Delhi Air Pollution: పరిశ్రమలు, వాహనాల రద్దీ, దీపావళి పటాకుల మోతతో దేశ రాజధాని కాలుష్య కాసారంగా మారింది. ఆది, సోమవారాల్లో అయితే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 265గా నమోదయింది. దీని ప్రకారం ఇక్కడ గాలి పీల్చేందుకు ఏమాత్రం అనువు కాదు. అగ్నిపర్వతాలు బద్దలైనప్పుడు వెలువడే గాలిలో కూడా 265 ఏక్యూఐ ఉండదు. అయితే గత రెండు సంవత్సరాలతో పోలిస్తే ఇదే తక్కువ కాలుష్యం అని కాలుష్య నియంత్రణ బోర్డు తెలపడం గమనార్హం. సాధారణంగా దీపావళి సమయంలో ఢిల్లీలో గాలి నాణ్యత పడిపోతుంటుంది. పటాకులు పేల్చడంతో పాటు ఢిల్లీ చుట్టుపక్కల ప్రాంతాల్లో రైతులు పొలాల్లో గడ్డి కాలబెట్టడంతో కాలుష్యం పెరుగుతూ ఉంటుంది. దీపావళి సందర్భంగా సోమ, మంగళవారలో గాలి నాణ్యత మరింత పడిపోయింది..సిస్టం ఆఫ్ ఎయిర్ క్వాలిటీ అండ్ వెదర్ ఫోర్ కాస్టింగ్ అండ్ రీసెర్చ్ అంచనా ప్రకారం ఢిల్లీలో వెలువడే గాలి పీల్చేందుకు ఏమాత్రం అనువు కాదని తేల్చేసింది. ఒకవేళ పటాకులు కాల్చకున్నా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 314 నుంచి 400, కాలిస్తే మరింత ఎక్కువగా 401 నుంచి 500 వరకు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది.. పోయిన సంవత్సరం దీపావళికి ముందు రోజు ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 314 గా, దీపావళి రోజు 382 గా, ఆ మరుసటి రోజు 462 గా నమోదయింది.

గడ్డి కాల్చకుంటే లక్ష రూపాయలు
రైతులు పొలాల్లో గడ్డి కాలుస్తుండడంతో కాలుష్యం ఎక్కువవుతుంది. దీన్ని ఆపేందుకు పంజాబ్ స్పీకర్, ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే కుల్తార్ సింగ్ సంధ్వన్ రైతులకు ఒక ఆఫర్ ఇచ్చారు. తన నియోజకవర్గమైన కోట్కాపురా లోని రైతులు గడ్డి కాల్చకుంటే పంచాయతీకి లక్ష రూపాయలు చొప్పున ఇస్తానని ప్రకటించారు. గడ్డి కాల్చడం వల్ల కలిగే నష్టాన్ని వివరిస్తూ ఉండడంతో ప్రజలు ఇప్పుడిప్పుడే దానిని మానేస్తున్నారని ఆప్ ఎమ్మెల్యే తెలిపారు. త్వరలోనే పంజాబ్ రైతులు అంతా గడ్డి కాల్చడం మానేస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. దీపావళి నేపథ్యంలో గడ్డి కాల్చని రైతులను ఆయన సన్మానించారు. కుటుంబ సభ్యులందరికీ మిఠాయి ప్యాకెట్లు పంచారు.
గాలి నాణ్యత పడిపోతే ఏమవుతుందో తెలుసా
ఇక ఢిల్లీలో గాలి నాణ్యత రోజురోజుకు పోతున్న నేపథ్యంలో దాని ప్రభావం మనుషులపై తీవ్రంగా ఉంటుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఢిల్లీ యూనివర్సిటీ ప్రాంతంలో గాలి నాణ్యత చాలా పేలవమైన కేటగిరి 327 కు చేరింది. మధుర రోడ్ లోని పేద కేటగిరిలో 293, గురుగ్రామ్ లో మోడరేట్ కేటగిరీలో 156 గా నమోదయింది. ఇప్పటికే ఢిల్లీ, జాతీయ రాజధాని ప్రాంతం లో ప్రజలు విషపూరితమైన గాలిని పీల్చుకుంటున్నారు. దీపావళి నేపథ్యంలో ఈ గాలి మరింత విషపూరితమైందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. వాయు కాలుష్యం ప్రధానంగా ఊపిరితిత్తుల సమస్యలతో మాత్రమే ముడిపడి ఉంటుంది. ఇది ఆస్తమా రోగుల సమస్యను మరింత జటిలం చేస్తుంది. వాస్తవానికి కొన్ని సంవత్సరాలుగా యువతలో గుండె జబ్బులు పెరుగుతున్నాయి. ఎందుకు వాయు కాలుష్యం కూడా ఒక ప్రధాన కారణం. 20 ఏళ్లలో ఈ పరిస్థితి మరింత దారుణంగా మారింది.. యువత జీవనశైలిలో మార్పు వచ్చింది. వాయు కాలుష్యం గుండె ధమనుల్లో మంట కలిగిస్తుంది. 2.5 పర్టికులేటెడ్ మ్యాటర్ ను పరిశీలిస్తే కాలుష్యంలో చాలా హానికరమైన పదార్థాలు ఉన్నాయి. ఊపిరితిత్తుల నుంచి రక్తనాళాల్లోకి వెళ్లే పదార్థాలు మాత్రమే కాకుండా కార్బన్ మోనాక్సైడ్, నైట్రోజన్ వంటి వాయుపదార్థాలు కూడా ఉన్నాయి. నైట్రస్ ఆక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్, నైట్రస్ ఆక్సైడ్ వంటివన్నీ హానికారకమైన పదార్థాలు. ఇవి గుండె ధమనుల వాపునకు కారణమవుతాయి. ఇవి రక్త ప్రవాహం ద్వారా ఊపిరితిత్తుల్లోకి చేరినప్పుడు గుండె ధమనులు తీవ్రమైన వాపునకు గురవుతాయి. ఇది అంతిమంగా గుండె పనితీరుపై పడుతుంది. సకాలంలో చికిత్స తీసుకోకపోతే కార్డియాక్ అరెస్టు సంభవిస్తుంది.

రక్తం గడ్డ కడుతుంది
హానికారక వాయువుల వల్ల రక్తం గడ్డ కడుతుంది. ఇది అంతిమంగా గుండెపోటుకు దారితీస్తుంది. రక్తం గడ్డ కట్టడం వల్ల గుండె ధమనుల లోపలి పొర దెబ్బతింటుంది. ఇది కొలెస్ట్రాల్, కరోనరీ ఆర్టరీ వ్యాధికి దారితీస్తుంది. ఈ కాలుష్య కణాలు మళ్ళీ రక్తంలో కలిసిపోయినప్పుడు హార్ట్ బీట్ లో తేడా వస్తుంది. కొన్నిసార్లు ఆకస్మిక మరణం సంభవిస్తుంది. ఇవన్నీ జరగకుండా ఉండాలంటే కాలుష్యాన్ని వెదజల్లే పదార్థాలను గాల్లోకి విడుదల చేయకూడదు. మొక్కలను విరివిగా పెంచాలి. సమయం దాటిన వాహనాలను తుక్కు కింద పరిగణించాలి. సాధ్యమైనంతవరకు కాలినడకకు ప్రాధాన్యం ఇవ్వాలి. ఇలా చేసినప్పుడే మనుషుల మనుగడ బాగుంటుంది.