ఎలా అవుతాయంటూ ప్రశ్నిస్తున్నారు. కుంభమేళాకి వచ్చే అఘోరాలు కొన్ని రోజుల పాటు స్నానాలు చేయరు. మరికొంతమందికి అనేక రకాల రోగాలు, వ్యాధులు ఉంటాయి. ఇక కోట్ల మంది స్నానాలు చేస్తూ ఉంటే.. ఆ నీరు పరిశుభ్రంగా ఉంటుందా? ఆ నీటిలో స్నానం చేస్తే.. ఏ చర్మ వ్యాధులు రావా.. ఆ నీటిలో కాలుష్యం ఉండదా అని ప్రశ్నిస్తున్నారు.
మహా కుంభమేళాను రెండు కోణాల్లో చూడాల్సి ఉంటుంది. అందులో మొదటిది.. త్రివేణీ సంగమంలో స్నానం చేస్తే దాన్ని పవిత్ర స్నానం అని పిలవడానికి కారణం లేకపోలేదు. ఇక్కడ పవిత్రం అంటే.. శరీరం పరిశుభ్రం అవ్వడం మాత్రమే కాదు. మనసు పరిశుభ్రంగా అవ్వడం అనే అర్థం ఉంది. శరీరం పరిశుభ్రం అవ్వాలంటే ప్రయాగరాజ్ దాకా వెళ్లాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం మన ఇంట్లోనే స్నానం చెయ్యవచ్చు. కుంభమేళాకి వెళ్లేవారు.. అనేక ఆధ్యాత్మిక అంశాలను తెలుసుకునేందుకు వెళ్తుంటారు. దైవ అనుభూతిని గ్రహిస్తారు. జీవితానికి నిజమైన అర్థం ఏంటో అక్కడ తెలుసుకుంటారు. అక్కడికి వెళ్లి.. గంగలో స్నానం చేయడం ద్వారా.. తాము పరిశుద్ధులం అవుతున్నామనే భావనతో ఉంటారు. మనసు, ఆత్మ అన్నీ పరిశుద్ధమై, ఇకపై ఏ పాపాలూ చెయ్యనని ప్రమాణం చేస్తారు. అందువల్ల మహా కుంభమేళాలో స్నానం చేయడాన్ని పవిత్ర స్నానంగా భావిస్తారు.
రెండో కోణం సైంటిఫిక్ అంశం. మన దేశంలో ప్రవహిస్తున్న చాలా నదులు కాలుష్య కోరల్లో చిక్కుకున్నాయి. గంగానదికి మాత్రం రెండు ప్రత్యేకతలు ఉన్నాయి. గంగానది నీరు నిరంతరం ప్రవహిస్తూ ఉంటుంది. అందువల్ల ఎప్పటికప్పుడు కొత్త నీరు వస్తుంటుంది. దీనికి తోడు.. ఆ నదిలో బ్యాక్టీరియోఫాగెస్ (Bacteriophages) అనే మంచి వైరస్ ఉంటుంది. ఇది మనుషులకు హాని చేసే బ్యాక్టీరియాలను చంపేస్తుంది. ఇలాంటి బ్యాక్టీరియా గంగానదిలో ఉందని సైంటిఫిక్‌గా తేలింది. గంగానదిలో కూడా పారిశ్రామిక వ్యర్థాలు, గృహ వ్యర్థాలు కలుస్తున్నాయి. అయినప్పటికీ ఈ వైరస్ వల్ల గంగానది నిరంతరం కాలుష్యం లేకుండా మారిపోతుందని పరిశోధనల్లో తేలింది. కుంభమేళా జరిగినప్పుడు ఎక్కడెక్కడి నుంచో వచ్చి కోట్ల మంది స్నానాలు చేస్తా. దీంతో ఆ నీటిలో సబ్బుల వ్యర్థాలు, ఎండిపోయిన పూలు, ఆకులు ఇలా చాలా కలుస్తాయి. దీని వల్ల నీరు కాలుష్యం అవుతుంది. వీటికి తోడు అక్కడే వంటలు వండుకుంటున్నారు, అక్కడే బట్టలు ఉతుకుతారు. ఇలా ప్రభుత్వం చెయ్యవద్దు అని చెప్పిన కొన్ని పనులు కూడా అక్కడ భక్తులు చేస్తుంటారు. దీని వల్ల నీటి పరిశుభ్రత సమస్య వస్తోంది. ఐతే.. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నీటిలో వ్యర్థాలను ఎప్పటికప్పుడు తొలగించే ఏర్పాట్లు చేసింది. అలాగే.. ఎప్పటికప్పుడు వాటర్ ప్యూరిటీ పరీక్షలు కూడా నిర్వహిస్తుంది.
ప్రభుత్వం జరిపిస్తున్న పరీక్షల్లో బయోకెమికల్ ఆక్సిజన్ డిమాండ్ (BOD), డిస్సాల్వ్డ్ ఆక్సిజన్ (DO) లెవెల్స్ చూసే పరీక్షలు చాలా ప్రత్యేకం. వీటి ద్వారా నీటిలో ఎంత కాలుష్యం వెంటనే తెలిసిపోతుంది. తాజా డేటా ప్రకారం.. త్రివేణి సంగమం దగ్గర బయోకెమికల్ ఆక్సిజన్ డిమాండ్ (BOD) లెవెల్ ఒక లీటర్‌కి 3.0ఎంజీగా ఉంది. అలాగే.. డిస్సాల్వ్డ్ ఆక్సిజన్ (DO) లెవల్ 1 లీటర్‌కి 8.3ఎంజీగా ఉంది. అంటే.. ఈ నీటిలో స్నానం చేసినా ఎలాంటి సమస్యా ఉండదు. సంగం దగ్గర ఏర్పాటు చేసిన తాత్కాలిక సేవేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్స్ (STPs) కూడా.. వ్యర్థాలు నీటిలో కలవకుండా ఆపుతున్నాయి. మరోవైపు.. నీటిలో పూజా సామగ్రిని కూడా వెంటవెంటనే తొలగిస్తున్నారు. కుంభమేళాకి వెళ్తే.. అక్కడ స్నానం చేస్తే వ్యాధులు వస్తాయి అనేది నిజం కాదు. అలా వచ్చినట్లుగా ఇప్పటివరకూ ఎవరూ చెప్పలేదు. స్వయంగా రాష్ట్రపతి, ప్రధాని, సినీ, రాజకీయ, వ్యాపార, క్రీడా ప్రముఖులంతా వెళ్లి స్నానం చేస్తున్నారు. అందువల్ల ఎలాంటి సందేహాలూ పెట్టుకోకుండా.. కుంభమేళాకు రావాలని ప్రభుత్వం సూచిస్తుంది.