PM Modi Gold Selling Appeal Truth: సోషల్ మీడియాలో ఒక వార్త తీవ్రంగా వైరల్ అవుతోంది. ప్రధాని నరేంద్ర మోదీ మహిళలను ప్రత్యేకంగా లక్ష్యం చేసుకుని మీ బంగారాన్ని అమ్మి, ఆ డబ్బును బ్యాంకుల్లో జమ చేయాలి అని విజ్ఞప్తి చేశారని ఆ వార్త చెబుతోంది. కానీ ఇది పూర్తిగా తప్పుడు సమాచారం. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) ఫ్యాక్ట్ చెక్ యూనిట్ స్పష్టంగా తెలిపింది. ప్రధాని మోదీ అలాంటి ఏ విజ్ఞప్తి చేయలేదు. ఇలాంటి అవాస్తవాలను నమ్మొద్దని ప్రజలకు సూచించింది.
నిజం ఏమిటి?
ప్రపంచ ఆర్థిక పరిస్థితులు ప్రస్తుతం సవాలుతో కూడుకుని ఉన్న నేపథ్యంలో, బంగారం కొనుగోళ్లను కొంతకాలం వాయిదా వేసుకోవాలినని మాత్రమే ప్రధాని సూచించారు. ఇప్పటికి ఉన్న బంగారాన్ని అమ్మాలని ఎక్కడా చెప్పలేదు. మహిళలను లేదా ఎవరినీ లక్ష్యం చేసుకుని అమ్మకాలు చేయమని కూడా అనలేదు. భారతదేశం బంగారం దిగుమతులపై ఆధారపడి ఉండడంతో విదేశీ మారక నిల్వలపై ఒత్తిడి పెరుగుతుందన్న ఆందోళనతో ఈ సూచన వచ్చింది. కానీ దీన్ని బంగారం అమ్మేయండి అని తప్పుగా చిత్రీకరించి ప్రచారం చేయడం జరిగింది.
ఫేక్ న్యూస్ వ్యాప్తి..
భారతీయ సమాజంలో బంగారం కేవలం ఆస్తి కాదు. ఇది భద్రత, సంప్రదాయం, పెళ్లి, పండుగలు, మహిళల ఆర్థిక స్వాతంత్య్రంతో ముడిపడి ఉంది. ఇలాంటి సెంటిమెంట్‌ను తాకే వార్తలు వైరల్ అయితే సులభంగా వ్యాప్తి చెందుతాయి. కొందరు సోషల్ మీడియా యూజర్లు మరియు వ్యతిరేక శక్తులు ఈ సున్నితమైన అంశాన్ని ఉపయోగించి గందరగోళం సృష్టించి, ప్రభుత్వం పై అపనమ్మకం కలిగించడానికి ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. ఇది సాధారణమైన తప్పుడు సమాచారం కంటే మరింత ప్రమాదకరం, ఎందుకంటే ఇది సామాన్యుల ఆర్థిక నిర్ణయాలను ప్రభావితం చేస్తుంది.
ప్రధాని మోదీ సూచన ఆర్థిక సంక్షోభ నిర్వహణకు సంబంధించినది. కానీ దాన్ని తప్పుగా అర్థం చేసుకుని భయపెట్టే వార్తలు వ్యాప్తి చేయడం దేశ ఆర్థిక వ్యవస్థపైనే ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఈ రకమైన ఫేక్ న్యూస్‌లు కేవలం అసత్యాలు మాత్రమే కాదు.. అవి ప్రజల మధ్య అపనమ్మకం, ఆందోళన, తప్పుడు ఆర్థిక నిర్ణయాలకు దారితీస్తాయి.
