KCR Khammam Sabha- Jagan: ఔను.. వాళ్లిద్దరూ సొంత అన్నదమ్ముల కంటే ఎక్కువ. ప్రాంతాలు వేరైనా.. ప్రజలు విడిపోయినా వాళ్లిద్దరూ విడిపోలేదు. వారి మధ్య బంధం తెగిపోలేదు. ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకోలేదు. ఒకరి మేలు ఇంకొకరు కోరుతారు. ఏపీ, తెలంగాణలో ఒకరికొకరు సహకరించుకుంటారు. ఎప్పూడు కలవరు. కానీ ఇరువురి అవసరాలు తీర్చుకుంటారు. ఆ అపూర్వ సహోదరులు ఎవరో కాదు ఏపీ, తెలంగాణ సీఎంలు జగన్, కేసీఆర్ లు.

ఖమ్మంలో బీఆర్ఎస్ బహిరంగ సభను ఏర్పాటు చేసింది. భారీ ఎత్తున సభ నిర్వహిస్తోంది. పంజాబ్, ఢిల్లీ, కేరళ సీఎంలు భగవంత్ మాన్, కేజ్రీవాల్, పినరయి విజయన్ లను కేసీఆర్ ఆహ్వానించారు. వారితో పాటు సమాజ్ వాదీ నేత అఖిలేశ్, సీపీఐ రాజా కూడ వచ్చారు. కానీ పక్కనే ఉన్న ..తెలుగు రాష్ట్రమైన ఏపీ సీఎం జగన్ ను కేసీఆర్ ఆహ్వానించలేదు. జగన్, కేసీఆర్ ఇద్దరూ చాలా సఖ్యతగా ఉంటారు. ఏపీ, తెలంగాణ సమస్యలు తీరుకపోయినా ఇరువురి అవసరాలు తీర్చుకుంటారు. అలాంటి వ్యక్తులు బీఆర్ఎస్ ఏర్పాటయ్యాక ఒక్కసారి కూడ కలవకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
కేసీఆర్ సభకు జగన్ ను ఆహ్వానించకపోవడంలో కూడ రాజకీయం, పరస్పర అవసరాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. బీజేపీని టార్గెట్ చేస్తూ కేసీఆర్ బీఆర్ఎస్ ను ఏర్పాటు చేశారు. దేశవ్యాప్తంగా బీజేపీ వ్యతిరేకుల్ని ఒక తాటి పైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. బీఆర్ఎస్ జెండా ఆవిష్కరణ మొదలుకొని ఖమ్మం సభ వరకు బీజేపీయేతర సీఎంలను కేసీఆర్ ఆహ్వానించారు. కానీ ఒక్క జగన్ ను మాత్రం పిలవలేదు. దీనికి కారణం జగన్ కు బీజేపీతో ఉన్న సంబంధాలే.

ఏపీ అప్పులతో నెట్టుకొస్తోంది. కేంద్రం దయాదాక్షిణ్యాలతో జగన్ ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. దీనికి తోడు అదనంగా సీబీఐ కేసులు ఉండనే ఉన్నాయి. ఇలాంటి తరుణంలో జగన్ బీజేపీతో విబేధించే పని చేయడు. ఒకవేళ విభేధించినా అది జగన్ ఉనికికే ప్రమాదం. అందుకే కేసీఆర్ సభలకు జగన్ దూరంగా ఉంటున్నారు. జగన్ అవసరాలను గుర్తించిన కేసీఆర్ బీఆర్ఎస్ సభలకు ఆహ్వానించడంలేదని విశ్లేషకులు భావిస్తున్నారు. జగన్ ను ఇబ్బంది పెట్టడం కేసీఆర్ కు ఇష్టం లేదని తెలుస్తోంది.
ఏపీలో కూడ జగన్ మంచి జరిగే పని చేయడానికే కేసీఆర్ పూనుకున్నారు. జనసేన వైపు కాపుల ఓట్లు గంపగుత్తగా వెళ్లకుండా కాపు నేతల్ని బీఆర్ఎస్ లో చేర్చుకున్నారు. కాపుల ఓట్లు కొన్ని చీల్చినా అది జగన్ కు లాభమవుతుందని కేసీఆర్ భావిస్తున్నారు. పరస్పర ప్రయోజనాల దృష్ట్యా ఇద్దరూ దూరంగా ఉంటున్నారని రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. కేంద్రంలో ఎవరు ఉన్నా వారితో సఖ్యతగా ఉండటం జగన్ కు అవసరమని విశ్లేషకులు చెబుతున్నారు. అలాంటప్పుడు కేసీఆర్ తో వెళ్లి జగన్ కోరి ఇబ్బందులు తెచ్చుకోడని భావిస్తున్నారు.