Telangana Elections: తెలంగాణ ఎన్నికల వేళ రాష్ట్రంలో డబ్బు, మద్యం, బంగారం ఎరులైపారుతోంది. ఇప్పటికే పోలీసులు పెద్ద ఎత్తున డబ్బు, మద్యం, బంగారాన్ని సీజ్ చేసిన కేసులు ఎన్నో ఉన్నాయి. తెలంగాణలో ఎన్నికల కోడ్ వచ్చిన నాటి నుంచి పోలీసులు అడుగడుగునా తనిఖీలు చేపడుతున్నారు.
మొయినాబాద్‌లో నోట్ల కట్టలు..
హైదరాబాద్‌లో ఇప్పటికే పెద్ద మొత్తంలో నోట్ల కట్టలు స్వాధీనం చేసుకోగా, ఇప్పుడు హైదరాబాద్‌లోని మొయినాబాద్‌లో పెద్ద ఎత్తున డబ్బు పట్టుబడింది. ఇతర ప్రాంతాల నుంచి హైదరాబాద్ కి ఈ డబ్బు తరలిస్తున్న క్రమంలో పోలీసులు పట్టుకున్నారు. మొయినాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో వాహనాల చెకింగ్ చేస్తున్న క్రమంలో 7.40 కోట్ల రూపాయలు పట్టుబడ్డాయి. వీటిని 6 కార్లలో తరలిస్తుండగా పోలీసులు తనిఖీలు నిర్వహించి పట్టుకున్నారు. తాజాగా వివేక్ కంపెనీ నుంచి బదిలీ అయిన రూ.8 కోట్లను కూడా అధికారులు ఫ్రీజ్ చేశారు. ఈ డబ్బు ఖమ్మం జిల్లాకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిదిగా ప్రచారం జరిగింది.
విశాఖ ఇండస్ట్రీస్‌కు చెందిన రూ.8 కోట్లు ఫ్రీజ్!
కాంగ్రెస్ చెన్నూరు నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వివేక్‌కు సంబంధించిన విశాఖ ఇండస్ట్రీస్ ప్రై వేట్ లిమిటెడ్ ఖాతా నుంచి విజిలెన్స్ సెక్యూరిటీ సర్విసెస్ ప్రై వేట్ లిమిటెడ్ సంస్థ ఖాతాలోకి బదిలీ అయిన రూ.8 కోట్లు సైఫాబాద్ పోలీసులు ఫ్రీజ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) ఆదేశాల మేరకు నగర పోలీసు ఉన్నతాధికారుల సూచనలతో ఈ చర్య తీసుకున్నట్లు మధ్య మండల డీసీపీ వెంకటేశ్వర్లు ఆదివారం వెల్లడించారు. గత సోమవారం జరిగిన ఈ వ్యవహారంపై ఆ నియోజకవర్గ సిట్టింగ్ ఎమ్మెల్యే బాల్క సుమన్ బుధవారం సీఈఓకు ఫిర్యాదు చేశారు. ఈ విజిలెన్స్ కంపెనీ రామగుండంలోని వివేక్ ఇంటి చిరునామాతో ఉందని, ఆయన సంస్థ ఉద్యోగులే ఈ సంస్థ డైరెక్టర్లుగా ఉన్నారని అందులో పేర్కొన్నారు. ఈ లావాదేవీపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలని, ఎన్నికల్లో విచ్చలవిడిగా ఖర్చు పెట్టడానికే వివేక్ ఈ షెల్ కంపెనీ ఖాతా వినియోగిస్తున్నట్లు సీఈఓకు ఇచ్చిన ఫిర్యాదుతో పేర్కొన్నారు. దీంతో ఈ విషయాన్ని సీఈఓ నగర పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. ఈ నేపథ్యంలోనే రంగంలోకి దిగిన సైఫాబాద్ పోలీసులు లోతుగా దర్యాప్తు చేశారు. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ బేగంపేట బ్రాంచ్‌లో ఉన్న విశాక ఇండస్ట్రీస్‌కు చెందిన ఓ గుర్తుతెలియని ఖాతా నుంచి విజిలెన్స్ సెక్యూరిటీస్ సంస్థకు ఐడీబీఐ బ్యాంక్ బషీర్‌బాగ్ బ్రాంచ్‌లోకి బదిలీ అయినట్లు గుర్తించారు. సోమవారం ఉదయం 10.57 గంటలకు జరిగిన ఈ లావాదేవీ అనుమానాస్పదంగా ఉండటంతో సైఫాబాద్ పోలీసులు ఈ మొత్తాన్ని ఫ్రీజ్ చేయించారు.
ఇంత పెద్ద మొత్తం ఇదే మొదటిసారి..
తెలంగాణ ఎన్నికల కోసం ఈ డబ్బు వినియోగిస్తున్నట్టు అధికారులు భావిస్తున్నారు. ఎన్నికల కోడ్ వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు పెద్ద మొత్తంలో పట్టుబడటం ఇది మొదటి సారి అని పోలీసులు చెబుతున్నారు. గతంలో ఏడు కోట్ల విలువ చేసే బంగారం పట్టుబడిన దాకాలు చూశాం. అయితే ఒకేసారి ఇన్ని కోట్ల రూపాయల కట్టలు బహిరంగంగా దొరకడం ఎన్నికల్లో ఇదే మొదటిసారి. వీటిని వేరే ప్రాంతం నుంచి∙హైదరాబాద్ కు ఎవరు చెప్తే ఎవరు తీసుకొచ్చారు అని వివరాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ డబ్బు వివరాలను పోలీసులు ఐటీ అధికారులకు సమాచారం అందించారు.
ఇప్పటి వరకు రూ.659.2 కోట్లు
మరోవైపు తెలంగాణ ఎన్నికల సందర్భంగా ఇప్పటివరకు వివిధ మార్గాల్లో అక్రమంగా తరలిస్తున్న 659.2 కోట్ల రూపాయల నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అయితే పట్టుబడిన డబ్బు గురించి ఆధారాలు చూపించిన వారికి తిరిగి ఇచ్చేస్తున్నారు. ఇప్పటివరకు 94 కోట్ల రూపాయల విలువ చేసే మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. వీటితోపాటు 36 కోట్ల విలువచేసే డ్రగ్స్,179 కోట్ల రూపాయలు విలువ చసే బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.