ఏపీలో జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చిన రోజు నుంచి ప్రభుత్వ నిర్ణయాలకు హైకోర్టులో అనుకూలంగా వచ్చిన తీర్పుల సంఖ్య సింగిల్ డిజిట్ లో ఉంటే, ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా వచ్చిన తీర్పుల సంఖ్య వంద కంటే ఎక్కువగా ఉంది. ప్రభుత్వం తీసుకున్న అనేక నిర్ణయాలకు హైకోర్టు మొట్టికాయలు వేయడంతో ప్రజల్లో సైతం ప్రభుత్వ నిర్ణయాలపై సందేహాలు ఏర్పడ్డాయి.
దీంతో పలువురు వైసీపీ నేతలు న్యాయవ్యవస్థపై, పలువురు న్యాయమూర్తులపై తీవ్ర ఆరోపణలు చేశారు. సోషల్ మీడియాలో న్యాయవ్యవస్థను కించపరిచేలా పలువురు పోస్టులు పెట్టారు. ఆ పోస్టులపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు ఆ పోస్టులకు సంబంధించిన కేసును సీబీఐ అప్పగించింది. అంతకు ముందే జగన్ సర్కార్ పలువురు న్యాయమూర్తులపై ఆరోపణలు చేస్తూ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి బాబ్డేకు లేఖ రాశారు.
అయితే జగన్ సర్కార్ ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాయడంపై ఢిల్లీ బార్ అసోసియేషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు సీఎం జగన్ కు షాక్ ఇచ్చింది. జగన్ న్యాయవ్యవస్థను బెదిరించే ప్రయత్నం చేస్తున్నాడని.. జగన్ చేస్తున్న ఆరోపణల్లో హేతుబద్ధత లేదని సంచలన వ్యాఖ్యలు చేసింది. జగన్ లేఖ రాయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ బార్ అసోసియేషన్ నేడు తీర్మానం చేసింది.
జగన్ ప్రధాన న్యాయమూర్తికి రాసిన లేఖ కోర్టు ధిక్కారం కిందికి వస్తుందని బార్ అసోసియేషన్ అభిప్రాయపడింది. జగన్ రాజ్యాంగ వ్యవస్థలపై దాడి చేయడం దురదృష్టకరమని.. ప్రజల్లో న్యాయవ్యవస్థపై నమ్మకం పోగొట్టే విధంగా జగన్ లేఖ ఉందని అభిప్రాయపడింది. న్యాయవ్యవస్థ స్వయం ప్రతిపత్తిపై దాడి చేసే విధంగా జగన్ చర్యలు ఉన్నాయని పేర్కొంది. ప్రజలకు ప్రధాన న్యాయమూర్తికి రాసిన లేఖను బహిరంగపరచడం నీతి మాలిన చర్యగా బార్ అసోసియేషన్ అభిప్రాయపడింది.