
ఒక కుటుంబంలో ఇద్దరు అన్నదమ్ములు లేక అన్నాచెల్లెళ్ల మధ్య గొడవలు జరుగుతుంటే.. అప్పటివరకు ఆ ఫ్యామిలీ అంటే పడనివాడు అందులో ఎవరో ఒకరికి మద్దతుగా నిలుస్తుంటాడు. ఆ కుటుంబాన్ని విడగొట్టాలనే ప్రయత్నం సాగిస్తుంటాడు. అయితే.. ఇప్పుడు వైఎస్ షర్మిల విషయంలోనూ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ సపోర్టు చూస్తుంటే అందరికీ అదే అర్థం అవుతోంది. రాజకీయ నాయకులు మీడియాను వాడడం సర్వసాధారణం. మీడియా యాజమాన్యాలు కూడా ఏదో ఒక పార్టీకి తొత్తుగా వ్యవహరించడం కూడా కామన్. అది తమ ఆర్థిక ప్రయోజనాలు కానీ.. మరేదైనా కానీ.. ప్రతీ మీడియా ఏదో ఒక పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తూనే ఉంటుంది.
Also Read: టీడీపీ పతనం ఖాయమట.. జాతీయ మీడియా సంచలన నిజాలు
ఈ విషయంలో ఎటువంటి జంకు లేకుండా.. ఎందాకైనా వెళ్లేందుకు తెగించే వైఖరి ఆంధ్రజ్యోతికి ఉంది. తెలుగుదేశం పార్టీని సమర్థించడంలో ఆ పత్రిక ఎండీ రాధాకృష్ణది ప్రత్యేక ముద్ర. ఈనాడు వంటి ప్రధాన పత్రిక శైలిలో కూడా తెలుగుదేశానికి మద్దతు కనిపిస్తుంది. కానీ.. బరితెగించి, బహిరంగంగా సమర్థిస్తున్నట్లుగా కనిపించకుండా జాగ్రత్త పడాలని చూస్తుంటుంది. ప్రస్తుతం ఆంధ్రజ్యోతి వైఎస్ తనయ షర్మిలకు రాజకీయ ప్లాట్ ఫామ్‌గా సపోర్ట్ ఇస్తోంది. రాధాకృష్ణ షర్మిలకు ఇలా సపోర్టుగా నిలవడంపై ఇరు రాష్ట్రాల్లో చర్చకు దారితీసింది. ఇందులోని మతలబు మీడియా, పొలిటికల్ సర్కిళ్లను తికమక పెడుతోంది. టీడీపీకి కుడిభుజంగా వ్యవహరించే జ్యోతి తాజాగా షర్మిల వార్తలపై మక్కువ చూపిస్తోంది. కేవలం వార్తా ప్రాముఖ్యమా? లేక నిజంగానే మీడియా సంచలనం కోసమే ప్రచురిస్తోందా? లోగుట్టు మరేదైనా ఉందా? అన్నదే ప్రశ్న.
షర్మిలకు సంబంధించిన ప్రతి సమాచారమూ, ఆమె పార్టీ ఏర్పాటుపై ప్రతి అడుగూ ఆంధ్రజ్యోతికే మొదటగా అందుతోంది. అయితే.. దీని వెనకాల మతలబు ఏమిటన్నది ఎవరికీ అంతుబట్టని విషయమే. చంద్రబాబు నాయుడి సిద్ధాంతం నచ్చో, లేకపోతే సామాజికవర్గ సమీకరణనో, అదీ కాకుంటే టీడీపీ హయాంలో ఆంధ్రజ్యోతికి ప్రభుత్వం నుంచి ఆర్థిక, వాణిజ్యపరంగా లభించిన సహకారమో.. ఏదేమైనా ఆంధ్రజ్యోతి టీడీపీకి అండదండగా నిలుస్తూ వస్తోంది. వైసీపీ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను అవసరానికి మించి విమర్శిస్తూ, భూతద్దంతో నిశితంగా శోధిస్తూ ప్రభుత్వ ప్రతిష్టను మసకబార్చే ప్రయత్నం చేస్తోంది. ఒక పార్టీగా టీడీపీ చేస్తున్న దానికంటే ప్రతిపక్ష పాత్రను ఆంధ్రజ్యోతి సమర్థంగా పోషిస్తోంది. ఈ క్రమంలోనే చంద్రబాబు నాయుడికి పెద్ద పీట వేయడమూ సహజమే.
Also Read: రెడ్డప్ప.. ఇలా మారావు ఏంటబ్బా?
అయితే.. చంద్రబాబు నాయుడి మోనాటనస్ విమర్శలు, ప్రజల్లో అతని పట్ల ఏర్పడిన ఏవగింపు ధోరణి కారణంగా ఆంధ్రజ్యోతి పత్రికగా కొంత నష్టపోతోంది. స్థల, సమయాలనూ కోల్పోతోంది. దీనివల్ల ఆంధ్రజ్యోతి క్రెడిబిలిటీ కొంతమేరకు దెబ్బతింటోంది. టీడీపీ శ్రేణులు ఎక్కువగా ఇష్టపడే పత్రికలో ఆ పార్టీని సమర్థించే వార్తలు రాకపోతే ఎలా అనేవారు కూడా ఉన్నారు. ఏదేమైనా తెలుగుదేశం పార్టీని, ఆంధ్రజ్యోతి పత్రికను విడదీసి చూడలేమన్న అవినాభావం ఏర్పడింది. ఆంధ్రజ్యోతి ప్రచారం వల్ల నిజంగానే టీడీపీ లాభపడుతోందా? అంటే కచ్చితంగా చెప్పలేని పరిస్థితి. ఒకానొక దశలో బీజేపీ హవా తగ్గిపోయింది. రానున్నది సంకీర్ణమే అంటూ సార్వత్రిక ఎన్నికలకు ఏడాదిన్నర ముందే ఆంధ్రజ్యోతి రకరకాల విశ్లేషణలు, అంకెల సమీకరణలు ఇచ్చింది. అది నిజమేనని నమ్మి టీడీపీ అధిష్ఠానం బీజేపీని దూరం చేసుకుని నష్టపోయింది.
కేవలం చంద్రబాబు నాయుడి వార్తలు, వైసీపీ ప్రభుత్వ వ్యతిరేక ప్రచారంతో ఆంధ్రజ్యోతికి పెద్దగా ప్రయోజనం చేకూరడం లేదు. అన్న జగన్ తో ఏర్పడిన విభేదాలతో కొత్త పార్టీ పెట్టాలనుకుంటున్న షర్మిలకు భారీ ప్రచార వేదికగా ఉపయోగపడటంలో ఆంధ్రజ్యోతి రెండు లక్ష్యాలను సాధించేందుకు వీలు ఏర్పడింది. షర్మిల రూపంలో వైసీపీ వ్యతిరేక ప్రచారంతో టీడీపీకి పరోక్షంగా లాభం చేకూరుతుంది. ప్రజల్లో షర్మిల పట్ల వ్యక్తమవుతున్న ఆదరణతో పత్రికగా తన సర్క్యులేషన్, రీడర్షిప్ పెరుగుతుంది. అందుకే రానున్న రోజుల్లో టీడీపీ అధినేత చంద్రబాబు స్థాయిలోనే షర్మిలకూ ఆంధ్రజ్యోతి వార్తల్లో స్థానం దక్కనుందనేది రాజకీయ అంచనా.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్