MLC Kavitha- CBI: తెలంగాణలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దర్యాప్తు సంస్థలతో కొనసాగిస్తున్న యుద్ధంలో కేంద్ర సీబీఐ కల్వకుంట్ల ఇంటి తలుపును తట్టింది. ‘‘ఎవడొస్తడో రానియ్.. వచ్చేటోడు నాకే చాయ్ తాగిపిచ్చి పోవాలే’’ అని ప్రకటించిన తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తర్వాత ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కవిత పేరు బయటకు రాగానే సీబీఐ తెలంగాణలోకి రాకుండా రహస్యంగా జీవో 51 జారీ చేశారు. నెల తర్వాత ఇది బయటకు వచ్చింది. కానీ, ఏ సీబీఐ అయితే తన వరకూ వస్తుందని భావించి రాకుండా నిషేధించారో.. ఇపుపడు అదే సంస్థ.. కల్వకుంట్ల ఇంటి తలుపునే తట్టింది. ‘‘ నీ ఇంటికి వచ్చా.. నీ నట్టింటికి వచ్చా.. రారా చూసుకుందాం’’ అని ఓ సినిమాలో బాలకృష్ణ చెప్పినట్లుగా.. ప్రస్తుతం తలుపు మాత్రమే తట్టిన సీబీఐ మరో మూడు రోజుల్లో కల్వకుంట్ల నట్టింటికి రాబోతోంది. ఇది కేసీఆర్ కలలో కూడా ఊహించి ఉండరు. ఇన్నాళ్లూ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ వస్తున్న కల్వకుంట్ల కుటుంబం ఇప్పుడు అంతర్మథనంలో పడింది.

కవిత ఇంట్లో విచారణ..
ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఇప్పుడు కల్వకుంట్ల కవిత పేరు బహిరంగ రహస్యం. ఇన్నాళ్లూ బీజేపీ నాయకుల ఆరోపణల్లో మాత్రమే ఉన్న కవితకు ఇప్పుడు సీబీఐ నోటీసులు కూడా ఇచ్చింది. అరెస్టు చేసిన నిందితుడి రిమాండ్ రిపోర్టులో తన పేరు రావడంతోనే.. దీనిని రాజకీయ కుట్రగా అభివర్ణిస్తూ విరుచుకు పడిన కల్వకుంట్ల కవితకు 48 గంటల్లోపే సీబీఐ షాక్ ఇచ్చింది. దీంతో చేసేది లేక.. వారి నోటీసులకు స్పందించారు. తన సంసిద్ధతను కూడా తెలియజేశారు. ఈమేరకు తన ఇంట్లోనే ఈనెల 6న విచారణకు హాజరవుతానని సీబీఐకి సమాచారం ఇచ్చారు. సరిగ్గా ఈ పాయింట్ దగ్గరే కల్వకుంట్ల కవిత పాజిటివ్ ఇమేజ్ సృష్టించుకునే ప్రయత్నం చేస్తున్నారు.
బీజేపీని కొట్టాలనుకుని..
తెలంగాణలోని కేసీఆర్ సర్కారు, అన్ని విధాలుగానూ కేంద్రంలోని మోదీ సర్కారుతో ఢీకొంటోంది. పరస్పర ఆరోపణలు చేసుకోవడం మాత్రమే కాదు, కేసుల జోరు చూస్తే కూడా ఎవరికైనా అలాగే అనిపిస్తుంది. ఎమ్మెల్యేలకు ఎర అనే కేసులో బీజేపీ జుట్టు కేసీఆర్ చేతికి చిక్కింది.. అని జనం అనుకుంటున్నారు. అదే సమయంలో ఢిల్లీ మద్యం కుంభకోణంలో కేసీఆర్ తనయ కల్వకుంట్ల కవిత ఉండడం బీజేపీకి అస్త్రంగా మారింది. బీజేపీని కొట్టాలనుకున్న కేసీఆర్ ఇప్పుడు తానే డిఫెన్స్‌లో పడాల్సిన పరిస్థితి వచ్చింది.
బీఎల్ సంతోష్‌కు నోటీసులు ఇవ్వడం ద్వారా..
టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కొనుగోలు వ్యవహారంతో బీజేపీని ఇరుకున పెట్టడంతోపాటు జాతీయ స్థాయిలో ఆ పార్టీని డ్యామేజ్ చేయాలని చూశారు. ఈమేరకు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పేరును తెరపైకి తెచ్చి తన ద్యాప్తు సంస్థ సిట్ ద్వారా నోటీసులు కూడా జారీ చేయించి పైచేయి సాధించినట్లు సంతోషపడ్డారు. దీనిపై సంతోష్ విచారణకు రాకుండా కోర్టును ఆశ్రయించి స్టే తెచ్చుకున్నారు. ఇంతలో కేంద్రం లిక్కర్ స్కాం దర్యాప్తు వేగవంతం చేసింది. ఈ క్రమంలో అమిత్‌అరోరా రిమాండ్ రిపోర్టులో కేసీఆర్ కూతురు కవిత పేరు పేర్కొంది. ఆ వెంటనే సీబీఐతో నోటీసులు ఇచ్చి.. గుక్క తిప్పుకోకుండా చేసింది.

6న హైడ్రామా..
ఇక సీబీఐ విచారణకు ఈనెల 6న హాజరవుతానని ప్రకటించిన కవిత తన ఇంట్లోనే విచారణ చేయాలని సీబీఐ కోరింది. దీంతో హైదరాబాదులో కవిత ఇంట్లో ఆమెను సీబీఐ విచారించడం అంటే.. ఆరోజున చాలా పెద్ద పొలిటికల్ మైలేజీ హైడ్రామా ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కవితను విచారించే సీబీఐ తర్వాతి స్టెప్ ఎలా ఉంటుందో గానీ.. ఆమె ఇంట్లో ప్రెస్ మీట్ పెడితేనే వందల సంఖ్యలో అక్కడకు తరలివచ్చి హడావుడి చేసే గులాబీ దళాలు.. ఆమెను విచారించడానికి సీబీఐ అక్కడకు వచ్చే సందర్భంలో వేల సంఖ్యలో గుమికూడి.. హైప్ క్రియేట్ చేసే అవకాశం చాలా ఉంది.
రంగంలోకి సీఆర్పీఎఫ్?
హైదరాబాద్‌లో తన సొంత ఇంట్లో విచారణకు వస్తానన్న కవిత విన్నపంపై సీబీఐ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీనిపై సోమవారం ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. ప్రకటన చేయకుంటే భద్రతా కారణాల దృష్ట్యా సీఆర్పీఎఫ్ బలగాలను రంగంలోకి దింపనున్నట్లు తెలిసింది. కవిత స్థానిక అధికార పార్టీ ఎమ్మెల్సీ కావడం, ముఖ్యమంత్రి కూతురు కావడంతో విచారణ సమయంలో సీబీఐని అడ్డుకునేందుకు టీఆర్‌ఎస్ ప్రయత్నించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కేంద్ర బలగాలను రంగంలోకి దింపుతుందని తెలుస్తోంది. మల్లారెడ్డి ఆస్తులపై ఐటీ దాడుల సమయంలోనూ స్థానిక పోలీసులను కాదని కేంద్ర బలగాలతో భద్రత ఏర్పాటు చేయించిన విషయం తెలిసిందే. కవిత విషయంలోనూ అదే జరుగొచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.