Telangana Elections 2023: తెలంగాణ ఎన్నికలు ఉత్కంఠగా మారుతున్నాయి. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ మధ్య పోటీ హోరా హోరీగా సాగుతుతోంది. హ్యాట్రిక్ విజయంపై బీఆర్‌ఎస్ నమ్మకంతో ఉండగా, సీఎం కేసీఆర్‌ను గద్దె దించుతామని కాంగ్రెస్ ధీమా వ్యక్తం చేస్తోంది. ఇప్పటికే పలు సర్వే సంస్థలు ప్రీపోల్ ఫలితాను ప్రకటించాయి. ఇందులో చాలా వరకు బీఆర్‌ఎస్‌కు అనుకూలంగా వెల్లడించగా, కొన్ని కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని తేల్చాయి. తాజాగా ప్రముఖ జ్యోతిష్కులు.. న్యూమరాలజిస్టులు తెలంగాణ ఎన్నికల ఫలితాలపై తమ అంచనాలను వెల్లడించారు.
కాంగ్రెస్‌కే అనుకూలం..
తెలంగాణలో ఈసారి కాంగ్రెస్ గెలుపు ఖాయమని ఆ పార్టీ నేతలు ధీమాగా ఉన్నారు. 80 సీట్ల కంటే ఒక్కటి కూడా తగ్గదని తాజాగా టీపీసీసీ చీఫ్ రేవంత్ సవాల్ చేశాారు. కేసీఆర్ ప్రచారంలో భాగంగా కాంగ్రెస్‌కు 20 సీట్లు కూడా రావని ఎద్దేవా చేస్తున్నారు. దీనిని రేవంత్ తిప్పకొడుతున్నారు. ఈనెల 28వ తేదీతో ఎన్నికల ప్రచారం ముగియనుంది. 30న ఎన్నికలు, డిసెంబర్ 3న ఎన్నికల ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఇదే సమయంలో కాంగ్రెస్‌లో జోష్ పెంచేలా జ్యోతిష్కులు.. న్యూమరాలజిస్టులు అంచనాలను వెల్లడిస్తున్నారు.
జ్యోతిష్యుల అంచనా ఇలా..
తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయమని ప్రముఖ జ్యోతిష్కులు..స్వామీజీలు, న్యూమరాలజిస్టులు చెబుతున్నారు. వేలూరి రవికిరణ్‌శర్మ గ్రహాలు పూర్తిగా టీపీసీసీ చీఫ్ రేవంత్‌కు అనుకూలంగా ఉన్నాయని విశ్లేషిస్తున్నారు. టీఆర్‌ఎస్ పేరును బీఆర్‌ఎస్‌గా మార్చడంతో కేసీఆర్‌కు శని ప్రారంభమయిందని, దీంతో ఓటమి ఖాయమని చెబుతున్నారు. ఆగస్తు నుంచి రేవంత్‌రెడ్డికి గురు మహాదశ ప్రారంభమైందని, దీంతో ఈ ఏడాది గొప్ప విజయం లభించనుందని విశ్లేషించారు. కాంగ్రెస్‌కు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయని, 70 సీట్లు వస్తాయని పేర్కొంటున్నారు. న్యూమరాలజిస్టులు సైతం కాంగ్రెస్ కు సంఖ్యా పరంగా 65 నుంచి 70 సీట్లు వస్తాయని చెబుతున్నారు.
‘హస్తం’లో ఉత్సాహం..
జాతీయ సర్వే సంస్థల సైతం ఇప్పటికే తెలంగాణలో ప్రజానాడి తెలుసుకొనే ప్రయత్నం చేశాయి. ఎన్నికల సంఘం ఒపీనియన్ పోల్స్‌పైన ఈ నెల 30వ తేదీ వరకు ఆంక్షలు విధించింది. దీంతో, 30వ తేదీ పోలింగ్ ముగిసిన తరువాత ఈ సర్వేలు బయటకు రానున్నాయి. ఇప్పటి వరకు వెల్లడైన సర్వే ఫలితాల్లో కాంగ్రెస్‌దే పైచేయి స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పుడు జ్యోతిష్యులు కూడా కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉన్నట్లు వెల్లడిస్తున్నారు. క్షేత్ర స్థాయిలోనూ కాంగ్రెస్ గెలుపుపై చర్చ సాగుతోంది. దీంతో కాంగ్రెస్ అగ్రనేతలు మరింత ఉత్సాహంతో ప్రచారంలో దూసుకుపోతున్నారు.