Delhi assembly election results 2025 : ఏపీ సీఎం చంద్రబాబుకు( Chandrababu) స్వల్ప ఉపశమనం. ఢిల్లీలో బిజెపికి అనుకూల ఫలితాలు వస్తుండడంతో టిడిపి శ్రేణులు ఖుషి అవుతున్నాయి. ఢిల్లీ ఎన్నికల్లో సీఎం చంద్రబాబు ప్రచారం చేశారు. తెలుగు ప్రజలు అధికంగా ఉన్న ప్రాంతాల్లో బిజెపికి మద్దతుగా ప్రచారం చేశారు చంద్రబాబు. అయితే ఇప్పుడు ఆ ప్రాంతాల్లో బిజెపికి అనుకూల ఫలితాలు వస్తున్నట్లు ట్రెండ్ తెలియజేస్తోంది. దీంతో చంద్రబాబుతో పాటు టిడిపి శ్రేణులు సంతోషిస్తున్నాయి. ఒకవేళ అక్కడ ప్రతికూల ఫలితాలు వచ్చుంటే మాత్రం చంద్రబాబు ట్రోల్స్ కు గురయ్యేవారు. టిడిపి శ్రేణుల్లో దానిపైనే ఎక్కువ ఆందోళన ఉండేది. కానీ ఇప్పుడు బీజేపీకి అనుకూల ఫలితాలు వస్తుండడంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి.
* మహారాష్ట్రలో ప్రచార సమయంలో
కొద్ది నెలల కిందట మహారాష్ట్ర( Maharashtra) ఎన్నికలు జరిగాయి. ఆ సమయంలో సీఎం చంద్రబాబు మహారాష్ట్రలో పర్యటనకు సంబంధించి షెడ్యూల్ కూడా ఖరారు అయింది. ఇంతలో ఆయన సోదరుడు రామ్మూర్తి నాయుడు మృతి చెందారు. దీంతో చంద్రబాబు మహారాష్ట్ర ఎన్నికల పర్యటనకు వెళ్లకుండానే తిరిగి ముఖం పట్టారు. అయితే అప్పట్లో పవన్ కళ్యాణ్ ప్రచారం చేశారు. పవన్ ప్రచారం చేసిన ప్రాంతాల్లో బిజెపి కూటమి ఘన విజయం సాధించింది. దీంతో పవన్ ఒక్కసారిగా జాతీయస్థాయిలో హైలెట్ అయ్యారు. పవన్ ప్రచారం చేయడం వల్లే బిజెపి గెలిచిందన్న వాదన ప్రారంభం అయింది. సోషల్ మీడియాలో పవన్ పై ప్రశంసలు వెల్లువెత్తాయి. అయితే అప్పట్లో చంద్రబాబు ప్రచారం చేసినా ఇదే క్రెడిట్ దక్కేదన్న వాదన వినిపించింది.
* కేజ్రీవాల్ కు వ్యతిరేకంగా ప్రచారం
అయితే తాజాగా ఢిల్లీలో( Delhi) పర్యటించారు చంద్రబాబు. ఎన్నికల ప్రచారం చేశారు. బిజెపిని ఎన్నుకోవాలని ఢిల్లీ ప్రజలకు పిలుపునిచ్చారు. ఢిల్లీలో కాలుష్యం తో పాటు రాజకీయ కాలుష్యం పెరిగిపోయిందని.. అమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీని నిర్లక్ష్యం చేసింది అంటూ విమర్శలు చేశారు చంద్రబాబు. ఢిల్లీలో సైతం డబల్ ఇంజన్ గవర్నమెంట్ రావాలని ఆకాంక్షించారు. అయితే ఒకప్పటి తన మిత్రుడైన అరవింద్ కేజ్రీవాల్ వ్యతిరేకంగా చంద్రబాబు ప్రచారం చేయడంపై జాతీయ స్థాయిలో చర్చ జరిగింది. ఒకవేళ అక్కడ బిజెపి ఓడిపోతే చంద్రబాబుకు డ్యామేజ్ తప్పదన్న అభిప్రాయం వ్యక్తం అయింది. కేవలం బిజెపి పెద్దల ప్రాపకం కోసం చంద్రబాబు అంతలా విమర్శలు చేయడం తగదన్న కామెంట్స్ కూడా వినిపించాయి.
* ముందంజలో బిజెపి
అయితే ఇప్పుడు తాజాగా వెలువడుతున్న ఫలితాల్లో బిజెపి( BJP) ముందంజలో ఉంది. ఆ పార్టీ భారీ స్థాయి ఆధిక్యతతో ముందుకు సాగుతోంది. దీంతో చంద్రబాబు కొంత సంతృప్తికి గురయ్యారు. పొరపాటున అక్కడ అమ్ ఆద్మీ పార్టీ విజయం సాధిస్తే తప్పకుండా చంద్రబాబు టార్గెట్ అయ్యేవారు. కానీ బిజెపికి మెజారిటీ స్థానాలు దక్కుతుండడంతో టిడిపి శ్రేణులు సైతం ఆనందం వ్యక్తం చేస్తున్నాయి.