D. K. Shivakumar On Telangana: తెలంగాణలో ఆటకదరా.. “శివా!”

డీకే ద్వారా అనేక ప్రయోజనాలు కలుగుతాయని కాంగ్రెస్‌ భావిస్తోంది. ముఖ్యంగా సీనియర్ల మధ్య సమన్వయం కుదరడం లేదు. పార్టీ వేగంగా ముందుకు వెళుతున్న ప్రతిసారీ ఈ అంతర్గత విభేదాలు, ఇతర పార్టీలకు చెందిన సీనియర్‌ నేతల చేరికల విషయం..

Written By: K.R, Updated On : June 17, 2023 8:35 am

D. K. Shivakumar On Telangana

Follow us on

D. K. Shivakumar On Telangana: డీకే శివకుమార్‌.. ఈ పేరు కర్ణాటక కాంగ్రెస్‌లోనే కాదు.. తెలంగాణలోనూ వినిపిస్తోంది. కర్ణాటక రాష్ట్రంలో అధికారంలోకి తీసుకొచ్చిన అతడిని తమ తురుపు ముక్కగా తెలంగాణలోనూ ప్రయోగించేందుకు కాంగ్రెస్‌ సిద్ధమవుతోంది. కర్టాటక మాదిరే ఇక్కడా కూడా అదే తరహా రాజకీయాలకు రంగం సిద్ధం చేస్తోంది. బలమైన అధికార పార్టీని ఎదుర్కోవడానికి వీలుగా సమాయత్తమవుతోంది. ముఖ్యంగా సీఎం కేసీఆర్‌ వేసే రాజకీయ ఎత్తుగడలను ఎప్పటికప్పుడు తిప్పికొట్టడంతో పాటు పార్టీ అంతర్గత వ్యవహారాలను చక్కదిద్ది నాయకులను, కేడర్‌ను ఏకతాటిపైకి తీసుకెళ్లే విధంగా డీకే సేవలు వినియోగించుకోవాలని అనుకుంటోంది.

డీకేతో టచ్‌లోకి..

ఈనేపథ్యంలో అధిష్ఠానం సూచనల మేరకు ఇప్పటికే పార్టీకి చెందిన పలువురు నేతలు డీకేతో టచ్‌లోకి వెళ్లినట్టు తెలుస్తోంది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయంలో డీకే శివకుమార్‌ కీలక పాత్ర పోషించారు. పార్టీ నేతల మధ్య సమన్వయం కుదిర్చారు. కేడర్‌లో జోష్‌ను పెంచారు. ఎన్నికల ప్రచారంలో ముందుండి నడిచారు. ప్రజల్లో కాంగ్రెస్‌ పట్ల నమ్మకాన్ని కలిగించారు. ఈ విషయాన్ని గుర్తించిన పార్టీ అధిష్ఠానం శివకుమార్‌ సేవలను తెలంగాణలోనూ వినియోగించుకోవాలనే గట్టి నిర్ణయానికి వచ్చింది. దానిని అమల్లో కూడా పెట్టింది. డీకే శివకుమార్‌ సేవలను వినియోగించుకోవడంద్వారా తెలంగాణ సరిహద్దును పంచుకుంటున్న కర్ణాటక ప్రభావం రాష్ట్రంలోని కొన్ని జిల్లాలపై ఉంటుందని కాంగ్రెస్‌ నాయకులు అభిప్రాయపడుతున్నారు. డీకే నియామకం ద్వారా కర్ణాటక సరిహద్దులోని తెలంగాణ జిల్లాల్లో ఎన్నికలను ఎదుర్కోవడం సులువు అవుతుందని భావిస్తున్నారు.

తెలంగాణలో జోష్‌

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో విజయంతో తెలంగాణ కాంగ్రె్‌సలోనూ ఉత్సాహం మొదలయింది. అప్పటివరకు హుషారుగా ఉన్న బీజేపీ గాలి కొంత తగ్గినట్లయింది. ఈ అనుకూల పరిస్థితిని మరింత మెరుగు పరుచుకోవాలని కాంగ్రెస్‌ అధిష్ఠానం యోచిస్తోంది. అందులో భాగంగానే శివకుమార్‌కు తెలంగాణ రాష్ట్ర పార్టీ ఇన్‌చార్జి బాధ్యతలను అప్పగించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఈ మధ్య టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డితో పాటు, కాంగ్రెస్‌ పార్టీలోకి రావాలని భావిస్తున్న పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి, జూపల్లి కృష్ణారావు, దామోదరరెడ్డి వంటి వారు వేర్వేరుగా బెంగుళూరు వెళ్లి డీకేతో సమావేశమైనట్లు సమాచారం. ఇప్పటికే వైఎస్సాఆర్‌ టీపీ అధినేత షర్మిల కూడా డీకేను కలుసుకుని చర్చించిన విషయం తెలిసిందే. రాష్ట్ర ఇన్‌చార్జిగా ఆయన వస్తున్నారని తెలిసే.. ఇక్కడి నేతలు ఆయన్ను కలుస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. త్వరలోనే తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్‌ ఇన్‌చార్జిగా డీకేను నియమిస్తూ అధిష్ఠానం నిర్ణయం తీసుకుంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

ఏం ప్రయోజనాలు ఉంటాయి?

డీకే ద్వారా అనేక ప్రయోజనాలు కలుగుతాయని కాంగ్రెస్‌ భావిస్తోంది. ముఖ్యంగా సీనియర్ల మధ్య సమన్వయం కుదరడం లేదు. పార్టీ వేగంగా ముందుకు వెళుతున్న ప్రతిసారీ ఈ అంతర్గత విభేదాలు, ఇతర పార్టీలకు చెందిన సీనియర్‌ నేతల చేరికల విషయం.. ఇలా ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఈ పరిస్థితిని మార్చాలని కాంగ్రెస్‌ యోచిస్తోంది. ఎన్నికల్లో నిధుల సర్దుబాటును డీకే సమర్థంగా నిర్వహిస్తారనే నమ్మకంతో అధిష్ఠానం ఆయన వైపు మొగ్గు చూపుతోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన వెంటనే లోక్‌సభకు సాధారణ ఎన్నికలు రానున్నాయి. లోక్‌సభ ఎన్నికలను ఎదుర్కొవాలంటే.. అంతకుముందు జరిగే తెలంగాణ, ఇతర రాష్ట్రాల శాసనసభ ఎన్నికల్లో గెలవడం చాలా ముఖ్యమన్న భావన పార్టీ అధినాయకత్వంలో ఉంది. నేతల మధ్య విభేదాల వంటి చిన్న చిన్న కారణాలతో ఇలాంటి సువర్ణ అవకాశాన్ని జారవిడుచుకోవద్దనే ఉద్దేశంతో డీకేను తెలంగాణకు పంపించాలని భావిస్తున్నారు.