రోజులు పెరుగుతున్న కొలదీ బీజేపీకి వైసీపీ సర్కార్ దూరం అవుతోందన్న అనుమానాలు కలుగుతున్నాయి ఇప్పటివరకు కేంద్రంలోని బీజేపీకి జగన్ అన్నివిధాలా సపోర్టుగా నిలుస్తూ వచ్చారు. కేంద్రం తెచ్చిన ప్రజావ్యతిరేక విధానాలకు సైతం మద్దతు తెలుపుతూ వచ్చింది. పార్లమెంట్‌లో పెట్టిన ప్రతీ బిల్లు పాస్ అయ్యేందుకు తమవంతు సహకారం అందించారు. అయితే.. కేంద్రంలో సఖ్యంగా ఉన్న వీరి స్నేహం రాష్ట్రంలో కొనసాగించలేకపోయారు. కేంద్రంతో మాత్రమే మంచిగా ఉండి రాష్ట్ర ప్రయోజనాలను సాధించుకురావాలని జగన్ అభిమతం.
రాష్ట్రానికి వచ్చేసరికి బీజేపీ విపక్ష పాత్ర పోషిస్తోంది. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు నేతృత్వంలో ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై పోరాడుతున్నారు. ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు నిలదీస్తున్నారు. ముందు నుంచీ ఆయన, పార్టీ జగన్ పట్ల గుర్రుగానే ఉంది. అయితే.. ఇప్పుడు ఆ కోపం మరింత పెరిగినట్లుగా తెలుస్తోంది. రాష్ట్రంలో పార్టీతో ఎలా ఉన్నా.. ఫైనల్‌గా రాష్ట్ర ప్రయోజనాలపైనే జగన్ దృష్టి పెట్టారు.
అయితే.. ఇప్పుడు జగన్ ఆలోచనలు కూడా అమల్లోకి వస్తాయనే నమ్మకం లేకుండాపోయింది. ఇప్పటికే రాష్ట్రంలో మత మార్పిడులు, హిందూ దేవాలయాలపై దాడులు తదితర పరిణామాలతో బీజేపీ నేతలు వైసీపీని టార్గెట్ చేశారు. ఒకానొక సందర్భంలో రోడ్లపైకి వచ్చి ఆందోళనలు కొనసాగించారు. దుండగులను పట్టుకోవాలని.. వెంటనే శిక్షించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నమే చేశారు.
ఇక ఇప్పుడు జగన్‌కు కేంద్రంతోనూ చెడినట్లుగా వార్తలు వస్తున్నాయి. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్రానికి జగన్ లేఖ రాసినా పెద్దగా స్పందించలేదు. దీంతో ఇది జగన్‌కు కూడా ఇబ్బందికరంగా మారింది. విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరణకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే.. రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలన్న నిర్ణయానికి జగన్ వచ్చినట్లుగా తెలుస్తోంది. అందుకే.. రాష్ట్రంలో బీజేపీ ఆధిపత్యానికి బ్రేక్ వేయాలని జగన్ ఆలోచనకు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఇక్కడ టైట్ చేస్తే.. కేంద్రంలో కదలిక వస్తుందని జగన్ ఆలోచనగా తెలుస్తోంది. అందుకే.. బీజేపీపై విమర్శలు పెంచాలని మంత్రులకు, నాయకులకు కూడా జగన్ చెప్పినట్లుగా టాక్. అందుకే.. ఈ మధ్య పార్టీ నేతలు బీజేపీని టార్గెట్ చేసినట్లుగా తెలుస్తోంది. మొత్తంగా రాష్ట్రంలో బీజేపీని ఇబ్బందుల పాల్జేసీ కేంద్రం నుంచి లబ్ధిపొందాలని జగన్ ప్రయత్నాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది.