https://oktelugu.com/

Dowry: కట్నం తీసుకుంటే డిగ్రీ రద్దు.. సరికొత్త విధానం!

వరకట్న వేధింపుల కేసులు దేశంలో ఏటా పెరుగుతున్నాయని కేంద్ర గణాంక శాఖ విడుదల చేసిన ‘వుమెన్‌ అండ్‌ మెన్‌ ఇన్‌ ఇండియా–2022’ సర్వే వెల్లడించింది.

Written By:
  • Raj Shekar
  • , Updated On : May 18, 2023 / 03:14 PM IST

    Dowry

    Follow us on

    Dowry: ‘నేను వరకట్నం తీసుకోను.. ఇవ్వను.. ప్రోత్సహించను..’ ఇది కేరళలో విశ్వవిద్యాలయాల్లో ప్రవేశ సమయంలో ప్రతీ విద్యార్థి ఇవ్వాల్సిన హామీ. ఈ మేరకు స్వీయ అంగీకార పత్రంపై విద్యార్థులు సంతకం చేయాల్సి ఉంటుంది. దీనికితోడు తల్లిదండ్రుల సంతకం కూడా తీసుకున్న తర్వాతే విద్యార్థులకు యూనివర్సిటీల్లో, కళాశాలల్లో ప్రవేశం లభిస్తుంది. భవిష్యత్తులో వారు వరకట్నం అడిగినా, తీసుకున్నా పోలీసులతోపాటు యూనివర్సిటీకి కూడా ఫిర్యాదు చేయవచ్చు. దీనిపై వర్సిటీ వాస్తవాలు తెలుసుకుని, ఆరోపణలు నిజమని తేలితే సంబంధిత వ్యక్తుల డిగ్రీని శాశ్వతంగా రద్దు చేస్తుంది. కేరళ విశ్వవిద్యాలయాలకు కులపతిగా వ్యవహరిస్తున్న గవర్నర్‌ ఆరిఫ్‌ మహ్మద్‌ఖాన్‌ రెండేళ్ల క్రితం ఈ విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నారు. కేరళలో తీవ్ర చర్చనీయాంశమైన ఈ విధానాన్ని మన తెలంగాణలోనూ అమలు చేసే దిశగా కసరత్తు సాగుతోంది.

    గృహ హింస కేసుల్లో తెలంగాణ నంబర్‌ 2..
    వరకట్న వేధింపుల కేసులు దేశంలో ఏటా పెరుగుతున్నాయని కేంద్ర గణాంక శాఖ విడుదల చేసిన ‘వుమెన్‌ అండ్‌ మెన్‌ ఇన్‌ ఇండియా–2022’ సర్వే వెల్లడించింది. దేశవ్యాప్తంగా గృహహింస కేసులు పెరుగుతుండగా ఈ జాబితాలో 50.4 శాతంతో తెలంగాణ రెండో స్థానంలో ఉండడం గమనార్హం. 75 శాతంతో అసోం మొదటి, 48.9 శాతంతో ఢిల్లీ మూడో స్థానంలో ఉన్నాయి. గృహహింసలో అత్యధిక కేసులు వరకట్న వేధింపులకు సంబంధించినవే ఉంటున్నాయి. దీనిపై ఆందోళన వ్యక్తం చేసిన కేంద్రం… ప్రత్యేక చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలను కోరింది. ముఖ్యంగా వరకట్నం, మహిళలపై జరుగుతున్న నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించింది. ఈ నేపథ్యంలో వరకట్నానికి వ్యతిరేకంగా కేరళ అనుసరిస్తున్న విధానంపై హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో సీనియర్‌ ఫ్యాకల్టీగా ఉన్న శ్రీనివాస్‌ మాధవ్‌ అధ్యయనం చేశారు.

    కేరళలో గణనీయమైన మార్పు..
    కేరళలో రెండేళ్ల క్రితం ఈ విధానం అమల్లోకి వచ్చినప్పటి నుంచి వరకట్నంపై విద్యార్థులు, తల్లిదండ్రుల ఆలోచనలో గణనీయమైన మార్పు వచ్చిందని ఆయన గుర్తించారు. ఇలాంటి విధానం రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో కూడా అమలు చేసే విషయాన్ని పరిశీలించాలని రాష్ట్ర మహిళా కమిషన్‌కు ప్రతిపాదన పంపారు. దీనిపై కమిషన్‌ సానుకూలంగా స్పందించింది. కేరళ ప్రభుత్వ నిర్ణయాలను పరిశీలించి, విధి విధానాలపై కసరత్తు చేస్తున్నట్టు తెలిసింది. త్వరలో ఉన్నత విద్యామండలి, మహిళా, శిశు సంక్షేమ శాఖ ఉన్నతాధికారులతో సమావేశమై నిర్ణయం ప్రకటించే అవకాశాలు ఉన్నాయని అధికారవర్గాలు పేర్కొంటున్నాయి.