Delhi Election Results 2025 : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆశ్చర్యకరంగా ఉండవచ్చు. ఈ ట్రెండ్స్‌లో బీజేపీ ముందంజలో ఉంది. ఎన్నికల సంఘం ప్రకారం 9 గంటల వరకు బిజెపి 7 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఆప్ రెండు స్థానాల్లో ముందంజలో ఉంది. ఇప్పటివరకు ఎన్నికల సంఘం తొమ్మిది సీట్ల ట్రెండ్‌లను ఇచ్చింది. ఈ గణాంకాలలో గమనించదగ్గ విషయం ఏమిటంటే బిజెపికి 53.77 శాతం ఓట్లు, ఆప్ కు 40.97 శాతం ఓట్లు వచ్చాయి. రెండింటి మధ్య అంతరం దాదాపు 13 శాతం. ఈ వ్యత్యాసం ఇలాగే కొనసాగితే ఆప్ కు పెద్ద షాక్ ఎదురుకావచ్చు.
2020 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి 38.51 శాతం ఓట్లు వచ్చాయి. కాగా, ఆప్ కు 53.57 శాతం ఓట్లు వచ్చాయి. 2020 ఎన్నికల్లో బీజేపీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. దానికి కేవలం 8 సీట్లు మాత్రమే వచ్చాయి. అయితే ఆప్ 62 సీట్లు గెలుచుకుంది. 2015లో బీజేపీ కేవలం మూడు స్థానాలను మాత్రమే గెలుచుకుంది. ఆ సమయంలో ఆప్ 67 సీట్లు సాధించింది.
బీజేపీ 7 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.
1. కిరారి – బజరంగ్ శుక్లా
2. త్రి నగర్- తిలక్ రామ్ గుప్తా
3. సంగం విహార్-చందన్ కుమార్ చౌదరి
4. విశ్వాస్ నగర్- ఓం ప్రకాష్ శర్మ
5. షాదారా – సంజయ్ గోయెల్
6. కరావాల్ నగర్-కపిల్ మిశ్రా
7. ఛత్తర్‌పూర్-కర్తార్ సింగ్ తన్వర్
ఈ రెండు సీట్లలో ఆప్ ముందంజలో ఉన్నారు.
1. రాజిందర్ నగర్-దుర్గేష్ పాఠక్
2. బాబర్‌పూర్ – గోపాల్ రాయ్
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న కౌంటింగ్ ప్రక్రియను అధికారులు శనివారం (ఫిబ్రవరి 8) ఉదయం 8 గంటలకు ప్రారంభించారు. ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించారు. తరువాత ఈవీఎంలను ఓపెన్ చేశారు. లెక్కింపు కోసం ఎన్నికల సంఘం ఇప్పటికే అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండటానికి లెక్కింపు కేంద్రాల దగ్గర గట్టి భద్రత ఏర్పాటు చేశారు. మొత్తం 19 లెక్కింపు కేంద్రాల వద్ద 10,000 మంది భద్రతా సిబ్బందిని మోహరించారు.
అసెంబ్లీలో మొత్తం 70 సీట్లు ఉన్నాయి. అధికారంలోకి రావాలంటే ఒక పార్టీ 36 సీట్లు గెలుచుకోవాలి. మొత్తం 699 మంది అభ్యర్థుల భవితవ్యం శనివారం (ఫిబ్రవరి 8) మధ్యాహ్నం నాటికి తేలిపోతుంది. ఈ ఎన్నికల్లో ప్రధానంగా పోటీ ఆప్, బీజేపీ మధ్యే ఉంది. కాంగ్రెస్ తన ఉనికిని చాటుకోవడానికి ప్రయత్నాలు చేసింది. మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ బీజేపీకి అనుకూలంగా ఉన్నాయి. ఇప్పటి వరకు ట్రెండ్స్ కూడా బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని చెబుతున్నాయి. బీజేపీ 50 కంటే ఎక్కువ సీట్లలో ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది.