Chandrababu- Prashant Kishore
Chandrababu- Prashant Kishore: ఏపీలో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో గెలుపొందడానికి అన్ని పార్టీలు కృషి చేస్తున్నాయి. ప్రత్యేక వ్యూహాలు రూపొందించుకుంటున్నాయి. వ్యూహకర్తలను సైతం నియమించుకున్నాయి. వారి ద్వారా ప్రజల్లోకి వెళ్లేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. ఈ తరుణంలో ఆసక్తికరమైన వార్త ఒకటి వెలుగులోకి వచ్చింది. గత ఎన్నికల్లో టిడిపిని గద్దె దించేందుకు ప్రయత్నించిన ప్రశాంత్ కిషోర్కు చంద్రబాబు టచ్ లోకి వెళ్లినట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. దీనికి బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మధ్యవర్తిత్వం వహించినట్లు టాక్ నడుస్తోంది. ఇదే విషయమై ఓ జాతీయ పత్రిక ఆసక్తికర కథనాన్ని ప్రచురించింది.
వచ్చే ఎన్నికల్లో టఫ్ ఫైట్ ఖాయం. చంద్రబాబుకు ఎన్నికలు చావో రేవో లాంటివి. అందుకే ఆయన సర్వశక్తులు ఒడ్డుతున్నారు. బలమైన అధికార పక్షాన్ని ఢీ కొట్టాలంటే పొత్తులు అనివార్యం అని భావిస్తున్నారు.జనసేన, టిడిపి తో కలిసి వెళ్లాలన్న ప్రయత్నాల్లో ఉన్నారు. కానీ బిజెపి వైసిపి తో స్నేహం కొనసాగించడం చంద్రబాబుకు మింగుడు పడడం లేదు. అందుకే ఎన్డీఏలో చేరేందుకు తర్జనభర్జన పడుతున్నారు.అటు జాతీయస్థాయిలో ఎన్డీఏ వ్యతిరేకంగా ఇండియా కూటమి రూపుదిద్దుకున్న సంగతి తెలిసిందే. ఇందులో మమతా బెనర్జీ కీలక పాత్ర పోషిస్తున్నారు. విపక్ష కూటమిలోకి చంద్రబాబును తీసుకెళ్లాలన్న ప్రయత్నంలో ఆమె ఉన్నట్లు తెలుస్తోంది.అయితే ముందుగా ఏపీలో చంద్రబాబును గెలిపిస్తే విపక్ష కూటమికి లాభిస్తుందని భావిస్తున్నట్లు సమాచారం.
మమతా బెనర్జీకి, ప్రశాంత్ కిషోర్ కు మంచి సంబంధాలు ఉన్నాయి. 2021 బెంగాల్ ఎన్నికల్లో మమతా పార్టీకి ప్రశాంత్ కిషోర్ వ్యూహ కర్తగా పనిచేశారు. ఆ ఎన్నికల్లో మమతా బెనర్జీకి అద్భుత విజయాన్ని అందించగలిగారు. గత ఎన్నికల్లో జగన్కు సైతం ప్రశాంత్ కిషోర్ పని చేశారు. ప్రస్తుతం వ్యూహకర్త బాధ్యతల నుంచి తప్పుకుని రాజకీయాలు చేస్తున్నారు. బిజెపికి వ్యతిరేకంగా ఉన్నారు. ఈ తరుణంలో చంద్రబాబు ప్రశాంత్ కిషోర్ ను కలిసినట్లు వార్తలు వస్తున్నాయి. గతంలో నారా లోకేష్ సైతం టీఎంసీ యువనేత అభిషేక్ బెనర్జీతో కలిసి ప్రశాంత్ కిషోర్ ను కలిసినట్లు టాక్ నడిచింది.
ప్రస్తుతం వైసీపీకి రుషిరాజ్, టిడిపికి రాబిన్ శర్మ వ్యూహకర్తలుగా వ్యవహరిస్తున్నారు. వీరిద్దరూ ప్రశాంత్ కిషోర్ టీంలో పని చేసిన వారే. గత ఎన్నికల్లో జగన్కు సేవలు అందించిన పీకే వ్యూహకర్త బాధ్యతలు నుంచి తప్పుకున్నారు. కానీ జగన్ తో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నారు. ఇటీవల జగన్కు ప్రత్యేకంగా కలిసిన సందర్భాలు ఉన్నాయి. ఇటువంటి తరుణంలో చంద్రబాబు ప్రశాంత్ కిషోర్ ను కలిశారంటే అందులో ఎంత వాస్తవం ఉందో చూడాలి. తాజాగా జరుగుతున్న ఈ పరిణామాలన్నింటినీ భారతీయ జనతా పార్టీ నిశితంగా పరిశీలిస్తోంది.