Telangana Lady IAS : ఆమె ఓ ఐఏఎస్ అధికారి.. రాష్ట్రంలో కీలకశాఖలో పనిచేస్తున్నారు. అత్యంత భద్రత ఉన్న ఇంట్లో నివాసం ఉంటున్నారు. చీమ చిటుక్కుమన్నా కనిపెట్టేంత నిఘా ఉంది. అయినా ఓ డిప్యూటీ తహసీల్దార్ నిఘా కళ్లుగప్పి అర్ధరాత్రి ఆ ఇంట్లో చొరబడ్డాడు. నానా హంగామా సృష్టించాడు. తన ఉద్యోగం గురించి మాట్లాడాలంటూ సదరు ఐఏఎస్‌ను భయభ్రాంతులకు గురిచేశాడు. ఈ ఘటన హైదరాబాద్‌లో తీవ్ర కలకలం రేపింది.

అతడి రాకను పసిగట్టి..
ఆ మహిళా ఐఏఎస్ అధికారి అర్ధరాత్రి ఇంట్లోకి అపరిచిత వ్యక్తి రాకను ముందే పసిగట్టింది. గట్టిగా కేకలు వేయటంతో భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. అతడిని అదుపులోకి తీసుకుని విచారణ చేశారు. సదరు వ్యక్తి డిప్యూటీ తహసీల్దార్ అని గుర్తించారు. అనంతరం జూబ్లీహిల్స్ పోలీసులకు అప్పగించగా.. వారు రిమాండ్‌కు తరలించారు. రెండు రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
గేటెడ్ కమ్యూనిటీలో నివాసం..
తెలంగాణ ప్రభుత్వంలో ఉన్నత స్థానంలో పని చేస్తున్న సదరు ఐఏఎస్ అధికారి హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని ఓ గేటెడ్ కమ్యూనిటీలో నివాసం ఉంటున్నారు. సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే ఆమె.. తరచూ పలు అంశాలపై ట్వీట్టర్‌లో ట్వీట్లు చేస్తుంటారు. తన ఫొటోలను షేర్‌చేస్తుంటారు. ఆమె ట్వీట్లకు మేడ్చల్ జిల్లాకు చెందిన డిప్యూటీ తహసీల్దార్ ఆనంద్‌కుమార్‌రెడ్డి అనే ఒకట్రెండు సార్లు రిట్వీట్లు చేశాడు. ఈ క్రమంలో ఆమెతో తన ఉద్యోగం విషయమై పరిచయం పెంచుకోవాలని భావించాడు.
అర్ధరాత్రి 11:30 గంటలకు నేరుగా ఇంటికి..
రెండు రోజుల క్రితం అర్ధరాత్రి 11.30 గంటల సమయంలో సదరు డిప్యూటీ తహసీల్దార్ మహిళా ఐఏఎస్ అధికారి ఉంటున్న గేటెడ్ కమ్యూనిటీకి తన స్నేహితుడితో కలిసి కారులో వెళ్లాడు. తన హోదా చెప్పడంతోపాటు తాను ఫలనా ఇంటికి వెళ్లాలని ఎలాంటి భయం బెరుకు లేకుండా చెప్పటంతో అనుమానించని సెక్యూరిటీ అతడిని లోపలికి పంపించారు. నేరుగా ఐఏఎస్ ఇంటికి చేరుకున్న ఆనంద్ కుమార్‌రెడ్డి తన స్నేహితుడిన కారులోనే కూర్చోబెట్టి ఇంటి కాలింగ్ బెల్ కొట్టాడు. అర్ధరాత్రి ఎవరు కాలింగ్ బెల్ కొట్టారని సంశయిస్తూనే సదరు మహిళా ఐఏఎస్ తలుపు తెరిచారు. ఎదురుగా గుర్తు తెలియని వ్యక్తి ఉండటంతో ఖంగుతున్నారు.
ఆందోళనలోనూ ప్రశ్నల వర్షం..
అపరిచితుడి రాకతో ఆందోళనగా ఉన్న సదరు ఐఏఎస్.. ధైర్యం చేసి మీరు ఎవరు? ఈ టైంలో ఇక్కడికి ఎందుకు వచ్చారు? మిమ్మల్ని లోపలికి ఎవరు పంపించారు? అంటూ అతడ్ని ప్రశ్నించారు. తాను డిప్యూటీ తహసీల్దార్‌ని అని తన ఉద్యోగం గురించి మాట్లాడేందుకు వచ్చానని చెప్పటంతో ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. అతడి వ్యవహారశైలి అనుమానస్పదంగా ఉండటంతో గట్టిగా కేకలు వేశారు.
అదుపులోకి తీసుకున్న భద్రతా సిబ్బంది..
అధికారి కేకలు విన్న భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. వెంటనే చేరుకుని డిప్యూటీ తహసీల్దార్‌ను అదుపులోకి తీసుకున్నారు. వెంట వచ్చిన స్నేహితుడితోపాటు కారును జూబ్లీహిల్స్ పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆనంద్‌కుమార్‌రెడ్డిని రిమాండ్‌కు తరలించారు. ఉద్యోగం విషయం గురించి మాట్లాడాల్సి ఉంటే కార్యాలయానికి వెళ్లకుండా అర్ధరాత్రి మహిళా ఐఏఎస్ ఇంటికి వెళ్లటం అనుమానాలకు తావిస్తోంది. సదరు అధికారి భద్రతా సిబ్బంది వైఫల్యంపైనా అనుమానాలు వ్యక్తమువున్నాయి. సదరు అధికారి ఇంటికి అర్ధరాత్రి కూడా అధికారులు వస్తుంటారా.. మరీ డిప్యూటీ తహసీల్దార్ స్థాయి అధికారులు వస్తుంటారా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకోకపోవడానికి కారణం అదేలా అన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఘటన విషయమే రెండు రోజుల తర్వాత బయటకు రాగా, అధికారులు విచారణ అంశాలు బయటకు వస్తాయా అన్న సందేహాలు తలెత్తుతున్నాయి.
చాకచక్యంగా నన్ను నేను రక్షించుకున్నానన్న ఐఏఎస్
తన ఇంట్లోకి ఓ అధికారి చొరబాటు ఘటనపై ఐఏఎస్ అధికారి స్పందించారు. ‘‘అర్ధరాత్రి బాధాకరమైన అనుభవం ఎదురైంది. ఓ వ్యక్తి నా ఇంట్లోకి అక్రమంగా చొరబడ్డాడు. ధైర్యం, చాకచక్యంతో నన్ను నేను రక్షించుకోగలిగాను. ఎంత భద్రత ఉన్నా.. మనల్ని మనం కాపాడుకునేలా ఉండాలి. రాత్రివేళ తలుపులు, తాళాలను స్వయంగా పరిశీలించుకోవాలి. అత్యవసర స్థితిలో డయల్ 100కు ఫోన్ చేయాలి’’ అని ట్వీట్ చేశారు.