Party Fund TDP Candidates: చిన్నపాటి పంచాయతీ ఎన్నికలకే లక్షలాది రూపాయలు ఖర్చవుతున్న రోజులవి. అటువంటిది తొలి ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులకు ఇచ్చిన పార్టీ ఫండ్ కేవలం రూ.5 వేలే. తొలి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి నిధుల్లేవు. ఎంపిక చేసిన అభ్యర్థులను హైదరాబాద్ రావాలని ఎన్టీఆర్ పిలిచినప్పుడు భారీగా నగదు ఇస్తారనుకుని చాలామంది అభ్యర్థులు టాక్సీలు కట్టించుకుని పెద్ద సూట్‌కేసులతో వచ్చారు. అయితే, ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులకు రూ.5వేలు చొప్పున ఇవ్వాలని నిర్ణయించారు. మరో విడతలో ఇంకో రూ.5వేలు ఇచ్చారు. మిగతా అభ్యర్థులకు ఆ మొత్తం కూడా లేదు. సొమ్ము పంచే బాధ్యతను ఎన్టీఆర్ బావమరిది రుక్మాంగదరావుకు అప్పగించారు. అభ్యర్థులకు తెలుగుదేశం పాటలు, ఎన్టీఆర్ ప్రసంగాల క్యాసెట్లు, పోస్టర్లు, కరపత్రాలు ఇచ్చి పంపించారు. డబ్బులు ఇవ్వకపోయినా ఎన్టీఆర్ ప్రభావం, ఆయన గాలిలో 200 సీట్లను తెలుగుదేశం పార్టీ గెల్చుకుంది.
Also Read: Analysis on Pawan Kalyan Questions YCP : పవన్ కళ్యాణ్ ప్రశ్నలకు సమాధానాలేవి ?
అంతా విద్యాధికులే..
నేటి రాజకీయాల్లో అభ్యర్థుల గుణగణాలతో పనిలేదు. ఆర్థిక, అంగ బలం ఉంటే చాలు. కుల సమీకరణలు భేరీజు వేసుకొని అభ్యర్థిత్వాలను ఖరారు చేస్తున్నారు. అయితే టీడీపీ ఆవిర్భావం తరువాత ఎన్టీఆర్ నయా ట్రెండ్ ను మొదలు పెట్టారు. తమ పార్టీ అభ్యర్థుల ఎంపికకు రకరకాల పద్ధతులు అనుసరించారు. యువత, పట్టభద్రులకు ప్రాధాన్యం ఇచ్చారు. ఆయా ప్రాంతాల్లో పట్టున్న కుటుంబాలను ఎంపిక చేశారు. ప్రజల్లో ఎవరికి పేరుందని ఆరా తీసేవారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలకు పెద్దపీట వేశారు. ఈ క్రమంలో సుమారు 26 ఏళ్ల యువకుడు తనకు సీటు కావాలని ఆయన్ను అడిగారు. దీంతో ఇక్కడున్నవారిని ఉద్దేశించి ఐదు నిమిషాలు ప్రసంగించు అని ఎన్టీఆర్ పరీక్ష పెట్టారు. ఆ యువకుడు చక్కగా ప్రసంగించడంతో అతనికి సీటు ఇస్తున్నట్లు ఆ క్షణంలోనే ఎన్టీఆర్ ప్రకటించారు. ఆ యువకుడే తెలంగాణాకు చెందిన మోత్కుపల్లి నర్సింహులు. ఎర్రన్నాయుడు, కళా వెంకట్రావు, యనమల రామకృష్ణుడు, అయ్యన్నపాత్రుడు, గోరంట్ల బుచ్చయ్యచౌదరిలాంటి నాటి యువకులనంతా ఎన్టీఆర్ ప్రసంగ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి రాజకీయ తెరంగేట్రం చేసిన వారే. తొలి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరుపున విద్యాధికులే అధికం. మొత్త 289 స్థానాల్లో టీడీపీ పోటీ చేసింది. 28 మంది పోస్టు గ్రాడ్యుయేట్లు, 20 మంది వైద్యులు, 47 మంది న్యాయవాదులు, ఎనిమిది మంది ఇంజనీర్లు సహా మొత్తం 125 మంది పట్టభద్రులు ఉన్నారు. ఈ అభ్యర్థుల సగటు వయసు 41 ఏళ్లు. అప్పటి అధికార పార్టీ కాంగ్రెస్ అభ్యర్థుల సగటు వయసు 50 ఏళ్లు.
Also Read: Atmakur By Election: బీజేపీ ‘పోటీ’ ప్రకటన.. పవన్ కళ్యాణ్ బరిలోకి దిగాల్సిందేనా?