Longest Bus Route
Longest Bus Route : మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల మధ్య భాషా వివాదం మరోసారి ఉద్రిక్తతకు దారి తీసింది. ఈ వివాదం కారణంగా రెండు రాష్ట్రాల మధ్య బస్సు సర్వీసులు నిలిచిపోయాయి. రెండు రాష్ట్రాలకు చెందిన ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరాఠీ, కన్నడ మద్దతుదారుల మధ్య పెరిగిన ఉద్రిక్తతలు అనేక సంఘటనలకు దారితీస్తున్నాయి. ఫిబ్రవరి 22, 2025న కర్ణాటకలోని బెలగావి ప్రాంతంలో మహారాష్ట్రకు చెందిన కండక్టర్‌ను మరాఠి భాష మాట్లాడలేదని ఆరోపిస్తూ కొందరు వ్యక్తులు దాడి చేశారు. ఈ ఘటనకు ప్రతిస్పందనగా మహారాష్ట్ర రవాణా శాఖ కర్ణాటకకు బస్సు సర్వీసులను నిలిపివేసింది. దీని ఫలితంగా రెండు రాష్ట్రాల మధ్య అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులు నిలిచిపోయాయి.
ఇలా కర్ణాటకలో మహారాష్ట్రకు చెందిన డ్రైవర్‌ను, మహారాష్ట్రలో కర్ణాటకకు చెందిన డ్రైవర్‌ను దారుణంగా కొట్టిన సంఘటనలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఘటనలతో రెండు రాష్ట్రాల మధ్య బస్సు సర్వీసులు నిలిచి పోయాయి. మహారాష్ట్ర రవాణా మంత్రి ప్రతాప్ సర్నాయక్ మాట్లాడుతూ.. ప్రయాణికుల భద్రత దృష్ట్యా, కర్ణాటకకు బస్సు సర్వీసులను రద్దు చేశామని తెలిపారు. మరోవైపు, కర్ణాటక రోడ్డు రవాణా సంస్థ ఒక అధికారి మాట్లాడుతూ.. మహారాష్ట్రకు వెళ్లే బస్సుల సంఖ్యను తగ్గించాం అన్నారు.
ఈ పరిణామంతో ఇరు రాష్ట్రాలకు చెందిన ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. రెండు రాష్ట్రాల అనేక జిల్లాలు పరస్పరంగా అనుసంధానించబడి ఉండడంతో బస్సు సర్వీసులలో అడ్డంకులు ఏర్పడినాయి. అంతే కాకుండా, భారతదేశంలోని కొన్ని కీలక బస్సు మార్గాల గురించి కూడా తెలుసుకుందాం. భారతదేశంలో అత్యధిక సంఖ్యలో ప్రజలు బస్సుల్లో ప్రయాణిస్తుంటారు. మెట్రో, ద్విచక్ర వాహనాలు, కార్లు పెరిగినా ఇప్పటికీ చాలా మంది ప్రయాణీకులు బస్సుకే మొదటి ప్రాధాన్యం ఇస్తుంటారు.
భారతదేశంలో అతి పొడవైన బస్సు ప్రయాణం జోధ్‌పూర్ నుండి బెంగళూరు వరకు ఉంటుంది. ఈ ప్రయాణానికి సుమారు 36 నుండి 50 గంటలు పడుతుంది. అంటే సుమారు రెండు నుంచి మూడు రోజులు పడుతుంది. ఈ రెండు పట్టణాల మధ్య దూరం సుమారు 2,000 కిలోమీటర్లు. ముంబై నుండి కోల్‌కతా దూరం 1,900 కిలోమీటర్లు, బెంగళూరు నుండి జైపూర్ దూరం కూడా సుమారు 2,000 కిలోమీటర్లే. అలాగే, ముంబై నుండి ఢిల్లీకి 1,400 కిలోమీటర్ల దూరం.. ఈ ప్రయాణానికి సుమారు 24గంటలు పడుతుంది. ఈ ఇబ్బందులు పరిష్కరించేందుకు ప్రభుత్వాలు చర్చలు చేపట్టాలని.. భవిష్యత్తులో ఈ విధమైన సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు. ప్రయాణికుల సౌకర్యం కోసం, ఈ వివాదాన్ని శాంతియుతంగా పరిష్కరించేందుకు సత్వర చర్యలు తీసుకోవాలని ఆశిస్తున్నారు.