Chandrababu Bail
Chandrababu Bail: సుదీర్ఘ విరామం తర్వాత చంద్రబాబుకు బెయిల్ లభించింది. స్కిల్ స్కాం లో సెప్టెంబర్ 9 అర్ధరాత్రి సమయంలో చంద్రబాబును అరెస్టు చేశారు. నంద్యాల నుంచి విజయవాడ రోడ్డు మార్గంలో తీసుకొచ్చి కోర్టులో హాజరు పరిచారు. ఏసీబీ కోర్టు న్యాయమూర్తి చంద్రబాబుకు రిమాండ్ విధించారు. అది మొదలు 52 రోజులపాటు పిటీషన్లు, విచారణలు, వాయిదాలు కొనసాగాయి. కేసుల నుంచి బయటపడేందుకు చంద్రబాబు చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. దీంతో ఇక చంద్రబాబు ఇప్పట్లో బయటకు వచ్చే ఛాన్స్ లేదని ప్రచారం జరిగింది. అయితే అనూహ్యంగా ఆయనకు బెయిల్ లభించింది. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ న్యాయస్థానం ఆయనకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.
అధినేత చంద్రబాబు బయటకు రావడంతో టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి. జైలు నుంచి బయటకు వచ్చిన చంద్రబాబుకు పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. అయితే ఈ విషయంలో అధికార వైసిపి, టిడిపి మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. రోగాన్ని అడ్డం పెట్టుకుని చంద్రబాబు బయటకు వచ్చారని వైసిపి ఆరోపిస్తుండగా.. న్యాయం గెలిచిందంటూ తెలుగు తమ్ముళ్లు చంకలు గుద్దుకుంటున్నారు.ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలు సంధించుకుంటున్నారు. సరిగ్గా ఇటువంటి సమయంలోనే జనసేన శ్రేణులు సరికొత్త వాదనను తెరపైకి తీసుకొచ్చారు. చంద్రబాబు అరెస్ట్ వెనుక జగన్ ఉంటే.. బెయిల్ రావడం వెనుక తమ నాయకుడు పవన్ కళ్యాణ్ ఉన్నాడని గుర్తు చేస్తున్నారు.దానిని సరికొత్తగా విశ్లేషిస్తున్నారు.
సరిగ్గా సీఎం జగన్ లండన్ పర్యటనలో ఉండగా.. చంద్రబాబు అరెస్టు అయ్యారు. తప్పు చేసిన చంద్రబాబుకు అరెస్టు తప్పదని ఒకసారి.. అసలు చంద్రబాబు అరెస్టుతో తనకు సంబంధం లేదని మరొకసారి… మరో ఆరు నెలల పాటు చంద్రబాబు జైల్లో ఉంటారని ఇంకోసారి.. ఇలా రకరకాల వ్యాఖ్యానాలు చేస్తూనే.. ఆయన అరెస్టు వెనుక తాను ఉన్నట్లు సీఎం జగన్ సంకేతాలు ఇచ్చారు.ఈ తరుణంలోనే పవన్ స్పందించారు. చంద్రబాబును పరామర్శించి వచ్చిన తర్వాత ఏకంగా పొత్తు ప్రకటించారు. చంద్రబాబు అరెస్ట్ అక్రమమని ఆరోపించారు. ఢిల్లీ వెళ్లి బిజెపి అగ్ర నేతలను కలిసి ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు. అందుకు తగ్గట్టుగానే ఇటీవల బిజెపి అగ్రనేత అమిత్ షా తో పవన్ భేటీ అయ్యారు.
అయితే పవన్ కలిసిన తరువాతే చంద్రబాబు బెయిల్ విషయంలో సానుకూలత వచ్చిందన్నది జనసైనికుల అభిప్రాయం. అందుకే సరికొత్త వాదనను అందుకున్నారు. జగన్ ఇంగ్లాండ్ లో ఉండి చంద్రబాబును అరెస్టు చేయిస్తే.. పవన్ ఇటలీలో ఉండి బెయిల్ ఇప్పించారని జనసైనికులు కౌంటర్ ఇస్తున్నారు. జగన్ దెబ్బకు పవన్ ఘాటుగానే రిప్లై ఇచ్చారని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. దీనిపై ఎలా స్పందించాలో తెలియక వైసిపి శ్రేణులు ఉక్కిరి బిక్కిరి అవుతున్నాయి.