తిరుపతిలో ప్రజాస్వామ్యం అపహాస్యం అయ్యిందని బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోమూ వీర్రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ అధికార దుర్వినియోగానికి పాల్పడిందని విమర్శించారు. వాలంటీర్లతో ఓటర్లను, బూత్ ఎజెంట్స్ తో మా ఎజెంట్స్ ను బెదిరించారని ఆరోపించారు.
తిరుపతి ఉప ఎన్నికల్లో వైసీపీ అక్రమాలకు పాల్పడిందని.. 60 శాతం పోలింగ్ లో దొంగ ఓట్లు శాతం అధికంగా ఉన్నాయని.. జగన్ ప్రభుత్వమే దీనికి సహకరించిందని సోము వీర్రాజు విమర్శించారు. పట్టపగలు దొంగ ఓట్లు వేశారని ఆరోపించారు.
అభివృద్ధితోనే గెలుస్తున్నామంటున్న ఏపీ మంత్రులు.. నిజంగా వారి అభివృద్ధి ఉప ఎన్నికల్లో గెలిపిస్తే.. ఎమ్మెల్యేలు, మంత్రులు,కార్పొరేషన్ చైర్మన్లు ఎందుకు తిరుపతిలో మకాం వేశారని సోము వీర్రాజు ప్రశ్నించారు. ఉప ఎన్నికల్లో పోటీ చేయడానికి బీజేపీ ధైర్యంగా ముందుకు వచ్చిందని అన్నారు..
మంత్రి రామచంద్రరెడ్డి, ఏపీ ప్రభుత్వ సలహాదారు రామకృష్ణ రెడ్డి ఇరువురు రాముడి పేర్లు పెట్టుకుని ఉప ఎన్నికల్లో కుట్రలకు పాల్పడ్డారని సోము వీర్రాజు విమర్శించారు. ఎర్ర చందనం దుంగలు పెట్టి కేసులు పెడుతున్నారు పోలీసులకు ఏమి రోగం వచ్చిందని ప్రశ్నించారు.
దొంగ ఓట్లు వేస్తున్నారని ,కుట్ర జరిగిందని ఎస్పీకి ఫిర్యాదు చేసినా స్పందించలేదని సోము వీర్రాజు విమర్శించారు. ఎన్నికల కోడ్ అమలులో ఉంటే తిరుపతిలో రామచంద్ర రెడ్డి ప్రెస్ మీట్ ఎలా పెడతారని ప్రశ్నించారు.. ఇది ఎన్నికల కోడ్ ఉల్లంఘన కాదా అని ఆయన నిలదీశారు.
పోలీసు వ్యవస్థ ఎన్నికల విషయంలో ఏకపక్షంగా వ్యవహరించిందని సోము వీర్రాజు విమర్శించారు.. కేంద్ర ఎన్నికల సంఘం బీజేపీది కాదని.. దాన్ని కూడా వైసీపీ సర్కార్ తప్పుదోవ పట్టించిందని అన్నారు. ఏపీ పోలీసులు దద్దమ్మలుగా మారారని.. అక్రమాలు జరుగుతుంటే చోద్యం చూసారని విమర్శించారు.
ఉప ఎన్నికల్లో అక్రమాలపై సీఎం జగన్ తక్షణమే క్షమాపణ చెప్పాలని.. రీ పోలింగ్ జరపాలని సోము వీర్రాజు డిమాండ్ చేశారు. సర్వ దర్శనం రద్దయితే తిరుపతి దర్శనానికి భక్తుల పేరిట వచ్చి దొంగ ఓట్లు వేశారని ఆరోపించారు. దర్శనం బంద్ అయితే ఎలా వస్తారని.. దేవుడి పేర్లు పెట్టుకుని ఆ దేవుని పై అబద్దాలు చెప్పడం సహేతుకమా అని సోము వీర్రాజు నిలదీశారు.
కార్పొరేషన్ ఎన్నికల్లోనూ దొంగ ఓట్లను రెడీ చేసి వైసీపీ గెలిచిందని సోము వీర్రాజు ఆరోపించారు. ఉప ఎన్నికపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తున్నామని తెలిపారు. హిందుత్వంపై డీజీపీకి, సీఎంకు గౌరవం లేదన్నారు.
విగ్రహాల ధ్వంసం కేసులో బీజేపీ నేతలు ఉన్నారని చెప్పారని.. నిరూపించాలని డీజీపీని అడిగితే ఇప్పటికి సమాధానం చెప్పలేకపోయారని సోము వీర్రాజు అన్నారు.. అక్రమాలకు పాల్పడితేనే చంద్రబాబుకు 23 సీట్లు వచ్చాయని.. రాబోయే ఎన్నికల్లో వైసీపీకి కూడా 30 సీట్లు కూడా రావని స్పష్టం చేశారు. .
రాబోయే ఎన్నికల్లో వాలంటీర్ వ్యవస్థకు ప్రత్యామ్నాయంగా బీజేపీ కొత్త మెకానిజం క్రియేట్ చేస్తుందని సోము వీర్రాజు తెలిపారు. ఉప ఎన్నికల్లో బీజేపీ
టీడీపీ,వైసీపీ లకు ధీటుగా పోటీ పడిందని అన్నారు. టీడీపీ, వైసీపీ రెండు ఒక్కటేనన్నారు. 2024లో జనసేన, బీజేపీ కూటమి అధికారాన్ని చేపట్టబోతుందని స్పష్టం చేశారు.
జనసేన ఎన్నికల గుర్తు అయిన గాజు గ్లాస్ గుర్తును ఇండిపెండెంట్ అభ్యర్థికి ఇచ్చేలా చేసింది వైసీపీ ప్రభుత్వ కుట్రలో భాగమేనని.. దీనిపై ఈసీ వద్దే తేల్చుకుంటామని సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు.