https://oktelugu.com/

టీఆర్‌‌ఎస్‌ మరోసారి ఆ సీటును వదులుకున్నట్లేనా..?

ఒక ఆరు నెలల వరకు తెలంగాణ రాష్ట్రంలో తిరుగులేని పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌‌ఎస్‌). కానీ.. ఎప్పుడైతే దుబ్బాక ఉప ఎన్నిక జరిగిందో అప్పటి నుంచి ఆ పార్టీకి దెబ్బ మీద దెబ్బ తగులుతూనే ఉంది. ప్రత్యామ్నాయంగా బీజేపీ తెర మీదకు వచ్చింది. ఇక అప్పటి నుంచి టీఆర్‌‌ఎస్‌కు మింగుడు పడడం లేదు. అటు దుబ్బాక ఓటమి.. ఇటు జీహెచ్‌ఎంసీలో సెంచరీ కాదు కదా గతంలో సాధించిన సీట్లు కూడా రాకపోవడంతో పార్టీ పరిస్థితి ఒక్కసారిగా […]

Written By:
  • Srinivas
  • , Updated On : February 13, 2021 / 02:02 PM IST
    Follow us on


    ఒక ఆరు నెలల వరకు తెలంగాణ రాష్ట్రంలో తిరుగులేని పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌‌ఎస్‌). కానీ.. ఎప్పుడైతే దుబ్బాక ఉప ఎన్నిక జరిగిందో అప్పటి నుంచి ఆ పార్టీకి దెబ్బ మీద దెబ్బ తగులుతూనే ఉంది. ప్రత్యామ్నాయంగా బీజేపీ తెర మీదకు వచ్చింది. ఇక అప్పటి నుంచి టీఆర్‌‌ఎస్‌కు మింగుడు పడడం లేదు. అటు దుబ్బాక ఓటమి.. ఇటు జీహెచ్‌ఎంసీలో సెంచరీ కాదు కదా గతంలో సాధించిన సీట్లు కూడా రాకపోవడంతో పార్టీ పరిస్థితి ఒక్కసారిగా దిగజారినట్లైంది. అందుకే.. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలను త్యాగం చేసే పనిలో పడినట్లుగా అర్థమవుతోంది.

    Also Read: ఆ సహనం వెనుక మతలబేంటి..? : డ్యామేజీ తప్ప ఇమేజీ వస్తుందా..!

    తెలంగాణ ఏర్పాటు తర్వాత టీఆర్ఎస్ ఎప్పుడూ ఎక్కడా ఏ ఎన్నికల్లోనూ వెనక్కి తగ్గలేదు. ఓడిపోయే స్థానాల్లో సైతం పోటీకి దిగి తమ ఉనికి చాటుకున్నారు. కానీ.. తొలిసారి తెలంగాణ ఏర్పాటు తర్వాత టీఆర్ఎస్ వెనకడుగు వేస్తోంది. హైదరాబాద్–-రంగారెడ్డి–-మహబూబ్ నగర్ పట్టభద్రుల నియోజకవర్గానికి జరిగే ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపున ఎవర్నీ పోటీకి దింపడం లేదు. ఒకవేళ అభ్యర్థిని బరిలో దింపినా ఓటమి ఖాయమని తేలడంతో.. అంత పరువు తక్కువ పని టీఆర్ఎస్ చేస్తుందని ఎవరూ ఊహించడంలేదు. అందుకే ఇప్పటి వరకూ అభ్యర్థినే ప్రకటించకుండా అధిష్టానం సైలెంట్‌గా ఉండిపోయింది.

    తెలంగాణ శాసనమండలిలో ఖాళీ అయ్యే రెండు ఎమ్మెల్సీ స్థానాల కోసం షెడ్యూల్ విడుదలైంది. ఈనెల 16న నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం అవుతుండగా, మార్చి 14న పోలింగ్ జరుగుతుంది. అయితే.. వరంగల్–-ఖమ్మం–-నల్గొండ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌‌కు కేసీఆర్ మరోసారి అవకాశమిచ్చారు. కొరకరాని కొయ్యగా ఉన్న హైదరాబాద్–-రంగారెడ్డి–-మహబూబ్ నగర్ స్థానం విషయంలో మల్లగుల్లాలు పడుతున్నారు.

    Also Read: పంచాయతీ ఎన్నికల్లో పార్టీల బలనిరూపణ

    హైదరాబాద్–-రంగారెడ్డి–-మహబూబ్ నగర్ గ్రాడ్యుయేట్ నియోజకవర్గంలో ఇప్పటివరకూ ఒక్కసారి కూడా టీఆర్ఎస్ అభ్యర్థి గెలవకపోవడం విశేషం. కనీసం తెలంగాణ ఏర్పాటు తర్వాతైనా ఆ స్థానం కేసీఆర్ సర్కారు వశం కాలేదు. 2007లో టీఆర్ఎస్ తరపున బరిలో దిగిన యెన్నం శ్రీనివాసరెడ్డి స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు. 2009లో టీఆర్ఎస్ నేరుగా బరిలో దిగకుండా ప్రొఫెసర్ నాగేశ్వర్‌‌కే మద్దతు ఇచ్చింది. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత 2015లో ఆ స్థానాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న టీఆర్ఎస్ టీజీవో అధ్యక్షుడు దేవీప్రసాద్ తో ఉద్యోగానికి రాజీనామా చేయించి మరీ నామినేషన్ వేయించారు. అయినా ఫలితం దక్కలేదు.

    దీంతో ఈ దఫా కూడా పోటీపై టీఆర్ఎస్ వెనకడుగు వేస్తున్నట్లే కనిపిస్తోంది. అసలే టైమ్ బాగోలేదు, దుబ్బాక, జీహెచ్ఎంసీ ఫలితాలతో పరువు పోయింది, గెలుపుపై ధీమాలేని ఈ ఎమ్మెల్సీ సీటుకు పోటీ చేసి ఓడిపోతే మరింత పరువు పోతుందని అధిష్టానం నిర్ణయానికి వచ్చినట్లుగా సమాచారం.

    మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్