Gadapa Gadapaku YCP: అనుకున్నట్టే అయ్యింది. వైసీపీ ప్రజాప్రతినిధులు, నేతలకు గట్టి ఎదురుదెబ్బే తగిలింది. గడప గడపకు మన ప్రభుత్వం అంటూ బయలుదేరిన మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలకు ప్రజల నుంచి ప్రతిఘటనలు, నిలదీతలు, ప్రశ్నల పరంపర ఎదురైంది. సమస్యలపై ఎక్కడికక్కడ నిలదీస్తూ ప్రజలు చుక్కలు చూపించారు. అక్రమ, నకిలీ సారా, కరెంటు కోతలు, పన్నల బాదుడుపై జనాగ్రహం ఎగసిపడింది. పథకాలు, జగన్ హామీలపై నిలదీస్తున్న ప్రజల మధ్య నిలబడలేక నేతలు ఉక్కిరిబిక్కిరయ్యారు. అంతే వేగంగా అక్కడ నుంచి జారుకున్నారు. ప్రభుత్వ పథకాలు ప్రచారం చేస్తూ రాజకీయం చేద్దామనుకున్న నేతలకు చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. అధినేత జగన్ ఫేమ్ ను పెంచుదామని భావిస్తే వారికి ఎక్కడికక్కడే చుక్కెదురయ్యింది. రాష్ట్ర వ్యాప్తంగా గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి విశేషస్పందన లభించిందని జగన్ మీడియాలో పతాక శీర్షికన వార్తలు రాసినా.. క్షేత్రస్థాయిలో మాత్రం ఏమంత ఆశాజనకంగా లేదు. తొలిరోజే నేతలకు చుక్కలు కనిపించాయి. ఆదోని ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి ‘గడప గడపకు..’లో భాగంగా విరుపాపురం అనే గ్రామంలో పర్యటించారు. ఆయనను అల్లంత దూరంలో చూడగానే ఈరమ్మ అనే మహిళ ఆగ్రహంతో ఊగిపోయారు. మీకు దండం పెడతాను మా ఇంటి దగ్గరకు రావద్దు.. మీకు చెప్పినా ఒక్కటే… గోడకు చెప్పినా ఒక్కటే. మీ వల్ల ఏ సమస్యలూ తీరవు అంటూ అగ్రహంతో వ్యాఖ్యానించడంతో సాయిప్రసాదరెడ్డి ఒక్కసారిగి నిశ్చేష్టులయ్యారు. అలా కాదమ్మ.. వచ్చి నీ సమస్య ఏంటో చెప్పు అని ఎమ్మెల్యే కోరినా కోపంతో ఇంటికి వెళ్లిపోయింది.
తిరుపతి జిల్లా నగరి పరిధిలో వడమాలపేట మండలం కల్లూరులో పర్యటించిన మంత్రి రోజాకు ప్రజలు చెడుగుడు ఆడేశారు. అంజయ్య అనే వ్యక్తి కరెంటు చార్జీల పెంపుపై రోజాను నిలదీశారు. అమ్మఒడి ఇస్తున్నారు… కానీ కరెంటు చార్జీలు పెంచేశారు… ఎలా కట్టాలి అంటూ ఆమెను ఓ గ్రామస్థుడు సూటిగా ప్రశ్నించారు. చంద్రబాబు తెలివంతా చూపించొద్దంటూ సమాధానం దాటవేసి అక్కడ నుంచి ఆమె ముందుకు సాగారు. తెలంగాణలో వేతనాలు 2వేలు పెంచారని, ఇక్కడ తమకు కూడా పెంచాలని ఓ ఆశా వర్కర్ కోరగా, అది స్టేట్ పాలసీ అంటూ జారుకున్నారు.
Also Read: Former Minister Narayana: నారాయణ అరెస్ట్ ఎపిసోడ్ లో ప్రభుత్వానికి చుక్కెదురు
మా సమస్యలేవీ పరిష్కారం కావడం లేదు. ప్రశ్నిస్తే మాత్రం మమ్మల్ని టీడీపీ కింద జమ కడతారా? ఇదెక్కడి న్యాయం? అంటూ కర్నూల జిల్లా మద్దికెరలో ఎమ్మెల్యే శ్రీదేవికి స్థానికులు చుట్టుముట్టారు. మండల కేంద్రంలోని నాగులబావి వీధికి చెందిన గుడికాటి లక్ష్మణస్వామి, వెంకమ్మ, శివ, రామలక్ష్మమ్మ, లక్ష్మీదేవితోపాటు మరికొంత మంది మహిళలు తమ సమస్యలపై ఎమ్మెల్యేను నిలదీశారు. తాను చిన్న కూరగాయల కొట్టు పెట్టుకుని జీవనం సాగిస్తున్నానని, జగనన్న తోడు కింద రూ.10000 వేలు వడ్డీలేని రుణమని ఇచ్చారని, బ్యాంక్ వారు మాత్రం వడ్డీ పట్టుకున్నారని ఇదేమి తోడంటూ వెంకమ్మ అనే మహిళ నిలదీశారు. నాగులబావి, గిడ్డయ్య వీధికి చెందిన మహిళలు తమ ప్రాంతాలలో గుక్కెడు నీటి కోసం అల్లాడుతున్నామన్నారు. కాగా వైసీపీ నాయకులు ప్రశ్నించిన వారిపై ఎదురు దాడికి దిగారు. మీరు తెలుగుదేశం పార్టీకి చెందిన వారా… మమ్మల్నే ప్రశ్నిస్తారా అంటూ ఎదురుదాడికి దిగగా, స్థానికులు కూడా దీటుగా వాగ్వాదానికి దిగారు.
అనకాపల్లి జిల్లా చోడవరం ఎమ్మెల్య కరణం ధర్మశ్రీకి సమస్యల సెగ తగిలింది. టి.అర్జాపురంలో పర్యటించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల గురించి ఏకరువు పెట్టబోయిన ఆయనకు స్థానిక మహిళల నుంచి అనూహ్య ప్రతిఘటన ఎదురైంది. మీ పథకాల సంగతి దేవుడెరుగు. గ్రామంలో నాటుసారా ఏరులై పారుతోంది. విచ్చలవిడిగా అమ్మకాలు సాగుతున్నాయి. మగాళ్లు రోజూ తాగొచ్చి మమ్మల్ని తంతున్నారు. పుస్తెలు కూడా అమ్మేసి…ఆ డబ్బును తాగడానికి తగలేస్తున్నారు. ముందు గ్రామంలో నాటుసారా నిరోధానికి చర్యలు చేపట్టండి…అంటూ నిలదీశారు. దీంతో ఎమ్మెల్యే ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు.
కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాంకు నిలదీత తప్పలేదు. మహిళలు మూకుమ్మడిగా విరుచుకుపడ్డారు. తాగునీటి సౌకర్యం కల్పించాలని, రోడ్డు నిర్మాణం చేపట్టాలంటూ నిలదీశారు. కర్నూలు జిల్లా ఆలూరు మండలం హత్తిబెళగల్‌లో పర్యటించిన ఆయన ముందు సమస్యలపై ప్రజలు గళమెత్తారు.
Also Read:Sedition Law: ఇక రాజద్రోహం కేసు కుదరదు.. పాలకులకు సుప్రిం కోర్టు షాక్
Recommended Videos