Tirumala : హవ్వా.. అపచారం.. తిరుమల కానుకలను మళ్లించేస్తున్నారా?

దీనిపై టిటిడితోపాటు తిరుపతి కార్పొరేషన్ లకు కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. దీంతో జగన్ సర్కార్ కు ఝలక్ తగిలినట్లు అయ్యింది.

Written By: NARESH, Updated On : December 14, 2023 9:22 pm
Follow us on

Tirumala : రాష్ట్రం ఆర్థికంగా దూసుకుపోతోందని వైసీపీ సర్కార్ చెబుతోంది. రాష్ట్రంలో వృద్ధిరేటు పెరిగిందని.. దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి చెబుతుంటారు. కానీ వాస్తవ పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది. ఎంతలా అంటే తిరుమల తిరుపతి దేవస్థానానికి వచ్చే కానుకలను తిరుపతి నగరపాలక సంస్థ అభివృద్ధికి మళ్ళించేదాకా మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి రావడం దారుణం.

ఎన్నో దశాబ్దాలుగా ఎన్నో ప్రభుత్వాలు కొలువు తీరాయి కానీ.. ఏనాడు తిరుమల తిరుపతి దేవస్థానం కానుకల విషయంలో ఏనాడు.. ఏ ప్రభుత్వము కలుగజేసుకున్న దాఖలాలు లేవు. కానీ వైసీపీ ప్రభుత్వం ఈ సాహసం చేసింది. తిరుపతి నగరంలో రోడ్ల నిర్మాణం, పారిశుద్ధ్య పనుల కోసం భక్తులు సమర్పించుకున్న కానుకలలో.. రూ.100 కోట్లు తీసి తిరుపతి కార్పొరేషన్ కు అందించింది. అంతటితో ఆగలేదు. ఏటా కానుకలలో ఒక్క శాతం నిధులను తిరుపతి కార్పొరేషన్కు ఇవ్వాలని తీర్మానించింది. కానీ విమర్శలు వెల్లువెత్తడంతో ఆ ప్రయత్నాన్ని ప్రభుత్వం విరమించుకుంది.

అయితే భక్తుల కానుకల విషయంలో అలవాటు పడిన వైసిపి సర్కార్ ఎంత దాకా అయినా తెగిస్తుందని… బిజెపి నేత భాను ప్రకాష్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దేవాదాయ చట్టంలో సెక్షన్ 111 ప్రకారం తిరుమల శ్రీవారి ఆదాయాన్ని ఇతర అవసరాలకు మళ్లించడం విరుద్ధమని.. ఇకపై టీటీడీ నిధులను మళ్లించకుండా ఆదేశించాలని పిటిషన్ లో కోరారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు టీటీడీ నిధులను తిరుపతి పారిశుద్ధ్య పనులతో సహా ఇతర అవసరాలకు ఉపయోగించకూడదని స్పష్టం చేసింది. దీనిపై టిటిడితోపాటు తిరుపతి కార్పొరేషన్ లకు కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. దీంతో జగన్ సర్కార్ కు ఝలక్ తగిలినట్లు అయ్యింది.