Delhi assembly election results 2025 : ఉదయం 8 గంటలకు నుంచి పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు మొదలైంది. భారతీయ జనతా పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ మధ్య పోటీ ఉన్నట్టు స్పష్టంగా తెలుస్తోంది. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం భారతదేశ పార్టీ పది స్థానాలలో, ఆప్ ఏడు స్థానాలలో లీడ్ లో కొనసాగుతున్నాయి. ఈనెల ఐదున ఢిల్లీ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి.. 60.54% ఓటింగ్ నమోదయింది.. శనివారం కౌంటింగ్ మొదలైంది. దీనికోసం 19 కేంద్రాలను ఏర్పాటు చేశారు. 27 సంవత్సరాల తర్వాత ఢిల్లీలో అధికారాన్ని దక్కించుకుంటామని భారతీయ జనతా పార్టీ ధీమా వ్యక్తం చేస్తోంది. తమ పార్టీ 50 సీట్లు దక్కించుకొని అధికారాన్ని సొంతం చేసుకుంటుందని ఇప్పటికే ఢిల్లీ బిజెపి అధ్యక్షుడు వీరేంద్ర ధీమా వ్యక్తం చేశారు. మరోవైపు ఎగ్జిట్ పోల్స్ అంచనా తప్పుతాయని .. తామే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఆప్ నాయకులు అంటున్నారు.. ఇక ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో పోలింగ్ బూత్ ల వారీగా పోలైన ఓట్ల జాబితాతో కూడిన ఫామ్ “17 సీ” సమాచారాన్ని అధికారిక వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచాలని ఇప్పటికే ఆప్ డిమాండ్ చేసింది. అయితే ఎన్నికల సంఘం తమ విజ్ఞప్తిని తిరస్కరించడంతో ఆప్ అధినేత అరవింద్ కేజ్రివాల్ (Arvind Kejriwal) మండిపడ్డారు.. ప్రతి బూత్ లో పోలైన ఓట్ల వారిగా వివరాలను వెల్లడించడానికి తమ పార్టీ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా పోర్టల్ ఏర్పాటు చేశామని ట్విట్టర్ ఎక్స్ లో ఆయన వెల్లడించారు.. అదే కాదు బిజెపి నాయకులు తమ పార్టీకి చెందిన 16 మంది ఎమ్మెల్యేలపై డబ్బుల వల విసిరారని.. 15 కోట్లు ఇచ్చేందుకు ముందుకు వచ్చారని అరవింద్ కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు చేశారు.. దీనిపై బిజెపి కూడా అదే స్థాయిలో స్పందించింది. లెఫ్టినెంట్ గవర్నర్ కు ఫిర్యాదు చేసింది. ఆయన ఆదేశాల మేరకు ఏసీబీ అధికారులు రంగంలోకి దిగారు. అరవింద్ కేజ్రీవాల్ కు నోటీసులు అందించారు.
బిజెపి నాయకుల ధీమా
ఢిల్లీలో అధికారం దక్కించుకుంటామని భారతీయ జనతా పార్టీ ధీమా వ్యక్తం చేస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి 27 సంవత్సరాల తర్వాత అధికారంలోకి వస్తామని స్పష్టం చేస్తోంది.. ఇప్పటికే ఎన్నికల ప్రచారంలో తమ అధికారంలోకి వస్తే ఢిల్లీని ఏం చేస్తామో చెప్పామని.. ఆప్ పరిపాలన కాలంలో ఢిల్లీలో అడ్డగోలుగా అవినీతి పెరిగిపోయిందని.. అక్రమాలు రాజ్యమేలుతున్నాయని.. ఇలాంటి సందర్భంలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారని బిజెపి నాయకులు చెబుతున్నారు. అందువల్లే ఈసారి ఎన్నికల్లో తమకే ప్రజలు పట్టం కట్టబోతున్నారని.. ఎగ్జిట్ పోల్స్ కూడా అదే విషయాన్ని వెల్లడించాయని వారు వివరిస్తున్నారు. ” చీపురు పార్టీ అవినీతిని మరో స్థాయికి తీసుకెళ్లింది. అందువల్లే ఆ పార్టీని ఢిల్లీ ఓటర్లు ఈసారి తిరస్కరించారు. కచ్చితంగా అధికారం మాదే.. ఇందులో అనుమానం ఏమాత్రం లేదు. పైగా ఎగ్జిట్ పోల్స్ కూడా ఇదే విషయాన్ని వెల్లడించాయి.. మాలో ఆత్మవిశ్వాసం ఉంది. కచ్చితంగా అధికారంలోకి వస్తాం. ఢిల్లీ రూపురేఖలను మార్చుతామని” బిజెపి నాయకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు