Revanth Reddy : రేవంత్‌కు రాహుల్‌ క్లాస్‌ పీకాడా?

టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌పై మాజీ పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి నేరుగా సోనియా గాంధీకి ఫిర్యాదు చేశారు. తన పైన రేవంత్‌ టీం సోషల్‌ మీడియాలో దుష్ప్రచారం చేస్తోందని ఆధారాలు సమర్పించారు. తనను పార్టీలో నుంచి బయటకు పంపే విధంగా పొమ్మనకుండా పొగ పెడుతున్నారని వివరించారు.

Written By: NARESH, Updated On : June 27, 2023 5:37 pm
Follow us on

Revanth Reddy : టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌కు కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ క్లాస్‌ తీసుకున్నారు. పార్టీని నడిపించాల్సిన వాడి అధ్యక్షుడిగా ఉండి.. వెనుకబడడం.. పార్టీలో సమన్వయం కొరవడడంపై అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. సున్నతంగా హెచ్చరిక కూడా చేసినట్లు సమాచారం. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్‌ వైపు చూస్తున్నట్లు నివేదికల్లో స్పష్టం అవుతుందని పేర్కొన్నట్లు సమాచారం. ఈ సమయంలో రేవంత్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న మల్కాజ్‌గిరి పార్లమెంట్‌తో పాటుగా సొంత అసెంబ్లీ నియోజకవర్గం కొడంగల్‌ లోనూ వెనుకబడి ఉన్నారని రాహుల్‌ తేల్చి చెప్పారని తెలుస్తోంది. పార్టీ అధ్యక్షుడిగా అందరినీ సమన్వయం చేసుకోవాలని.. సీనియర్లకు కచ్చితంగా గుర్తింపు ఇవ్వాల్సిందేనని స్పష్టం చేశారని సమాచారం. ఉత్తమ్‌ చేసిన ఫిర్యాదుపై వివరణ కోరినట్లు సమాచారం అందుతోంది.

కాంగ్రెస్‌ ఆపరేషన్‌ తెలంగాణ..
కాంగ్రెస్‌ ముఖ్య నేత రాహుల్‌ గాంధీ ఆపరేషన్‌ తెలంగాణ ప్రారంభించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచేందుకు కార్యాచరణతో సిద్ధమయ్యారు. కర్ణాటక గెలుపును తెలంగాణలోనూ కొనసాగించాలనే పట్టుదలతో ఉన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్‌ నేతలంతా కలిసి కట్టుగా పనిచేయటం ద్వారా అధికారంలోకి వచ్చిన అంశాన్ని రాహుల్‌ గెలుపు వ్యూహంలో ప్రధాన అంశంగా గుర్తించారు. ఇప్పుడు తెలంగాణ పీసీసీ చీఫ్‌ రేవంత్‌కు అదే విషయాన్ని స్పష్టం చేశారు. పార్టీ కోసం అందరూ కలిసి కట్టుగా పని చేయాల్సిందేనని తేల్చి చెప్పారు. వ్యక్తిగత అభిప్రాయాలు.. ఈగోలతో వ్యవహరించినా ఉపేక్షించేది లేదని తేల్చి చెప్పినట్లు విశ్వసనీయ సమాచారం.

రేవంత్‌పై ఉత్తమ్‌ ఫిర్యాదు..
ఇదిలా ఉంటే.. టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌పై మాజీ పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి నేరుగా సోనియా గాంధీకి ఫిర్యాదు చేశారు. తన పైన రేవంత్‌ టీం సోషల్‌ మీడియాలో దుష్ప్రచారం చేస్తోందని ఆధారాలు సమర్పించారు. తనను పార్టీలో నుంచి బయటకు పంపే విధంగా పొమ్మనకుండా పొగ పెడుతున్నారని వివరించారు. ఈ అంశంపై రాహుల్‌ నేరుగా రేవంత్‌ను నిలదీసినట్లు సమాచారం. ఇదే సమయంలో రేవంత్‌ పోటీ చేసిన నియోజకవర్గాల్లో ఆదరణ తగ్గటం పైనా రాహుల్‌ ఆరా తీసినట్లు సమాచారం. మల్కాజ్‌ గిరి పార్లమెంట్‌ పరిధిలోని అసెంబ్లీ స్థానాలపై రాహుల్‌ గాంధీ వద్ద ఆసక్తికర చర్చ జరిగింది. మినీ ఇండియాగా భావించే మల్కాజ్‌ గిరి పార్లమెంట్‌ పరిధిలోని అసెంబ్లీ స్థానాల్లో పార్టీ వెనుకబడి ఉన్నట్లు సర్వే నివేదికలు అందాయని..పూర్తి సమాచారంతోనే రేవంత్‌కు రాహుల్‌ ప్రశ్నలు సంధించారు.

ప్రభావం చూపే నేతలేరి?
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ప్రభావం చూపగల నేత పార్టీకి దూరం అయ్యారని.. అందరినీ కలుపుకు వెళ్లాలని రేవంత్‌కు రాహుల్‌ ఒకింత గట్టిగానే రేవంత్‌ను హెచ్చరించారని తెలుస్తోంది. పార్టీకి వ్యూహకర్తగా పని చేస్తున్న సునీల్‌ టీం కొడంగల్‌ నియోజకవర్గంలో పరిస్థితులపై ఇచ్చిన నివేదిక ఆధారంగా రాహుల్‌ ప్రశ్నించినట్లు సమాచారం. పార్టీని పటిష్టం చేయాలనే గుర్నాథ్‌రెడ్డిని పార్టీలోకి ఆహ్వానించినట్లు రాహుల్‌కి రేవంత్‌ వివరణ ఇచ్చారు. తెలంగాణలో పార్టీకి ప్రజల్లో ఆదరణ ఉందని చెప్పిన రాహుల్‌ గాంధీ.. నేతల్లో సమస్యలు ఉంటే చర్చలతో పరిష్కరించుకోవాలని సూచించారు.

రాహుల్‌ చేతిలో పూర్తి సమాచారం..
పార్టీలో సమస్యలు సృష్టిస్తే ఎవరినీ ఉపేక్షించేది లేదని రాహుల్‌ గట్టిగానే చెప్పినట్లు తెలుస్తోంది. అందరూ సమన్వయంతో సమష్టి నిర్ణయాలు తీసుకొని ఎన్నికల్లో అధికారం దక్కేలా పని చేయాలని సూచించారు. కేసీఆర్‌ హఠావో.. తెలంగాణ బచావో అనే నినాదంతో పార్టీ నేతలంతా పని చేయాలని స్పష్టం చేశారు. తెలంగాణలోని ప్రతీ నియోజకవర్గంపైన రాహుల్‌ వద్ద పూర్తి సమాచారం ఉన్నట్లు గుర్తించిన నేతలు అప్రమత్తం అయ్యారు.