TRS: రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు రోజు రోజుకు మారిపోతున్నాయి. ప్రస్తుతం వరి కేంద్రంగా చేసుకొని రాష్ట్రంలో రాజకీయాలు కొనసాగుతున్నాయి. వడ్ల కొనుగోలు విషయం బీజేపీ, టీఆర్ఎస్ ఒకరిపై ఒకరు ఆరోపణలు, విమర్శలు గుప్పించుకుంటున్నారు. తప్పు మీదంటే మీదని లొల్లి చేసుకుంటున్నారు. ఇది చాలా దూరం వెళ్లేలా కనిపిస్తుంది. ఇదే విషయంలో రెండు పార్టీలు ఒక రోజు తేడాతో ధర్నాలు నిర్వహించాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ వడ్ల కొనవద్దని చెబుతోందంటూ టీఆర్ఎస్ ధర్నా చేస్తే, రాష్ట్ర ప్రభుత్వమే కేంద్రంతో ఒప్పదం చేసుకొని రైతులను పరేషాన్ చేస్తోందని బీజేపీ ఆరోపించింది. ఇలా రెండు పార్టీలు వడ్ల విషయంలో తమ వైఖరిని తెలయజేస్తున్నాయి. కానీ రైతులకు ఉపయోగపడే ఓ మంచి నిర్ణయం తీసుకోలేకపోతున్నాయి.

మళ్లీ టీఆర్ఎస్ ధర్నా..
వడ్లు కొనుగోలు చేయాలని చెబుతూ ఈరోజు టీఆర్ఎస్ మహా ధర్నా నిర్వహిస్తోంది. ఇందులో స్వయాన సీఎం కేసీఆర్ పాల్గొంటారని సమాచారం. ఇలా రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ, ఒక సీఎం అదే రాష్ట్రంలో ధర్నాలు చేసిన ఘటనలు చాలా అరుదుగా జరుగుతాయి. గతంలో ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఇలాగే ధర్నాలు చేసింది. ఇందులో కూడా ఆ రాష్ట్ర సీఎం అర్వింద్ కేజ్రీవాల్ రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేశారు. లెఫ్టనెంట్ గవర్నర్ ప్రతీ దాంట్లో వేలు పెడుతున్నారని, ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికైన తమ ప్రభుత్వాన్ని పాలన చేసుకోనివ్వడం లేదంటూ ఆరోపించారు. ఇది అప్పట్లో చర్చనీయాంశం అయ్యింది. మళ్లీ ఇప్పుడు తెలంగాణలో అదే జరుగుతోంది.
ధర్నా చౌక్ రీ ఓపెన్..
ప్రత్యేక తెలంగాణలో ఇక ఆందోళనలు, నిరసనలు అవసరం ఉండదంటూ ఇందిరా పార్క్ వద్ద ఉన్న ధర్నా చౌక్‌ను తెలంగాణ ప్రభుత్వం ఎత్తేసింది. అక్కడ ఎలాంటి నిరసనలు తెలుపరాదంటూ ఉత్తర్వులు జారీ చేసింది. సిటీకి మధ్యలో ఉన్న ధర్నా చౌక్ లో ఆందోళనల వల్ల ట్రాఫిక్ కు అంతరాయం కలుగుతోందని కారణం చెప్పింది. అయితే దీనిపై కొందరు కోర్టుకు వెళ్లారు. దీంతో కోర్టు ఇందులో కలుగజేసుకుంది. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ఉంటుందని చెబుతూ ధర్నా చౌక్‌ను తిరిగి ఓపెన్ చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ ఆదేశాలు ఇచ్చి నెలలు గడుస్తున్నా మొన్నటి వరకు దానిని ఓపెన్ చేయలేదు. ఇటీవల టీఆర్ఎస్ చేపట్టిన ధర్నా కోసమే దానిని ఓపెన్ చేశారు. ఇప్పుడు ప్రభుత్వాధినేతనే అక్కడ కూర్చొని ధర్నా నిర్వహించాలని భావిస్తున్నారు. అందుకే కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదని పెద్దలు చెబుతుంటారు. ఎవరైతే అసలు ధర్నా చౌక్ ఉండొద్దని అనుకున్నారో ఆయనే ఇప్పుడు అక్కడ ధర్నా చేయాలని భావిస్తున్నారు.
టీఆర్ఎస్ ఏం చెబుతోంది.. రైతులేమనుకుంటున్నారు..
యాసంగి వరి ధాన్యం కేంద్రం కొనాల్సిందే అంటూ టీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది. యాసంగిలో ఎంత పంట కొనుగోలు చేస్తారో వివరాలు తెలపాలంటూ రెండు రోజులు క్రితం సీఎం కేసీఆర్ కేంద్రానికి లేఖ రాశారు. ఇదే విషయంపై ఈరోజు మహాధర్నా నిర్వహిస్తున్నారు. కానీ ఇప్పుడు వచ్చిన సమస్య యాసంగి వడ్ల కొనుగోలు విషయంలో కాదు. ప్రస్తుతం దాదాపు పదిహేను, ఇరవై రోజులుగా ఖరీఫ్ సీజన్‌లో పండిన ధాన్యం కల్లాల్లో ఎదురు చూస్తోంది. ఒక రైతు వరి ధాన్యం కుప్పపైనే ప్రాణం వదిలాడు. ఇదే అంశంపైనే బండి సంజయ్ ఇప్పుడు యాత్ర చేస్తున్నారు. వానాకాలానికి సంబంధించిన ధాన్యాన్ని కొంటున్నామంటూ ప్రభుత్వం చెబుతున్నా.. ఆ ప్రక్రియ చాలా నెమ్మదిగా జరుగుతోంది. దీంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు.
Also Read: Revanth Reddy: వెంకట్రామిరెడ్డిపై ఆరోపణలు గుప్పిస్తున్న రేవంత్ రెడ్డి ? కారణాలేంటి ?
ఈ ధర్నాల వల్ల టీఆర్ఎస్ రాజకీయంగా లాభం పొందాలని చూస్తోంది. వడ్ల విషయంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని దోషిగా నిలబెట్టాలని చూస్తోంది. కానీ ఈ ఆందోళనలు టీఆర్ఎస్ కే నష్టం కలిగించేలా ఉన్నాయి. బాధ్యత గల ప్రభుత్వం ఇలా చేయకూడదంటూ రైతులు తమ మనోగతం వ్యక్తం చేస్తున్నారు. వరి ధాన్యం కొనుగోలు విషయంలో రైతులు రాష్ట్ర ప్రభుత్వంపైనే కోపంగా ఉన్నారు. ఇన్ని రోజులు తామే కొంటున్నామని చెబుతూ వచ్చిన టీఆర్ఎస్ సర్కార్‌పైనే ఇప్పుడు రైతులు ఆశలు పెట్టుకున్నారు. ఇందులో కేంద్రానికి ప్రత్యక్షంగా సంబంధం లేకపోవడంతో రైతులు రాష్ట్ర ప్రభుత్వాన్నే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.