Indian Coast Guard : ఇండియన్ కోస్ట్ గార్డ్ డీజీ మృతి.. రక్షణ మంత్రి పర్యటనలో ఉండగానే కుప్పకూటిన అధికారి.. సంతాపం తెలిపిన రాజ్‌నాథ్ సింగ్

ఇండియన్ కోస్ట్ గార్డ్ డీజీ రాకేశ్ పాల్(59) ఆదివారం సాయంత్రం కన్నుమూశారు. కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పర్యటనలో ఉండగానే, డీజీ రాకేశ్ పాల్ కు గుండెపోటు వచ్చింది. దీంతో అక్కడే కుప్పకూలిపోయారు.

Written By: Raj Shekar, Updated On : August 19, 2024 3:41 pm

Indian Coast Guard Director General Rakesh Paull

Follow us on

Indian Coast Guard : ఇండియన్ కోస్ట్ గార్డ్ డైరెక్టర్ జనరల్ గా ఉన్న రాకేశ్ పాల్ (59) కన్నుమూశారు. దేశ రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆయన చెన్నై వచ్చారు. కేంద్ర మంత్రిని రిసీవ్ చేసుకునేందుకు చెన్నై విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడే ఆయన ఒక్కసారిగా కుప్పకూలి పడిపోయారు. దీంతో ఆయనను వెంటనే రాజీవ్ గాంధీ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రాత్రి 7 గంటలకు కన్నుమూశారు. విషయం తెలుసుకున్న రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ హుటాహుటిన దవాఖానకు చేరుకొని రాకేశ్ పాల్ భౌతికకాయానికి నివాళులర్పించారు. నేవీకి సంబంధించిన ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు కేంద్ర రక్షణ మంత్రి వస్తున్న నేపథ్యంలో ఆయన ఢిల్లీకి ఆదివారం (ఆగస్ట్ 18) ఉదయం చేరుకున్నారు. ఈ క్రమంలో ఒక్కసారిగా గుండెపోటు వచ్చింది. 34 ఏండ్లుగా వివిధ హోదాల్లో కోస్ట్ గార్డుకు సేవలందించిన రాకేశ్ పాల్ క్రమశిక్షణ, నిబద్ధత కలిగిన అధికారిగా గుర్తింపు సంపాదించుకున్నారు. ఇండియన్ కోస్ట్ గార్డ్ చేపట్టిన సక్సెస్ ఫుల్ ఆపరేషన్లలో ఆయన పాత్ర కీలకంగా ఉన్నట్ల తెలుస్తున్నది. ఇక రాకేశ్ పాల్ మృతదేహాన్ని సోమవారం (ఆగస్ట్ 19) ఢిల్లీకి తీసుకువచ్చారు. రాకేశ్ మృతిపై కేంద్ర రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్ సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలుపుతూ పోస్ట్ పెట్టారు. ‘ఎంతో సమర్ధత, నిబద్ధత కలిగిన అధికారిని కోల్పోయాం’ అని చెప్పుకొచ్చారు. ఆయన నాయకత్వంలో ఇండియన్ కోస్ట్ గార్డ్ దేశ సముద్ర భద్రతను బలోపేతం చేయడంలో ఎంతో పురోభివృద్ధి సాధించిందని తెలిపారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి అంటూ ప్రకటించారు. చెన్నైలో కోస్ట్ గార్డ్ మారిటైమ్ రెస్క్యూ, కో ఆర్డినేషన్ సెంటర్ ను ప్రారంభించేందుకు రాజ్ నాథ్ సింగ్ చెన్నైకి వస్తున్నారు. ఇదే కార్యక్రమంలో పాల్గొనేందుకు కోస్ట్ గార్డ్ చీఫ్ రాకేశ్ పాల్ చెన్నైకు చేరుకున్నారు. ఈ క్రమంలో నే ఆయనకు గుండెపోటు వచ్చింది. దవాఖానకు తరలించినా ఫలితం లేకుండా పోయింది. ఆయన రాత్రి 7 గంటలకు కన్నుమూశారు.

ఇక రాకేశ్ పాల్ స్వరాష్ర్టం యూపీ. 2023లో ఆయన కోస్ట్ గార్డ్ 25వ డీజీగా నియమించబడ్డారు. ఆయన ఐఎన్ఏ పూర్వ విద్యార్థి. ముందుగా 1989 జనవరిలో ఆయన కోస్ట్ గార్డ్ లో చేరారు. సుమారు 34 ఏండ్ల అనుభవం ఉంది. ద్రోణాచార్య, ఇండియన్ నేవీ స్కూల్, కొచ్చి, యూకేలలో వృత్తిపరంగా నైపుణ్యాన్ని పెంచుకునేందుకు పలు కోర్సులు చేశారు. ఇక ఆయన కమాండర్, డిప్యూటీ డీజీ వంటి ప్రధాన బాధ్యతలను ఢిల్లీలోని కోస్ట్ గార్డ్ కార్యాలయంల నిర్వర్తించారు.

ఇక సమర్థ్, అహల్యాబాయి, సుచేత కృపాలానీ, సీ 03 వంటి భారత నౌకలకు సారథ్యం వహించారు. ఆయన నేతృత్వంలో కోస్ట్ గార్డ్ నిర్వహించిన ఎన్నో ఆపరేషన్లు విజయవంతమయ్యాయి. ఇటీవల పెద్ద ఎత్తున మాదక ద్రవ్యాలు, కోట్లాది రూపాయాల విలువైన బంగారాన్ని పట్టుకోవడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. 34 ఏండ్ల పాటు కోస్ట్ గార్డ్ లో సేవలందించి తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు.

ఎందరో యువ అధికారులకు రోల్ మోడల్ గా ఆయన ఉన్నారు. రాకేశ్ పాల్ మృతిపై పలువురు నేతలు, అధికారులు దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఆయనకు నివాళులర్పించేందుకు కోస్ట్ గార్డ్ ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నది. దేశానికి ఇది తీరని లోటని ప్రకటించింది.