Chirala YCP: చీరాల వైసీపీలో స్ట్రాంగ్ ఫైట్..

2019 ఎన్నికల్లో చీరాల నియోజకవర్గ నుంచి వైసీపీ అభ్యర్థిగా ఆమంచి కృష్ణమోహన్ పోటీ చేశారు. టిడిపి నుంచి అనూహ్యంగా కరణం బలరామకృష్ణను చంద్రబాబు బరిలో దించారు.

Written By: Dharma, Updated On : August 11, 2023 12:01 pm

Chirala YCP

Follow us on

Chirala YCP: చీరాల వైసీపీలో విభేదాలు ఆగడం లేదు. రోజురోజుకు పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదు. హై కమాండ్ మధ్యేమార్గంగా సమస్యకు పరిష్కార మార్గం చూపినా.. ప్రయోజనం లేకుండా పోతోంది. ఎమ్మెల్యే కరణం బలరాం,మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ వర్గాల మధ్య తరచూ వివాదాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా పంచాయతీ వార్డు ఉప ఎన్నికల్లో ఇరు వర్గాల వారు పోటీపడ్డారు. భౌతిక దాడులకు దిగారు. దీంతో చీరాల నియోజకవర్గము అంటేనే వైసిపి హై కమాండ్ ఒక విధమైన కలవరపాటుకు గురవుతోంది.

2019 ఎన్నికల్లో చీరాల నియోజకవర్గ నుంచి వైసీపీ అభ్యర్థిగా ఆమంచి కృష్ణమోహన్ పోటీ చేశారు. టిడిపి నుంచి అనూహ్యంగా కరణం బలరామకృష్ణను చంద్రబాబు బరిలో దించారు. అయితే ఎన్నికల్లో కరణం బలరాం విజయం సాధించారు. వైసీపీ నియోజకవర్గ ఇన్చార్జిగా ఆమంచి కృష్ణమోహన్ కొనసాగే వారు. కానీ కరణం బలరాం పార్టీని ఫిరాయించారు. వైసీపీకి దగ్గరయ్యారు. వచ్చే ఎన్నికల్లో బలరాం తనయుడు వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు సిద్ధపడ్డారు. ఇది ఆమంచి కృష్ణమోహన్ కు మింగుడు పడలేదు. తరచూ వివాదాలు జరుగుతుండడంతో వైసిపి అధిష్టానం వారి మధ్య రాజీ ఫార్ములాను సూచించింది. ఆమంచి కృష్ణమోహన్ కు పరుచూరు నియోజకవర్గ బాధ్యతలు అప్పగించారు. అయినా సరే ఆమంచి మనసు మాత్రం చీరాల పైనే ఉంది.

ఇటీవలే ఆమంచి కృష్ణమోహన్ సోదరుడు జనసేన పార్టీలో చేరారు. కృష్ణమోహన్ సైతం జనసేన గూటికి చేరుతారని అంతా భావిస్తున్నారు. చీరాల నియోజకవర్గంలో ఆమంచికి మంచి పట్టు ఉంది. అయితే తనను పరుచూరు పంపించి అన్యాయం చేస్తున్నారన్న ఆవేదన ఆయనలో ఉంది. అందుకే సోదరుడిని ముందుగా పంపించి.. ఎన్నికల సమయానికి ఆయన జనసేనలో చేరుతాని ప్రచారం జరుగుతోంది. జనసేన, టిడిపి మధ్య పొత్తు కుదిరితే ఈ నియోజకవర్గాన్ని సునాయాసంగా గెలుపొంద వచ్చు అన్నది ఆమంచి భావన. అయితే ఎట్టి పరిస్థితుల్లో చీరాలలో పట్టు సడల కూడదు అన్నది ఆమంచి కృష్ణమోహన్ అభిమతం. అందుకే కరణం బలరాం వర్గంతో ఢీ అంటే ఢీ అన్నట్టు ముందుకు సాగుతున్నారు.

తాజాగా పంచాయతీ వార్డు ఉప ఎన్నికల్లో రెండు వర్గాల మధ్య గట్టి పోటీ నెలకొంది. వేటపాలెం మండలం రామన్నపేటలో 6, 10 వార్డులకు ఉప ఎన్నికలు ప్రకటించారు. ఈ వార్డులకు రెండు వర్గాల వారు పోటాపోటీగా నామినేషన్లు దాఖలు చేశారు. ఇలా చేసే క్రమంలో రెండు వర్గాల మధ్య కవ్వింపు చర్యలు చోటుచేసుకున్నాయి. ఇరు వర్గాల వారు కొట్లాటకు దిగారు. పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే ఏఎస్పి స్థాయి పోలీస్ అధికారికి ఈ ఘటనలో గాయాలైనట్లు తెలుస్తోంది. అయితే రోజంతా నివురు గప్పిన నిప్పులా పరిస్థితి ఉంది. రామన్నపేట రణ రంగాన్ని తలపించింది. చివరకు గురువారం రాత్రి పోలీసులు లాఠీ చార్జి చేసినట్లు తెలిసింది. దీంతో పరిస్థితి అదుపులోకి వచ్చినట్లు సమాచారం. మొత్తానికైతే చీరాల వైసీపీలో వర్గ విభేదాలు హై కమాండ్ కు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి.