India Forex Reserves: రోజురోజుకు ఎదుగుతున్న భారత ఆర్థిక వ్యవస్థ చాలా రోజులుగా విదేశీ పెట్టుబడులను ఆకర్షి్స్తున్నది. అయితే 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వెలువడిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) గణాంకాలను పరిశీలిస్తే దేశంలో ఎఫ్‌డీఐలు తగ్గుముఖం పట్టాయి. పెట్టుబడికి అత్యంత ఆకర్షణీయమైన గమ్యస్థానంగా ఉన్న భారతదేశ ఖ్యాతి తగ్గిపోయిందా లేదా మరేదైనా ఇతర కారణాలు ఉన్నాయా అనే సందేహాలు ఇప్పుడు వ్యక్తమవుతున్నాయి.
భారతదేశం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) 2023-24లో 3.49 శాతం తగ్గి 44.42 బిలియన్ డాలర్లకు చేరుకుంది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో 46.03 బిలియన్ డాలర్ల విలువైన ఎఫ్‌డీఐ దేశంలోకి వచ్చింది. ఎఫ్‌డీఐ పెట్టుబడులపై పనిచేస్తున్న ప్రభుత్వ సంస్థ డిపార్ట్‌మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ (డీపీఐఐటీ) ఇందుకు సంబంధించి వివరణాత్మక గణాంకాలను వెల్లడించింది.
ఎఫ్‌డీఐ తగ్గడానికి కారణాటేంటి?
డీపీఐఐటీ డేటా ప్రకారం, దేశంలో ఎఫ్‌డీఐ తగ్గడానికి ప్రధాన కారణం సేవలు, కంప్యూటర్ హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్, టెలికాం, ఆటోమొబైల్, ఫార్మాస్యూటికల్ రంగాల్లో తక్కువ పెట్టుబడి. అయితే, 2023-24 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో ఎఫ్‌డీఐలోమెరుగుదల కనిపించింది. జనవరి-మార్చి త్రైమాసికంలో ఎఫ్‌డీఐ ఇన్‌ఫ్లో 33.4 శాతం పెరిగి 12.38 బిలియన్ డాలర్లకు చేరుకుంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం 2022-23 ఇదే త్రైమాసికంలో ఇది 9.28 బిలియన్ డాలర్లుగా ఉంది.
గత మూడేళ్ల విదేశీ పెట్టుబడులు
ఎఫ్‌డీఐ ఇన్‌ఫ్లోతో పాటు, ఈక్విటీలో విదేశీ పెట్టుబడులు, దేశంలోని ఆదాయాల రీ ఇన్వెస్ట్‌మెంట్, విదేశీ మూలధనంపై కూడా డీపీఐఐటీ డేటాను విడుదల చేసింది. దీని ప్రకారం, 2023-24లో దేశంలోకి మొత్తం $70.95 బిలియన్ల ప్రత్యక్ష పెట్టుబడులు వచ్చాయి. ఇది 2022-23లో మొత్తం $71.35 బిలియన్ల పెట్టుబడి కంటే తక్కువ. 2022-23లో భారతదేశ ఎఫ్‌డీఐలో 22 శాతం క్షీణత ఉంది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో, దేశం గరిష్టంగా 84.83 బిలియన్ డాలర్ల విదేశీ పెట్టుబడులను పొందింది.
పెట్టుబడులు పెట్టిన దేశాలు ఇవే..
2023-24 ఆర్థిక సంవత్సరంలో మారిషస్, సింగపూర్, అమెరికా, బ్రిటన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, కేమన్ దీవులు, జర్మనీ, సైప్రస్‌ల నుంచి భారత్‌కు వచ్చిన ఎఫ్‌డీఐ తగ్గుదల నమోదైంది. అయితే, నెదర్లాండ్స్, జపాన్ నుంచి మాత్రం పెట్టుబడులు పెరిగాయి.
2023-24 ఆర్థిక సంవత్సరంలో, మహారాష్ట్ర దేశంలోనే అత్యధికంగా 15.1 బిలియన్ డాలర్ల ఎఫ్‌డీఐని పొందింది. 2022-23లో ఈ సంఖ్య 14.8 బిలియన్ డాలర్లుగా ఉంది. దీని తర్వాత గుజరాత్‌కు 2022-23లో 4.7 బిలియన్ డాలర్లు అంటే 7.3 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చాయి. తమిళనాడు, తెలంగాణ, జార్ఖండ్‌లలో ఎఫ్‌డీఐలు కూడా పెరిగాయి. ఢిల్లీ, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, హర్యానాలలో ఎఫ్‌డీఐ పడిపోయింది.