Ratan Tata : రతన్‌ టాటా అనగానే గుర్తొచ్చే విషయాలు ఇవే

నాణ్యత, నమ్మకంతో చేస్తూ అడుగు పెట్టిన ప్రతి వ్యాపారాన్ని అందనంత ఎత్తుకు తీసుకెళ్లడంతో టాటా గ్రూప్‌ ప్రస్థానంలో రతన్‌ టాటా కృషి అమోఘమైనది.

Written By: Mahi, Updated On : October 10, 2024 6:15 pm

Ratan Tata

Follow us on

Ratan Tata : ప్రముఖ పారిశ్రామికవేత్త, టాటా సన్స్ ఎమెరిటస్ చైర్మన్ రతన్ టాటా బుధవారం కన్నుమూశారు. ఆయనకు 86 ఏళ్లు. ముంబైలోని ఓ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. చాలా కాలంగా అనారోగ్యంతో ఉన్నాడు. టాటా సన్స్ ఛైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ ఒక ప్రకటనలో రతన్ టాటా మరణాన్ని ధృవీకరించారు. అతనిని ‘స్నేహితుడు, గురువు, ఇన్ స్పిరేషన్’ అని పేర్కొన్నారు. రతన్ టాటా 28 డిసెంబర్ 2012న టాటా సన్స్ ఛైర్మన్‌గా పదవీ విరమణ చేశారు. రతన్ టాటా మృతి పట్ల ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేసిన ప్రధాని నరేంద్ర మోదీ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో తన సంతాపాన్ని వ్యక్తం చేశారు. 1937లో జన్మించారు రతన్ టాటా.. అనంతరం 1948లో అతని తల్లిదండ్రులు విడిపోయిన తర్వాత అతని అమ్మమ్మ నవాజ్‌బాయి టాటా వద్ద పెరిగారు. రతన్ టాటా 1962లో కార్నెల్ విశ్వవిద్యాలయం నుండి డిగ్రీని పొందారు. అతను 1962 చివరలో భారతదేశానికి తిరిగి రావడానికి ముందు లాస్ ఏంజిల్స్‌లో జోన్స్ అండ్ ఎమ్మోన్స్‌తో కొంతకాలం పనిచేశాడు. 2008లో భారత ప్రభుత్వం అతనికి దేశంలోని రెండవ అత్యున్నత పౌర పురస్కారం పద్మవిభూషణ్‌ను అందించింది. అతను 28 డిసెంబర్ 2012న టాటా సన్స్ ఛైర్మన్‌గా పదవీ విరమణ చేశాడు. రతన్ టాటా ప్రయాణం ఒక స్ఫూర్తిదాయకమైన కథ. ఇది అతని దృష్టి, కృషి, నాయకత్వ నైపుణ్యాలను ప్రతిబింబిస్తుంది. ఆయన తన కంపెనీల ద్వారా ఉప్పు నుంచి ఉక్కు వరకు ప్రవేశించని రంగమే లేదు.

నాణ్యత, నమ్మకంతో చేస్తూ అడుగు పెట్టిన ప్రతి వ్యాపారాన్ని అందనంత ఎత్తుకు తీసుకెళ్లడంతో టాటా గ్రూప్‌ ప్రస్థానంలో రతన్‌ టాటా కృషి అమోఘమైనది. ఆయన నిత్య మార్గదర్శకుడిగా, దాతృత్వశీలిగా, మానవతావాదిగా పేరు తెచ్చుకున్నారు. ప్రపంచంలోనే దిగ్గజ వ్యాపారవేత్తల్లో ఒక్కరిగా ఎదిగారు. ఆయన నేతృత్వంలో టాటా గ్రూప్‌.. ఆకాశమంత ఎత్తుకు ఎదిగింది. రతన్‌ టాటా ఎప్పుడూ లాభాల కంటే చిత్తశుద్ధికి ప్రాధాన్యం ఇచ్చారు. అదే ఆయనకు అంతులేని గౌరవాన్ని సంపాదించిపెట్టింది. ఆయన తీసుకొనే నిర్ణయాలు స్వల్పకాలిక లాభాల కంటే దీర్ఘకాలిక శ్రేయస్సుకు ఉపయోగపడేలా ఉండాలని రతన్ టాటా భావిస్తారు. అందుకే మిగతా వ్యాపారవేత్తల కంటే రతన్ టాటా ఎంతో ప్రత్యేకంగా కనిపిస్తారు. వ్యాపారాలను నిర్వహించడంలోనే కాదు.. దాతృత్వంలోనూ ఆయనది అందెవేసిన చేయని చెప్పడంలో ఏ మాత్రం సందేహం లేదు. ఆయన జీవనశైలి, వ్యాపారాలను నడిపించే తీరు ప్రస్తుతం ఎంతో మందికి ఆదర్శంగా, స్ఫూర్తిగా నిలుస్తుంది. రతన్‌ టాటా అనగానే గుర్తొచ్చే కొన్ని ముఖ్యమైనం అంశాలు ఇవి.

దేశంలోని అతిపెద్ద వ్యాపార సామ్రాజ్యానికి అధినేత, లక్షలాది కోట్ల సంపదకు వారసుడు రతన్‌టాటా. అయినా కానీ, ఆయన ఎంతో వినయంగా ఉంటారు. ప్రచారాలకు, హంగులకు, ఆర్భాటాలకు దూరంగా అంటూ.. సాధారణ జీవనశైలితో ఉండటానికి ఇష్టపడతారు. రతన్‌ టాటా నాయకత్వంలో.. టాటా గ్రూప్ ప్రపంచవ్యాప్తంగా 100కి పైగా దేశాల్లో విస్తరించింది, జాగ్వార్, ల్యాండ్ రోవర్, కోరస్ స్టీల్ వంటి పెద్ద పెద్ద కంపెనీలను కొనుగోలు చేసి భారీ సామ్రాజ్యంగా విస్తరించింది.. ఆయన టాటా కంపెనీని మల్టీ నేషనల్ కంపెనీగా మార్చారు. సంస్థ విలువను నిలుపుకుంటూనే టాటా గ్రూప్‌ను ప్రపంచ బ్రాండ్‌గా నిలబెట్టారు.

రతన్‌ టాటా దాతృత్వానికి పెట్టింది పేరు. టాటా గ్రూప్ సంపాదన లో దాదాపు 65శాతం టాటా ట్రస్ట్‌ల ద్వారా ధార్మిక కార్యక్రమాలకు కేటాయించేవారు. ఆయన ఎల్లప్పుడూ నైతిక వ్యాపార పద్ధతులను పాటిస్తూ.. సామాజిక బాధ్యత నెరవేర్చాలని చెబుతుండేవారు. రతన్‌ టాటా ఎప్పుడూ వినూత్నంగా ఆలోచనలు చేస్తుండేవారు. మధ్యతరగతి ప్రజలకు కారు అందుబాటులో ఉండేలా రూ.లక్షకు నానో కారును ఆవిష్కరించారు. ఆయన తీసుకున్న ఎన్నో సాహసోపేత నిర్ణయాలు సంస్థను ముందుకు తీసుకెళ్లే విధంగా సహకారం అందించాయి.

ముంబైలో 2008లో తాజ్‌ హోటల్‌లో ఉగ్రదాడి జరిగింది. ఆ సమయంలో రతన్‌ టాటా చూపించిన ఉదారత మాటల్లో చెప్పలేనిది. హోటల్‌ సిబ్బందితోపాటు బాధితులుగా మారిన వారందరికీ అండగా ఉంటానంటూ రతన్ టాటా హామీ ఇచ్చారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నారు. టాటా వ్యాపార సామ్రాజ్యాన్ని ప్రపంచవ్యాప్తంగా విస్తరించే క్రమంలో ఆయన ఎప్పుడూ భారతీయ విలువలు, సంస్కృతిని మరచిపోలేదు. భారతీయుడిగా గర్వపడుతూ.. ఆధునిక ప్రపంచంతో పోటీ పడ్డారు. ఉద్యోగుల పట్ల ఆయన ఎంతో శ్రద్ధ చూపేవారు. సంక్షోభ సమయాల్లో ఉద్యోగుల సంక్షేమానికి పాటుపడేవారు. టాటా స్టీల్‌లో కంపెనీలో పనిచేసే ఉద్యోగులు చనిపోయిన వారి కుటుంబ బాధ్యత తీసుకున్నారు.