https://oktelugu.com/

Hydrogen Trains : ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన హైడ్రోజన్ రైళ్లు ఎక్కడ ఉన్నాయో తెలుసా? మన దేశం ఈ లిస్ట్ లో ఉందా?

భారతీయ రైల్వే సంస్థ టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ దినదిన పురోగతి సాధిస్తుంది. ఇప్పటికే సెమీ హైస్పీడ్ వందేభారత్ రైలు కూడా అందుబాటులోకి వచ్చింది.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : January 11, 2025 / 08:33 AM IST

    Hydrogen Trains

    Follow us on

    Hydrogen Trains : భారతీయ రైల్వే సంస్థ టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ దినదిన పురోగతి సాధిస్తుంది. ఇప్పటికే సెమీ హైస్పీడ్ వందేభారత్ రైలు కూడా అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 136 వందేభారత్ రైళ్లు ఉన్నాయి. ఎక్కువ వేగం, అధునిక సౌకర్యాలతో ప్రయాణాన్ని చాలా ఆహ్లాదకరంగా మార్చుతున్నాయి ఈ రైళ్లు. త్వరలోనే మరో 180 కిలో మీటర్ల వేగంతో దూసుకెళ్లే వందేభారత్ స్లీపర్ రైళ్లు కూడా సేవలోకి రానున్నాయి. మరోవైపు బుల్లెట్ రైళ్లపైనా కేంద్ర ప్రభుత్వం ఫోకస్ చేసిన సంగతి తెలిసిందే. దేశంలో 2026 నాటికి బుల్లెట్ రైళ్లు పరుగులు పెట్టబోతున్నాయి. ఇక ముంబై- అహ్మదాబాద్ నడుమ హైస్పీడ్ రైల్వే కారిడార్ ప్రాజెక్ట్ నిర్మాణం పనులు కూడా సాగుతున్నాయి. అయితే 508 కిలో మీటర్ల మేర ఈ బుల్లెట్ రైలు ప్రాజెక్టు నిర్మాణ పనులు చేస్తున్నారు అధికారులు.

    భారతదేశం ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన హైడ్రోజన్ రైలును అభివృద్ధి చేసింది. భారతీయ రైల్వేలు అభివృద్ధి చేసిన హైడ్రోజన్ ఇంధనంతో కూడిన రైలు ఇంజిన్ ప్రపంచంలోనే అత్యధిక హార్స్ పవర్ కలిగిన ఇంజిన్ గా పేరు గాంచింది. అంటే మొత్తం మీద భారతీయ రైల్వే మరో భారీ విజయాన్ని సాధించింది. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన హైడ్రోజన్ రైలును భారత్ అభివృద్ధి చేసి మరో ఘనత సాధించింది అనే చెప్పాలి. భారతీయ రైల్వే అభివృద్ధి చేసిన హైడ్రోజన్ ఇంధనంతో నడిచే రైలు ఇంజిన్ ప్రపంచంలోనే అత్యధిక హార్స్ పవర్ కలిగిన ఇంజన్ అని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు.

    ప్రపంచంలో నాలుగు దేశాలు మాత్రమే ఇలాంటి రైలు ఇంజిన్లను తయారు చేస్తున్నాయట. వారు 500 నుంచి 600 హార్స్ పవర్ మధ్య ఇంజిన్‌లను కూడా ఉత్పత్తి చేస్తారట. అయితే స్వదేశీ సాంకేతికతను ఉపయోగించి భారతీయ రైల్వేలు తయారు చేసిన ఇంజిన్ 1200 హార్స్ పవర్ సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఇది ఇప్పటివరకు ఈ విభాగంలో అత్యధికంగా చెప్పవచ్చు.

    ఈ ఇంజన్ నిర్మాణ పనులు పూర్తయ్యాయని, సిస్టమ్ ఇంటిగ్రేషన్ పనులు కొనసాగుతున్నాయని రైల్వే మంత్రి తెలిపారు. ఈ ఇంజన్ పూర్తిగా స్వదేశీ సాంకేతికతపై ఆధారపడి ఉంటుంది. ఈ విజయాన్ని భారతదేశ సాంకేతిక స్వావలంబన దిశగా ఒక పెద్ద అడుగుగా అభివర్ణించారు.

    ఈ హైడ్రోజన్ రైలు ఇంజన్ పర్యావరణ పరిరక్షణకు కూడా ఒక వరంగా మారనుంది. హైడ్రోజన్ ఇంధన కణాలను ఉపయోగించడం ద్వారా, ఈ రైలు సున్నా కార్బన్ ఉద్గారాలను ఉత్పత్తి చేస్తుంది. భారతదేశం క్లీన్ ఎనర్జీ, గ్రీన్ ట్రాన్స్‌పోర్టేషన్ లక్ష్యాలను సాధించడంలో ఇది సహాయపడుతుంది.

    ఈ ఇంజిన్ మొదటి పరీక్ష హర్యానాలోని జింద్-సోనిపట్ మార్గంలో ఉంటుంది. 89 కిలోమీటర్ల పొడవైన ఈ మార్గంలో హైడ్రోజన్ రైలు ట్రయల్ త్వరలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో 35 హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ రైళ్లను అభివృద్ధి చేసేందుకు రైల్వే మంత్రిత్వ శాఖ రూ.2800 కోట్ల బడ్జెట్‌ను కేటాయించింది. ఇక భారతదేశం మొట్టమొదటి హైడ్రోజన్ రైలు 2025-26 నాటికి సేవలోకి వస్తుంది. ఈ ఏడాది చివరి నాటికి దీని పరీక్ష పూర్తవుతుంది అంటున్నారు అధికారులు.