Governor: ఆంధ్రప్రదేశ్ లో అప్పుల గోల రగులుతోంది. తెచ్చిన అప్పులకు గవర్నర్ ను బాధ్యులను చేయడంతో వివాదం మొదలయింది. ప్రభుత్వం తెస్తున్న అప్పులకు గవర్నర్ పేరు వాడుకోవడంతో గొడవ జరుగుతోంది. రాజ్యాంగాధినేత గవర్నర్ పేరు చేర్చి అప్పులు తీసుకురావడంతో గవర్నర్ వైపు నుంచి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో రాష్ర్టంలో ఈ విషయాలు గవర్నర్ కు తెలియకుండా ఉంటాయా అనే ప్రశ్నలు వస్తున్నాయి.

నిబంధనల ఉల్లంఘనపై గవర్నర్ కు ఇప్పుడు తెలిసిందా? ఇన్నాళ్లు గుట్టుగా సాగిన వ్యవహారం ఇప్పుడు ఎలా బయటకు వచ్చిందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇదంతా ఓ పద్దతి ప్రకారం జరుగుతోందంటూ వాదనలు వినిపిస్తున్నాయి. బ్యాంకులు కూడా ఇప్పుడు టెన్షన్ పడటంలో అర్థం లేదనే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. దీంతో రాష్ర్ట ప్రభుత్వ నిర్వాకంపై గతంలోనే ప్రతిపక్షాలు గవర్నర్ కు సైతం ఫిర్యాదు చేసినా పట్టించుకోని గవర్నర్ ఇప్పుడు ఈ వివాదం తీసుకురావడంతో ప్రతిపక్షాలు సైతం అనుమానిస్తున్నాయి.
న్యాయస్థానం నుంచి తప్పించుకోవాలనే ప్రయత్నాల్లో భాగంగానే ప్రభుత్వం ఇలా చేస్తుందని తెలుస్తోంది. ప్రభుత్వం తెచ్చే అప్పులకు గవర్నర్ పేరు వాడుకోవడం ఎక్కడ కూడా ఉండదు. కానీ ఇక్కడ ఆయన పేరు వాడుకోవడంలో అసలు విషయం ఏమిటన్నది అంతుచిక్కడం లేదు. దీంతో అందరిలో మిలియన్ డాలర్ల ప్రశ్నలు మెదులుతున్నాయి.
గవర్నర్ తీరుతో ప్రభుత్వం ఉరుకులు పరుగులు పెడుతోంది. అప్పులు తీసుకోవడంలో గవర్నర్ పేరు వాడుకోవడంతో అసలు ఆయన పేరు ఎందుకు వాడాల్సి వచ్చిందో అనే దానికి సమాధానాల కోసం వెతుకుతోంది. ప్రభుత్వ ప్రతిష్ట దిగజారకుండా చూసేందుకు వైసీపీ నేతలు తంటాలు పడుతున్నారు. రాజ్ భవన్ వేదికగా వైసీపీ నానా ప్రయత్నాలు చేస్తోంది. దీంతో అందరిలో అనుమానాలు వస్తున్నాయి. గవర్నర్ పాత్రపై అప్పుడే విచారణ జరుగుతుందని తెలుస్తోంది.