Telangana Election Results 2023: గెలుపుకు ఎన్ని అవకాశాలుంటాయో.. ఓటమికి అంతకంటే ఎక్కువ కారణాలు ఉంటాయి. తెలంగాణ రాష్ట్రంలో రెండుసార్లు అధికారంలోకి వచ్చిన భారత రాష్ట్ర సమితి.. మూడవసారి అధికారంలో వస్తుందనుకుంటే చతికిల పడింది. ఇందుకు అనేక కారణాలు పైకి కనిపిస్తున్నప్పటికీ ప్రకృతి కూడా కారు పార్టీకి సహకరించలేదని అర్థమవుతున్నది. ఎందుకంటే ఎన్నికల ముంగిట కారు పార్టీకి అనేక అవంతరాలు ఎదురయ్యాయి. కీలక సమయంలో కాలేశ్వరం ఎత్తిపోతల పథకంలో లోపాలు కనిపించాయి. ప్రవళిక ఆత్మహత్య కూడా అధికార భారత రాష్ట్ర సమితి ఇబ్బందుల్లోకి నెట్టింది. ఇదే కాదు చంద్రబాబు అరెస్టుపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు గ్రేటర్ హైదరాబాద్ మినహా ఆంధ్రకు సరిహద్దున ఉండే ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పెను ప్రభావాన్ని చూపించాయి.
కలిసి రాని కాలం
కెసిఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి రాజీనామా చేసేంతవరకు ఒకటి అరా మినహాయిస్తే మిగతా అన్ని రోజులు కూడా వాతావరణం సహకరించింది. విస్తారంగా వర్షాలు కురిసాయి. పంటలు కూడా సమృద్ధిగా పండాయి. ప్రభుత్వం వారించినప్పటికీ రైతులు రికార్డు స్థాయిలో ధాన్యం పంటను పండించారు. అయితే ఈసారి మాత్రం భారత రాష్ట్ర సమితి పై ప్రకృతి పగబట్టింది. ముఖ్యంగా కీలకమైన ఎన్నికల సమయంలో పలు అంశాలు కారు పార్టీని ఇరుకున పెట్టాయి.. ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చెప్పుకున్న కాలేశ్వరం ఎత్తిపోతల పథకం లోపాల మయంగా మారింది. ఎన్నికలకు ముంగిట మేడిగడ్డ లో ఒక పిల్లర్ కుంగిపోయింది. ఫలితంగా మోటార్ల ద్వారా ఎత్తిపోసిన నీళ్లను దిగువకు విడుదల చేయాల్సి వచ్చింది.. కీలక సమయంలో అంటే గోదావరి ఎటువంటి వరదలు రాని కాలంలో మేడిగడ్డ లో ఒక పిల్లర్ కుంగిపోవడం అధికార పార్టీని ఇబ్బంది పెట్టింది. దీనికి తోడు అన్నారం బ్యారేజీలో లీకేజీలతో బుంగలు ఏర్పడ్డాయి. వీటిని పరిశీలించిన జాతీయ డ్యామ్ సేఫ్టీ అధారిటీ.. పలు కీలక విషయాలను వెల్లడించింది. మేదిగడ్డ, అన్నారం, సుందిళ్ళ సురక్షితం కావని తేల్చింది.. మూడు బ్యారేజీల డిజైన్లు ఒకేలా ఉండడంతో ఇవి ఏమాత్రం ఉపయోగపడవని పేర్కొంది.
కాలేశ్వరం ప్రస్తావన తీసుకురాలేదు
ఎప్పుడైతే కేంద్ర అధికారులు ఆ విధంగా తేల్చి చెప్పారో అప్పటినుంచి ఎన్నికల ప్రచారంలో భారత రాష్ట్ర సమితి నాయకులు కాలేశ్వరం గురించి ప్రస్తావించలేదు. ఇక పోటీ ప్రశ్నపత్రాల లీకేజీ కావడంతో.. ప్రభుత్వం వాటిని రద్దు చేసింది. ఫలితంగా ప్రవళిక అనే యువతి ఆత్మహత్య చేసుకుంది. అయితే నోటిఫికేషన్ రద్దుకు, ప్రవళిక ఆత్మహత్యకు సంబంధం లేదని భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఇది సహజంగానే నిరుద్యోగుల్లో ఆగ్రహాన్ని రేకెత్తించింది. ఉద్యోగాల భర్తీలో ప్రభుత్వ వైఫల్యాన్ని నిరసిస్తూ కొల్లాపూర్ లో స్వతంత్ర అభ్యర్థి శిరీష.. భారత రాష్ట్ర సమితి నాయకత్వాన్ని సవాల్ చేసింది. ఇది కూడా రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగుల్లో చర్చకు కారణమైంది. ఇక చంద్రబాబు నాయుడిని ఏపీ ప్రభుత్వం అరెస్టు చేయడం.. దానిపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి నల్లగొండ జిల్లా మీద ప్రభావం చూపించాయి. సహజంగానే ఇక్కడ కమ్మ సామాజిక వర్గం ఎక్కువగా ఉంటుంది.. దాంతో వారంతా ఓట్లు కాంగ్రెస్ పార్టీకి వేశారు. ఫలితంగా అక్కడ భారత రాష్ట్ర సమితి నాయకులు ఓటమి చెందారు. అయితే చంద్రబాబు అరెస్టుపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు దుమారానికి కారణమవడంతో.. నష్ట నివారణకు ఆయన ఎన్ని చర్యలు తీసుకున్నా ఉపయోగం లేకుండా పోయింది.