Chandrababu: బిజెపికి టిడిపి కటీఫ్ చెబుతుందా? అగ్ర నేతలు గొంతెమ్మ కోరికలు కోరారా? అందుకే చంద్రబాబు దూరం జరిగారా? ఏపీలో కొత్త కూటమికి ప్రయత్నాలు జరుగుతున్నాయా? అందుకే వామపక్ష నాయకులు, పవన్ తో కలిసి చంద్రబాబు వేదిక పంచుకున్నారా? బిజెపి హై కమాండ్ కు సంకేతాలు పంపారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు ఈ అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయి. ఢిల్లీ సైలెంట్, చంద్రబాబు పావులు కదుపుతున్న తీరుతో ఇవన్నీ నిజమేనని తేలుతోంది.
చంద్రబాబు ఢిల్లీ వెళ్లి బిజెపి అగ్ర నేతలతో సమావేశం అయ్యారు. పొత్తులపై కీలక చర్చలు జరిపారు. అటు బిజెపి నేతలు సైతం తమ ప్రతిపాదనలను చంద్రబాబు ముందు ఉంచారు. కానీ చంద్రబాబు వెనుతిరి గారు. ఇది జరిగి పది రోజులు అవుతున్నా చంద్రబాబు నోరు తెరవడం లేదు. అలాగని బిజెపి పెద్దలు మాట్లాడటం లేదు. దీంతో బిజెపి ప్రతిపాదనలకు చంద్రబాబు మొగ్గు చూపడం లేదని తేలుతోంది. టిడిపి ఇవ్వలేని సీట్లు, పవర్ షేరింగ్ విషయంలోనే చంద్రబాబు వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. అటు బిజెపి హై కమాండ్ నుంచి సైతం పొత్తులపై ఎటువంటి ప్రకటన రాకపోవడం విశేషం.
నిన్న జరిగిన ఓ కార్యక్రమంలో పవన్ తో పాటు వామపక్ష నేతలతో చంద్రబాబు పాల్గొన్నారు. ఓ జర్నలిస్టు రాసిన విధ్వంసం అనే పుస్తకావిష్కరణకు హాజరయ్యారు. అయితే ఇప్పటికే బీజేపీతో పొత్తుల చర్చలు జరిపిన నేపథ్యంలో ఈ నాయకులంతా ఒకే వేదిక పైకి రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఏపీలో కొత్త సమీకరణలకు ఈ కార్యక్రమం మార్గం చూపింది. బిజెపి ఆచరణ సాధ్యం కాని అంశాలను ప్రస్తావించడం వల్లే.. పొత్తులో సింహభాగం ప్రయోజనాలు కోరుకున్నందు వల్లే చంద్రబాబు వెనక్కి తగ్గినట్లు ప్రచారం జరుగుతోంది. కానీ ఎక్కడా టిడిపి అధినేత బయటపడటం లేదు. గుంభనంగా వ్యవహరిస్తున్నారు.
ఈనెల 17, 18 తేదీల్లో భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరగనున్నాయి. దేశవ్యాప్తంగా 11,500 మంది ప్రతినిధులకు ఆహ్వానం అందించారు. ఈ సమావేశాల వేదికగా ప్రధాని మోదీ పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేయనున్నారు. అంటే ఈ రెండు రోజులపాటు పొత్తుల నిర్ణయాలు వచ్చే అవకాశం లేదు. అయితే చంద్రబాబు బిజెపి అగ్ర నేతలను కలిసి దాదాపు పది రోజులు దాటుతోంది. అయినా సరే బిజెపి నుంచి ఉలుకూ పలుకూ లేదు.బిజెపి నేతలు చెప్పాల్సింది చెప్పారని.. ఇక నిర్ణయం తీసుకోవాల్సిందే చంద్రబాబేనని తెలుస్తోంది. అందుకే వామపక్షాల నేతలతో కలిసి కూటమి కట్టాలని చంద్రబాబు ఆలోచన చేస్తున్నట్లు ఒక ప్రచారం జరుగుతోంది. కీలకమైన పొత్తుల సమయంలో వామపక్ష నేతలతో కలిసి వేదిక పంచుకోవడం బిజెపికి సంకేతం పంపించేందుకేనని విశ్లేషణలు వస్తున్నాయి. బిజెపి ఏదైనా నిర్ణయం ప్రకటించాలంటే మరో రెండు రోజుల తరువాతేనని ఆ పార్టీ రాష్ట్ర వర్గాలు చెబుతున్నాయి. ఈ లెక్కన జాతీయ కార్యవర్గ సమావేశాల తర్వాత బిజెపి ఒక స్పష్టమైన ప్రకటన చేసే అవకాశం కనిపిస్తోంది