Telangana Assembly Election: రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల వాతావరణం వేడెక్కుతోంది. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలకు దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయ నాయకుల్లో హడావిడి మెదలయ్యింది. గెలుపే లక్ష్యంగా అన్ని రాజకీయ పార్టీలు ముందుకెళ్తుండగా వీరి విజయం కోసం కార్యకర్తలు ఆరాటపడుతున్నారు. అందుకోసం ఎత్తుగడలు, వ్యూహాలు పన్నుతున్నారు. అంతే కాదు గెలుపే ధ్యేయంగా చేసుకున్న కొందరు ఎలాంటి అవకతవకలకైనా పాల్పడే అవకాశాలు లేకపోలేదు. దీని వల్ల ఒక్కోసారి ఓటర్లను ఇబ్బందులకు గురిచేస్తుంటారు. అనుకూల ప్రాంతాల్లో రకరకాలుగా ప్రలోభాలతో ఆకర్షించుకునేందుకు ప్రయత్నా లు సాగిస్తుంటారు. ఫలితంగా ఒక్కోసారి ఎన్నికల ప్రక్రియకే విఘాతం కలగుతుంది. ఇలాంటి వాటిని నిరోధించడానికి ఎన్నికల ప్రక్రియ వెలువడినప్పటి నుంచి ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చినట్లే,. ఈ నియమావళిని ప్రతి రాజకీయ పార్టీ ఎన్నికల అధికారులు, అభ్యర్థులు విధిగా పాటించాల్సిందే. ఉల్లంఘించిన వారు చట్ట ప్రకారం శిక్షార్హులు అవుతారు. నియమావళిని ఉల్లంఘిస్తే ఎలాంటి శిక్షలు విధిస్తారంటే..
ఇవీ శిక్షలు
అభ్యర్థి గాని అతని ఏజెంట్‌గానీ ఓటరుకు బహుమానం ఇవ్వకూడదు, పోటీ చేయమని పోటీ నుంచి విరమించుకోమని బహుమతులు ఇవ్వకూడదు.
జాతి, కులం, మతం, భాష ఆధారంగా ఓటు వేయమని వేయొద్దని చెప్పకూడదు.
ఓటరును పోలింగ్ స్టేషన్‌కు వాహనంపై తీసుకెళ్లడం, తీసుకురావడం చొయెద్దు. ఇవన్నీ నేరాలుగా పరిగణిస్తారు. వీటికి పాల్పడిన వారికి మూడేళ్ల వరకు జైలు రూ.మూడు వేల జరిమానా విధిస్తారు.
ఎన్నికల్లో మతం జాతి కులం బాషా, వర్గ పోరాటాలను సృష్టిస్తే మూడేళ్ల జైలు రూ.మూడు లే జరిమానా విధిస్తారు.
పోలింగ్ సమయానికి 48గంటల ముందు పోలింగ్ ఏరియాలో సభ జరపడం, హాజరవ్వడం నేరం. దీనికి శిక్ష మూడేళ్ల జైలు రూ. మూడు వేల వరకు జరిమానా.
ఎన్నికల సమావేశంలో అశాంతిని గందరగోళాన్ని సృష్టిస్తే రూ 250 వరకు జరిమానా విధిస్తారు.
ఎన్నికలకు సంబంధించిన కరపత్రాలు వాల్‌పోస్టర్లను ముద్రించే వ్యక్తి పేరు, చిరునామాను కరపత్రంపై వాల్‌పోస్టర్‌పై ముద్రించాలి. అలా ముద్రించని ప్రింటరుకు ఆరునెలల జైలు రూ200 వరకు జరిమానా విధిస్తారు. లేదా రెండూ విధిస్తారు.
ఓటింగ్ రహస్యంగా ఉండకుండా బహిర్గతం చేస్తే మూడు నెలల జైలు శిక్ష విధిస్తారు.
అది నేరం అవుతుంది
ఎన్నికల అధికారులు అభ్యర్థుల గెలుపునకు ప్రయత్నిస్తే నేరం అవుతుంది. ఒకరికి ఓటు వేయమని గానీ ఓటు వేయవద్దని గానీ చెప్పినా నేరం కింద లెక్క. అందుకు ఆ అధికారులకు శిక్ష ఆరునెలల జైలు లేదా జరిమానా వేస్తారు. అభ్యర్థులు ప్రింట్ చేయించిన ఎన్నికల సామగ్రి కాపీలను అధికారులకు అందచేయాలి. దీన్ని అతిక్రమిస్తే ఆరునెలల జైలు లేదా జరిమానా లేద రెండూ విధిస్తారు.
పోలింగ్ తేదీ నాడు పోలింగ్ స్టేషన్‌కు వందమీటర్ల లోపు ప్రచారం నిషేధం. అలాచేస్తే రూ250 జరిమానా.
ఎన్నికల పోలింగ్ కేంద్రం వద్ద శబ్దాన్ని వినిపించడం లౌడ్ స్పీకర్ వాడడం నిషేధం. ఆందోళన కలిగేలా అరవడం అసభ్యకరంగా ప్రవర్తించడం నేరం. ఎన్నికల అధికారులకు, సిబ్బందికి ఆటంకం కలిగించేలా ప్రవర్తించినా నేరమే అవుతుంది. వీటికి శిక్ష మూడు నెలలు జైలు లేదా జరిమానా లేదా రెండూ విధించవచ్చు. పైనేరాన్ని ఎవరైనా చేశారని చేస్తున్నా రని ప్రిసైడింగ్ అధికారి నమ్మితే ఆ వ్యక్తులను అరెస్ట్ చేయమని పోలీసులకు ఆదేశించవచ్చు.
పోలింగ్ స్టేషన్‌లో నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించే వ్యక్తిని ప్రిసైడింగ్ అధికారి అక్కడి నుంచి బయటికి పంపే అధికారం ఉంది. అదే వ్యక్తి మళ్లీ పోలింగ్ స్టేషన్‌కు వస్తే మూడు నెలల జైలు శిక్ష లేదా జరిమానా విధించవచ్చు లేదా రెండూ విధించే అవకాశం ఉంది. ఎన్నికల నిర్వహణలో అధికారులు తమ బాధ్యతలను ఉల్లంఘించినా నేరమే అవుతుంది. అందుకు శిక్ష రూ.500 జరిమానా. ప్రభుత్వ ఉద్యోగులు ఎన్నికల ఏజెంట్‌గా పోలింగ్ ఏజెంట్‌గా కౌంటింగ్ ఏజెంట్‌గా వ్యవహరిస్తే మూడు నెలల జైలు లేదా జరిమానా లేదా రెండూ విధించే అవకాశాలు ఉన్నాయి. పోలింగ్ బూత్‌ను ఆక్రమిస్తే ఐదేళ్ల జైలురూ. ఐదు వేల జరిమానా విధిస్తారు. పోలింగ్ స్టేషన్ నుంచి ఎవరైనా మోసపూరితంగా ఈవీఎంలు, బ్యాలెట్ బాక్సులు తీసుకెళ్లేందుకు ప్రయత్నించినా నేరమే. అందుకు శిక్ష ఐదేళ్ల జైలు రూ ఐదువేల జరిమానా.
ఒకరి ఓటును మరోకరు వేస్తే ,ఐదేళ్ల జైలు రూ. ఐదు వేల వరకు జరిమానా విధిస్తారు. ఈ చట్టం కింద శిక్షకు గురైన వారు ఆరు సంవత్సరాల వరకు ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హులు.