
తెలంగాణలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే రామలింగారెడ్డి మృతితో దుబ్బాకలో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ ఎన్నికకు నోటిఫికేషన్ రాకముందు నుంచే దుబ్బాకలో రాజకీయ వేడిరాజుకుంది. అధికార టీఆర్ఎస్ పార్టీకి ధీటుగా బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు దుబ్బాకలో ప్రచారంతో హోరెత్తించాయి. ఇటీవలే దుబ్బాకలో ఉప ఎన్నికల పోలింగ్ జరగగా నేడు రిజల్ట్ వెలువడింది.
దుబ్బాక బరిలో బీజేపీ నుంచి రఘునందన్ రావు.. టీఆర్ఎస్ నుంచి దివంగత రామలింగారెడ్డి భార్య సుజాత.. కాంగ్రెస్ నుంచి చెరుకు శ్రీనివాస్ రెడ్డి నిలిచారు. నేటి ఉదయం నుంచి దుబ్బాకలో ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. మొత్తం 23రౌండ్లలో ఓట్ల లెక్కింపు కొనసాగింది. తొలి రౌండ్ నుంచి బీజేపీ స్పల్ప మెజార్టీ సాధిస్తూ ముందుకెళ్లింది. అయితే టీఆర్ఎస్ సుజాత కొన్ని రౌండ్లలో బీజేపీని వెనక్కి నెడుతూ ముందుకొచ్చింది.
23వ రౌండ్ వరకు విజయం ఎవరివైపు మొగ్గుతుందో తెలియని ఉత్కంఠను రేపింది. అయితే 23వ రౌండ్ తర్వాత బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు 1,118ఓట్ల మెజార్టీతో గెలుపొందాడు. హోరాహోరీ పోరులో బీజేపీ విజయం సాధించడంతో బీజేపీ శ్రేణులు రోడ్లపైకి బాణాసంచా పేలుస్తూ సంబరాలు చేసుకున్నాయి.
దుబ్బాక ఎన్నికపై కేసీఆర్ తనయుడు.. కేటీఆర్ స్పందించారు. దుబ్బాక ఫలితం వచ్చిన వెంటనే ఆయన మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు. దుబ్బాక ఉప ఎన్నిక ఫలితం తమకు గుణపాఠమని.. ఈ ఓటిమిపై పార్టీలో సమీక్షించుకుంటామని కేటీఆర్ తెలిపారు. విజయాలకు పొంగిపోము.. అపజయాలకు కుంగిపోమని స్పష్టం చేశారు.
ఈసందర్భంగా దుబ్బాకలో టీఆర్‌ఎస్‌కు ఓటేసిన ప్రజలకు.. గెలుపు కోసం శ్రమించిన మంత్రి హరీశ్‌రావుకు కేటీఆర్ ధన్యవాదాలు చెప్పారు. దుబ్బాక ఫలితం మేం ఆశించినవిధంగా రాలేదని చెబుతూనే గత ఆరున్నరేళ్లలో టీఆర్ఎస్ ఎన్నో విజయాలు సాధించిందని గుర్తుచేశారు. దుబ్బాక తీర్పును తాము లోతుగా విశ్లేషించుకునేందుకు అవకాశం కల్పించిందని కేటీఆర్ తెలిపారు. అయితే దుబ్బాక ఉప ఎన్నిక ఫలితం మాత్రం రాష్ట్రంలో టీఆర్ఎస్ కు వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని తేల్చినట్లు కన్పిస్తోంది