Medaram Jathara : తెలంగాణ రాష్ట్రంలోని ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో ఉన్న శ్రీ మేడారం సమ్మక్క-సారలమ్మ మినీ జాతర ఈనెల 12 నుంచి 15వ తేదీ వరకు నాలుగు రోజుల పాటు ఘనంగా జరుగుతోంది. జాతర ప్రారంభ రోజు నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. మేడారం దేవతల దర్శనానికి భక్తుల క్యూ అమాంతం పెరిగింది. తద్వారా ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడుతుంది. భక్తులు ఈ సందర్భంగా తమ కోరికలను అమ్మవారికి విన్నవించుకుంటున్నారు. భక్తులు నిలువెత్తు బంగారం, చీరలు, సారెలు, గాజులు, ఓడు బియ్యం వంటి పూజా వస్తువులను సమర్పిస్తూ తమ విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు. భక్తులు.. “మా కోరికలు నెరవేరినప్పుడు అమ్మవార్లకు ఎత్తు బంగారం సమర్పించాము. ఈ అమ్మవార్లను దర్శించుకున్న తరువాత మనం ఆశించిన అన్ని కోరికలు నెరవేరాయి. అందుకే ప్రతి నెలా ఇక్కడకు వస్తున్నాం” అని పేర్కొన్నారు.
జాతర సౌకర్యాలు పర్యవేక్షిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం, భక్తుల అనుకూలంగా ప్రత్యేక బస్సుల సేవలు, త్రాగునీరు, చలువ పందిళ్ల వంటి అన్ని ఏర్పాట్లు చేపట్టి జాతర విజయవంతంగా సాగేందుకు కృషి చేస్తోంది.ఈ జాతరకి ప్రతి సంవత్సరం భక్తులు హాజరై అమ్మవార్ల ఆశీర్వాదాలు పొందుతూ, వారి కోరికలు తీరుతాయని ఆశిస్తున్నారు. వన దేవతల దర్శనం కోసం రాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు మినీ మేడారం జాతరకు బయలుదేరి వెళ్తున్నారు.తల్లులకు బంగారాన్ని గుట్టలుగా పోగుచేసి తమ మొక్కులు తీర్చుకుంటున్నారు. అదేనండి.. మేడారం జాతరలో బెల్లం ను కొంగు బంగారంగా పిలుస్తారు.సమ్మక్క సారలమ్మ గద్దెల నుంచి కనీసం చిటికెడు బెల్లాన్నైనా ప్రసాదంగా తెచ్చుకోవాలని భక్తులు పోటీపడుతుంటారు.ఎక్కడైనా దేవుళ్లకు నైవేధ్యంగా పండ్లు, పూలు మొదలైన పూజా సామగ్రి తీసుకెళ్లుతుంటారు. బంగారాన్ని నైవేధ్యంగా స్వీకరించే ఏకైక జాతర మేడారం మాత్రమే. వీటితో పాటు సమ్మక్క సారలమ్మలకు చీర, గాజులు, పసుపు కుంకుమలను చెల్లించి చల్లంగా సూడమ్మా అని వేడుకుంటారు.
పూర్వం గిరిజనులు మాత్రమే జరుపుకునే ఈ పండుగకు ఇప్పుడు ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వస్తున్నారు. వచ్చిన వారంతా అమ్మవారికి బంగారాన్ని సమర్పించడం ఆయవాయితీగా వస్తుంది. అసలు ఇంతకీ మేడారంలో బెల్లం సమర్పించే సంప్రదాయం ఎప్పటినుంచి మొదలైందో తెలుసా. సమ్మక్క సారలమ్మలకు నైవేద్యంగా బెల్లం మాత్రమే ఎందుకు పెడతారు? ఈ బెల్లాన్ని బంగారంగా ఎందుకు పిలుస్తారనే విషయాల వెనుక ఆసక్తికర అంశాలు దాగున్నాయి. పూర్వం గిరిజనులు మాత్రమే జరుపుకునే ఈ జాతరకు ప్రస్తుతం దేశవిదేశాల నుంచి కోట్లాదిగా భక్తులు వస్తున్నారు. జాతరకు వెళ్లేదారిలో దప్పిక, నీరసం రాకుండా బలవర్ధకమైన బెల్లాన్ని తమ వెంట తీసుకుని వెళ్లే వారు. గిరిజనులు ఎంతో ఇష్టంగా తీసుకునే బెల్లాన్నే అమ్మవార్లకు కూడా నైవేద్యంగా సమర్పించేవారు. వారు భక్తి శ్రద్ధలతో సమర్పించే ఈ నైవేద్యమే ఆ వనదేవతలకు బంగారంతో సమానంగా భావిస్తారని విశ్వశిస్తారు. బెల్లానికి అడవి బిడ్డలు ఎంతో ప్రాధాన్యాన్నిస్తారు. అమ్మవార్లకు సమర్పించేది కాబట్టి దీనినే కాలక్రమేణా బంగారంగా పిలువడం మొదలైంది.
కాకతీయుల కాలం నుంచే అమ్మవార్లకు ఇక్కడ బెల్లం సమర్పించేవారు. పూర్వం చాలా దూరం నుంచి భక్తులు ఎడ్ల బండ్ల మీద అమ్మవార్ల దగ్గరికి చేరుకునే వారు. ఇక్కడే వారం లేదా పది రోజులు ఉండిపోయేవారు. ఆకలి వేసినప్పుడు త్వరగా శక్తిని అందించే బెల్లం పానకంతో తయారు చేసే ఆహారాన్ని తీసుకునేవారు. అందుకే అది అప్పటి నుంచి చాలా విలువైనదిగా భావించి.. సమ్మక్క-సారలక్కకు సమర్పించడం ప్రారంభమైనట్లు స్థానికులు తెలిపారు.