
సాధారణంగా ఎన్నికలు అనగానే డబ్బు ఏరులై పారుతుంది. ఎన్నికల్లో గెలుపు కోసం సగటు రాజకీయ నాయకుడు ఎంతో కొంత నగదును ఖర్చు చేస్తుంటారు. ఇక పార్టీల పరంగా చూస్తే అధికారంలో రావడానికి కావలినంత డబ్బు వెదజల్లనిదే పనికాదని భావిస్తుంటారు. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికొస్తే గత సార్వత్రిక ఎన్నికల్లో ఆయా రాజకీయ పార్టీలు ఎంతెంత ఖర్చు చేశారోనన్న విషయాన్ని సీఈసీ ఏర్పాటు చేసిన ఆడిట్ కమిటీ వెల్లడించింది. ఎన్నికల్లో డబ్బు పరిమితంగా ఖర్చు చేయాలని ఎలక్షన్ కమిషన్ సూచించినప్పటికీ కొన్ని రాజకీయ పార్టీలు మాత్రం అవేమీ పట్టించుకోలేదని తెలుస్తోంది.
ఇక ఏపీ విషయానికొస్తే గత 2019 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ఆ ఎనికల్లో ఎంత ఖర్చు చేసిందోనన్న విషయాన్ని ఆడిట్ కమిటీ తేల్చింది. వైసీపీతో పాటు కాంగ్రెస్, టీడీపీ ఇలా ఆయా పార్టీలకు సంబంధించిన వివరాలను ఈ కమిటీ బయటపెట్టింది. 2019 కంటే ముందు ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ ఏపీలో అధికారంలోకి రావడానికి రాజకీయ వ్యూహ కర్త ప్రశాంత్ కిషోర్ ను నియమించుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అధికారంలోకి రావడానికి భారీగానే ఖర్చుపెట్టినట్లు తెలుస్తోంది.
సీఈసీ ఆడిట్ కమిటీ తెలిపిన వివరాల ప్రకారం 2019 ఎన్నికల్లో వైసీపీ 89.49 కోట్లు వ్యయం చేసినట్లు వెల్లడించింది. ఇందులో 41. 49 కోట్ల రూపాయలను మేనెజ్ మెంట్ కన్సల్టెన్సీ సర్వీస్ పై ఖర్చు చేశారని అంటున్నారు. ఇక విరాళాల రూపంలో పార్టీకి భారీగానే నిధులు సమకూరినట్లు సమాచాకరం. ఆయా వ్యక్తుల ద్వారా రూ.42 కోట్లు, కార్పొరేట్ ఫండ్స్ రూపంలో 21.54 కోట్ల రూపాయలు సమీకరించారని తెలుస్తోంది.
ఇక ఎలక్టోరల్ బాండ్స్, ఫ్రుడెంట్ ట్రస్ట్ వంటి ఛానెళ్ల ద్వారా మరో 27 కోట్లు పార్టీ సేకరించినట్లు తెలుస్తోంది. మొత్తంగా వైసీపీ 2019 ఎన్నికలకు ముందు 99.84 కోట్లు, 2020లో మరో 74. 35 కోట్లు సమీకరించినట్లు తెలుస్తోంది. అయితే ఏ పార్టీ అయినా తాను ఖర్చు చేసిన మొత్తాన్ని వెల్లడించకపోవచ్చు. అధికారికంగా సీఈసీ కమిటీ ఈ లెక్కలను బయట పెట్టినా అనధికారికంగా ఇంకా ఎక్కువే ఉంటుందని చర్చించుకుంటున్నారు.