AP Cabinet Reshuffle: ఆంధ్రప్రదేశ్ లో మంత్రివర్గ విస్తరణపై జగన్ దృష్టి సారించారు. ఈ మేరకు కార్యాచరణ రూపొందించారు. మంత్రుల రాజీనామాలతో ముందుకు వెళ్లనున్నారు. ఇప్పటికే మంత్రివర్గంలో ఎవరెవరు ఉండాలో ఎవరు తప్పుకోవాలనే దానిపై స్పష్టత ఇవ్వడంతో మంత్రులు కూడా ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న జగన్ తిరిగొచ్చిన వెంటనే ఈనెల 7న మంత్రులతో రాజీనామా చేయించాలని చూస్తున్నారు. తరువాత గవర్నర్ తో సమావేశమై కొత్త మంత్రివర్గంపై చర్చించనున్నట్లు తెలుస్తోంది.
రాజకీయ విషయాలపై ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలుస్తున్నారు. నిర్మలా సీతారామన్, గజేంద్ర సింగ్ షెకావత్, హోం మంత్రి అమిత్ షాలతో భేటీ అవుతున్నారు. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఆయన కేంద్రంలో అందరిని కలుస్తూ రాష్ట్రానికి రావాల్సిన సాయంపై చర్చిస్తున్నారు. 8న గవర్నర్ హరిచందన్ భూషణ్ తో ప్రత్యేకంగా జరిగే భేటీలో కొత్త మంత్రివర్గ కూర్పుపై నిర్ణయించనున్నట్లు తెలుస్తోంది.
Also Read: Secret Of KCR Delhi Tour: కేసీఆర్ ఢిల్లీ టూర్ సీక్రెట్ ఇదే.. ఆ నిరసనకు వెళ్లడం డౌటే..?
ఈనెల 11న కొత్త మంత్రివర్గం కొలువుదీరే విధంగా కార్యాచరణ ఇప్పటికే రూపొందించారు. జిల్లాల పునర్విభజన తరువాత మంత్రివర్గంపైనే దృష్టి సారించారు. దీంతో ఆశావహులు సైతం జగన్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. కొద్ది రోజులుగా మంత్రివర్గ విస్తరణపై ముమ్మరంగా ప్రచారం సాగుతున్న నేపథ్యంలో దానిపై స్పష్టత ఇవ్వనున్నట్లు సమాచారం. రాబోయే రోజుల్లో ఎన్నికల్లో గెలిచే వారికే పదవులు దక్కేలా నిర్ణయం తీసుకున్నారని చెబుతున్నారు.
పదవుల నుంచి తొలగిపోయే వారు రేపు రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. తమ పదవులకు రాజీనామా చేసి అధినేత నిర్ణయాన్ని వారు గౌరవించనున్నారు. తమకు ఏ పదవి ఇచ్చినా సరే నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటిస్తున్నారు. ఈ క్రమంలో మంత్రివర్గ విస్తరణ ఓ కొలిక్కి వచ్చే అవకాశం కనిపిస్తోంది. రాజకీయంగా కొత్త మంత్రివర్గం బలంగా ఉండేందుకు జగన్ అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు సమాచారం.