Ambati Rambabu : ఏపీలో నోరున్న నేతల్లో మంత్రి అంబటి రాంబాబు ఒకరు. మొన్నటికి మొన్న పక్క రాష్ట్రంలోని ఖమ్మం వెళ్లిన ఆయనకు అక్కడ స్థానికుల నుంచి నిరసన వ్యక్తమైంది. పేరుకే ఆయన మంత్రి కానీ.. ఆయన మాట తీరు, వ్యవహార శైలితో విపరీతమైన శత్రుత్వం పెంచుకుంటున్నారు. రాజకీయ ప్రత్యర్థులకు సైతం టార్గెట్ గా మారుతున్నారు. అన్నింటికీ మించి సొంత నియోజకవర్గంలోని.. సొంత పార్టీ శ్రేణుల అసమ్మతిని ఎదుర్కొంటున్నారు. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న సత్తెనపల్లిలో ఆయనపై అసమ్మతి గళం రోజురోజుకు పెరుగుతోంది. ఏకంగా ప్రత్యేక సమావేశాలు పెట్టి అంబటి రాంబాబుకు టికెట్ ఇస్తే.. తాము సహకరించేది లేదని కొందరు నేతలు తేల్చి చెబుతున్నారు. ఇప్పుడు వైసీపీ హై కమాండ్ కు ఇదో తలనొప్పి వ్యవహారంగా మారింది.
గత ఎన్నికల్లో సత్తెనపల్లి నుంచి బరిలో దిగిన అంబటి రాంబాబు అప్పటి సిటింగ్ స్పీకర్ కోడెల శివప్రసాద్ ను ఓడించారు. అంబటిది ఆది నుంచి వివాదాస్పద వైఖరే. సమన్వయంగా పనిచేసి అంబటి రాంబాబును గెలిపించుకున్నారు. అయితే మంత్రిగా ఉన్న అంబటి అందరినీ కలుపుకు వెళ్లడంలో ఫెయిల్ అయ్యారు. దీంతో నియోజకవర్గంలోని మెజారిటీ క్యాడర్ అంబటి తీరును వ్యతిరేకిస్తోంది. వచ్చే ఎన్నికల్లో అంబటిని మరోసారి బరిలో దించితే ఓటమి ఖాయమని తేల్చి చెబుతోంది. తామంతా సహకరించేది లేదని పలుమార్లు వారు అధినాయకత్వానికి హెచ్చరికలు పంపారు. కానీ అంబటి మాత్రం డోంట్ కేర్ అంటూ అసమ్మతి నాయకులను లైట్ తీసుకుంటున్నారు. కనీసం వారిని పలకరించకపోవడంతో వారంతా అంబటికి వ్యతిరేకంగా మారిపోయారు. జగన్ ముద్దు.. అంబటి వద్దు అంటూ నినదిస్తున్నారు.
ఇటీవల అసమ్మతి నాయకులు తమ స్వరాన్ని తీవ్రతరం చేశారు. నకరికల్లు మండలంలో మెజారిటీ క్యాడర్ అంబటికి వ్యతిరేకంగా ఉంది. అంబటికి వ్యతిరేకంగా ఇంటింటా ప్రచారం సైతం మొదలుపెట్టారు. మంత్రి అంబటి గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి హాజరు కాగా.. అదే సమయంలో జయహో జగనన్న పేరుతో కొత్త కార్యక్రమం చేపట్టడం హాట్ టాపిక్ గా మారింది. ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేసి నేరుగా అంబటి రాంబాబు పైనే కొందరు నేతలు విమర్శనాస్త్రాలు సంధించారు. అంబటికి హై కమాండ్ మొండి చేయి చూపాలని.. సత్తెనపల్లిలో కొత్త అభ్యర్థిని బరిలో దించాలని అసమ్మతి నాయకులు డిమాండ్ చేస్తున్నారు. పార్టీ కోసం కష్టపడుతున్న తమను మంత్రి పట్టించుకోవడంలేదని.. సొంత అజెండాతో పార్టీని నిర్వీర్యం చేస్తున్నారని ఆరోపణలు చేశారు.
పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టు ఉంది అంబటి పరిస్థితి. అయినదానికి కాని దానికి రాజకీయ ప్రత్యర్థులపై విరుచుకుపడే అంబటి రాంబాబు రాజకీయంగా కుదురుకునే పని చేయలేదు. గత నాలుగున్నర ఏళ్లుగా వివాదాస్పద అంశాలతోనే ఎక్కువగా గడిపారు. అప్పుడెప్పుడో దశాబ్దాల కిందట గెలిచిన అంబటి.. జగన్ ప్రభంజనం రూపంలో గత ఎన్నికల్లో అప్పటి సిటింగ్ స్పీకర్ కోడెల శివప్రసాదరావు పై గెలుపొందగలిగారు. ఆ గెలుపును తన గెలుపుగా భావించుకున్నారే తప్ప.. భవిష్యత్ రాజకీయాలకు పునాదులు వేసుకోలేకపోయారు. ఇప్పుడు సొంత పార్టీలోనే అసమ్మతిని ఎదుర్కొంటూ.. ఏరి కోరి కష్టాలను కొనితెచ్చుకుంటున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే హైకమాండ్ టిక్కెట్ ఇవ్వకపోయినా ఆశ్చర్యపడనవసరం లేదని వైసిపి వర్గాలు చెబుతున్నాయి. ఇకనైనా అంబటి కుదురుకుంటారో? లేదో? చూడాలి.